ములుగు జిల్లాను అడవి జిల్లాగా తీర్చిదిద్దుదాం : మంత్రి సీతక్క

దిశ, ములుగు ప్రతినిధి: నేటి బాలలే రేపటి భావితరాల పౌరుల తరహాలోనే ఈనాటి మొక్కలే రేపటి భారీ వృక్షాలుగా తయారవుతాయని, ప్రతి ఒక్కరూ మొక్కలను నాటి పర్యావరణాన్ని కాపాడుకోవాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అన్నారు. శుక్రవారం ములుగు మండలం ఇంచర్ల గ్రామంలో ని ఏకో పార్కులో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క, జిల్లా కలెక్టర్ దివాకర్ టి.ఎస్, ఆర్ పి ఎఫ్ 39 బెటాలియన్ కమాండెంట్ ప్రశాంత్ కుమార్, టి జి ఎస్ పి 5 వ బెటాలియన్ కమాండెంట్ సుబ్రమణ్యం, డీఎఫ్ఓ రాహుల్ కిషన్ జాదవ్, జిల్లా గ్రంథాలయ చైర్మన్ బానోతు రవిచందర్, ములుగు మార్కెట్ కమిటీ చైర్మన్ రేగ కళ్యాణి లతో కలిసి వన మహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించి మొక్కలు నాటారు.

ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ.. 25 వేల మొక్కలు నాటాలనే లక్ష్యంతో సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవడం ఆశించదగ్గ విషయమని అన్నారు. ములుగు జిల్లా పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చెందుతుందని పర్యాటక ప్రాంతం తో పాటు దట్టమైన అడవులు ఉండటం పర్యాటకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయని అన్నారు. ఈకో ప్రాంతంలో వాచ్ టవర్, వాక్ ఫాల్స్ ఏర్పాటు చేయడం చెప్పుకోదగ్గ విషయమని, అడవులను రక్షిస్తూనే పచ్చదనాన్ని కాపాడుకోవాలని సూచించారు. స్వచ్ఛమైన గాలి ద్వారా వారి ఆయుష్ పెరుగుతుందని, అడువులను కాపాడే విషయంలో తగు చర్యలు తీసుకోవాలని సూచించారు. ములుగు జిల్లాను అడవి జిల్లాగా తీర్చిదిద్దడానికి ప్రతి ఒక్కరూ కృషి చేస్తూ పర్యావరణాన్ని కాపాడుకోవాలని ఆమె సూచించారు. ఈ కార్యక్రమంలో ఏపీఓ వసంతరావు, ఏ పి డి వెంకటనారాయణ, ఎఫ్ ఆర్ ఓ లు, ఎఫ్ డి ఓ లు, రేంజర్లు, ప్రజా ప్రతినిధులు, సంబంధిత అధికారులు,విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Comment