. తీవ్రత 8.8గా నమోదు కమచట్కా దీవులే కేంద్రం
. సునామీ హెచ్చరికలు జారీ జపాన్‌పై ప్రభావం
. పసిఫిక్ దేశాలు అప్రమత్తం : హువాయ్‌ను తాకిన సునామీ తరంగాలు
. అమెరికా తీర ప్రాంతాలు అలర్ట్
మాస్కో : రష్యాలోని కమచట్కా దీవుల్లో బుధవారం భారీ భూకంపం సంభవించింది. దీని తీవ్రత 8.8 తీవ్రతగా నమోదైంది. శక్తిమంతమైన భూ ప్రకంపనలతో జపాన్ సైతం వణికిపోయింది. సునామీ హెచ్చరికలు జారీ అయ్యాయి. కమచట్కా దీవుల్లో 3.5 మీటర్ల నుంచి 5 మీటర్ల వరకు సునామీ అలలు నమోదయ్యాయి. జపాన్, హువాయ్, అమెరికా పశ్చిమ తీరం, ఇతర పసిఫిక్ దేశాలకు ప్రమాద హెచ్చరికలు జారీ అయ్యాయి. 1952 తర్వాత ఇంత శక్తిమంతమైన భూకంపం రావడంతో ఇదే మొదటిసారిగా రష్యా సైన్స్ అకాడమీ వెల్లడిరచింది. అమెరికా తీర ప్రాంతాలు, అలాస్కా, హువాయ్, కోస్టారికా, న్యూజిలాండ్‌కు ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. హోనోలులూలో సైరన్లు మోగాయి. సునామీ ముప్పు ఏర్పడిన ప్రాంతాల ప్రజలు ఎత్తైన పర్వాతాలకు తరలిపోయి. జపాన్‌లోని హోక్కైడోలో 40 సెంటీమీటర్ల సునామీని గుర్తించారు. రష్యాలోని సెవెరోకురిలిస్క్‌లో సునామీ అలలు ఎగిసిపడ్డాయి. అక్కడి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు అధికారులు తరలించారు. సునామీ ముప్పును పసిఫిక్ సునామీ హెచ్చరికల కేంద్రం ధ్రువీకరించింది. ముందస్తు జాగ్రత్తలను సూచించింది. అమెరికా కోస్తా ప్రాంతాలు, ఓరెగాన్‌నూ అప్రమత్తం చేసింది. కాలిఫోర్నియా
ఓరేగాన్ తీరంలో 3 మీటర్ల ఎత్తు వరకు అలులు ఎగిసిపడ్డాయి. ఉత్తర కాలిఫోర్నియా క్రెసెంట్ నగరంలో భారీగా అలలు ఎగిసిపడ్డాయి. జాతీయ సునామీ హెచ్చరిక కేంద్రం ప్రకారం అలల ఎత్తు 3.6 అడుగులుగా నమోదైందని తెలుస్తోంది. కేప్ మెండోసినో నుంచి ఓరెగాన్ సరిహద్దు వరకు ప్రజలను అప్రమత్తం చేశారు. అరెనా కోవ్‌లో 1.6`3 అడుగుల ఎత్తు వరకు అలలు ఎగిపడ్డాయి. అయితే ఎక్కడ కూడా ఆస్తి, ప్రాణ నష్టం జరిగినట్లు సమాచారం లేదు. ఇదిలావుంటే, పెట్రోపావ్లోవ్స్క్-కమచట్కాలో భారీ భూకంపంతో రష్యాలోని కురిల్ దీవులు, జపాన్‌లోని హక్కైడో దీవులను సునామీ తరంగాలు తాకాయని తెలుస్తోంది. ఈ భూకంప కేంద్రం రష్యాలోని కమచట్కా ద్వీపకల్పంలోని పెట్రోపావ్లోవ్స్క్ నుంచి తూర్పున 136 కిలోమీటర్లు దూరంలో, 19 కిలోమీటర్లు లోతులో ఉందని అమెరికా జియోలాజికల్ ప్రకారం. భూకంపం ధాటికి తీర ప్రాంతాల్లోని నివాస గృహాలు, భవనాలు ఊగిపోయాయి. ప్రజలు భయంతో బయటకు పరుగులు తీశారు. ఇంఉసదకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరలయ్యాయి. కొన్ని ప్రాంతాల్లో 8-10 సెకన్లు, లేదా అంతకన్నా ఎక్కువసేపు భూమి కంపించినట్లు తెలుస్తోంది. నేషనల్ వెదర్ సర్వీస్ ప్రకారం అర్ధరాత్రి 12:30కు పశ్చిమ తీరాన్ని సునామీ తరంగాలు తాకే అవకాశం ఉంది. కాలిఫోర్నియా పశ్చిమ తీరంలోని ఇతర ప్రాంతాల్లో సునామీ రావచ్చని తెలిపింది. లా జొల్లా, ఓషన్‌సైడ్ ప్రాంతాలను సునామీ తరంగాలు తాకే అవకాశం ఉందని పేర్కొంది. దీంతో ఆస్తి, ప్రాణ నష్టం సంభవించకుండా తీర ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. కాగా, తీవ్రత తగ్గడంతో చాలా ప్రాంతాల్లో సునామీ హెచ్చరికలను ఉపసంహరించుకున్నట్లు సమాచారం.
జపాన్ నుంచి 20 లక్షల మంది తరలింపు
భారీ భూకంపం వల్ల సునామీ ముప్పు ఏర్పడిన క్రమంలో జపాన్ తమ ప్రజల ప్రాణాలకు రక్షణ కల్పించేందుకు యుద్ధ ప్రతిపదికన చర్యలు చేపట్టింది. 229 మున్సిపాలిటీల నుంచి రెండు మిలియన్ల (20లక్షలు) మందిని సాయంత్రం 5 గంటలలోపు సురక్షిత ప్రాంతాలకు తరలించింది. ఈ మేరకు అక్కడి ప్రభుత్వ అధికారులు తెలిపారు. సముద్రం వద్దకు వెళ్లవద్దని, ఏ క్షణంలోనూ సునామీ రావచ్చని హెచ్చరించారు. అటు ఫుకుషిమా అణు కేంద్రంలో పనిచేసే కార్మికులందరినీ తరలించేశారు. 2011లో జపాన్‌లో సంభవించిన ప్రకృతి విలయానికి రేడియో ధార్మిక విపత్తు సంభవించిన క్రమంలో అప్రమత్తంగా వ్యవహరించినట్లు టీఈపీసీఓ వెల్లడిరచింది. చీఫ్ కేబినెట్ సెక్రటరీ యొషిమాసా హయాషి స్పందిస్తూ ఎవరికి గాయాలు అయినట్లు, లేదా నష్టం వాటిల్లినట్లు తమకు సమాచారం లేదన్నారు. అణు కేంద్రాల వద్ద ఎలాంటి ప్రమాదకర పరిస్థితి నెలకొనలేదని అన్నారు.
మాక్యూసెస్ దీవుల్లో 4 మీటర్ల అలలు
ఫ్రెంచ్ పసిఫిక్ మాక్యూసెస్ దీవుల్లో 4 మీటర్ల ఎత్తైన అలలు ఎగిసిపడే ప్రమాదమున్నట్లు ఫ్రెంచ్ పాలినేసియా అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఉవాహుకా, నుకు హివా, హివాఓ ప్రాంతాలను ఈ అలలు చేరుకుంటాయని వెల్లడిరచారు. దీపకల్పంలోని మిగతా దీవుల్లో 0.60 మీటర్ల నుంచి 0.90 మీటర్ల వరకు ఎత్తైన అలలు సంభవిస్తాయని అధికారులు హెచ్చరించారు.
భారత్‌కు ముప్పులేదు
భారత్‌కు ముప్పు లేదని ఇన్‌కాయిస్ పేర్కొంది. హిందూ మహా సముద్ర తీర ప్రాంతాలకు ముప్పు లేదని వెల్లడిరచింది. శక్తిమంతమైన భూకంపం సంభవించినప్పటికీ ఉత్తర పసిఫిక్, భారత కోస్తా ప్రాంతాలను అప్రమత్తం చేసినప్పటికీ దేశానికి ఎటువంటి నష్టం జరిగే అంచనా లేదని పేర్కొంది. అత్యవసర పరిస్థితులకు సిద్ధంగా ఉండాలంటూ శాన్ ఫ్రాన్సిస్కోలోని భారత కాన్సులేట్ జనరల్ కార్యాలయం హెచ్చరికలు జారీచేసింది. అమెరికా పశ్చిమ కోస్తా రాష్ట్రాలపై సునామీ ప్రభావం దృష్ట్యా కాలిఫోర్నియా, హువాయ్‌లోని భారతీయులంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వారి కోసం అత్యవసర సహాయ నంబర్‌ను ఏర్పాటు చేసింది.