August Financial Changes: ఆగష్టులో జరగనున్న కీలక ఆర్థిక మార్పులివే..!

దిశ, బిజినెస్ బ్యూరో: సాధారణంగా ప్రతి నెలా ఆర్థికపరమైన మార్పులు జరుగుతుంటాయి. అలగగే, ఈ ఆగస్టులోనూ కొన్ని కీలక మార్పులు మన దైనందిన జీవితంలో జరగనున్నాయి. ఇవి మన రోజువారీ లావాదేవీలు, ప్రయాణం, కార్డ్ ప్రయోజనాలపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపనున్నాయి. కొత్తగా ఫాస్టాగ్ వార్షిక పాస్ టోల్ ప్లాజాలకు సంబంధించి ముఖ్యమైన మార్పు ఈ నెలలోనే ప్రారంభం కానుంది.

ఫాస్టాగ్ వార్షిక పాస్

ఆగస్టు 15 నుంచి ప్రైవేట్ వాహనాలకు ఏదాదికొకసారి టోల్ చెల్లించే సౌకర్యాన్ని రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ ప్రారంభించనుంది. ఈ పాస్ ఒక ఏడాదికి రూ. 3,000 చెల్లించి 200 ట్రిప్పుల వరకు పనిచేస్తుంది. దీని ద్వారా టోల్ చెల్లింపులు మరింత సులభతరం కావడంతో పాటు టోల్ ప్లాజాల వద్ద రద్దీని తగ్గిస్తుంది. అయితే, వార్షిక టోల్ పాస్ తప్పనిసరి కాదు, ఇప్పుడున్న తరహాలోనే ప్లాజాల వద్ద చెల్లింపులు చేసి ప్రయాణించవచ్చు.

యూపీఐ మార్పులు

డిజిటల్ చెల్లింపులను మరింత సులభతరం చేసేందుకు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌పీసీఐ) యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (యూపీఐ) వ్యవస్థలో కీలక మార్పులను ప్రవేశపెడుతోంది. అందులో భాగంగా బ్యాలెన్స్ ఎంక్వైరీలను ఒక రోజులో 50 సార్లకు పరిమితం చేసింది. ఒక్కో యాప్‌లో 50 సార్లు ఉపయోగించుకునే వీలుంటుంది. అదేవిధంగా ఆటో పే లావాదేవీలకు నిర్దిష్ట సమయం కేటాయించింది. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 వరకు, సాయంత్రం 5 గంటల నుంచి 9.30 మధ్య ఆటో పే సౌకర్యం వాడుకునేందుకు వీలుండదు. అదేవిధంగా లావాదేవీల స్టేటస్ చెక్ చేయడానికి ఒకరోజులో మూసార్లు మాత్రమే అనుమతి ఉంది.

పీఎన్‌బీ కేవైసీ అప్‌డేట్

దేశీయ రెండవ అతిపెద్ద ప్రభుత్వ రంగ పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్‌బీ) తన ఖాతాదారులు కేవైసీని అప్‌డేట్ చేయాలని వెల్లడించింది. కస్టమర్లు తమ ఖాతాలు సజావుగా పనిచేయడానికి ఆగస్టు 8లోపు వారి బ్యాంక్ ఖాతాలలో కేవైసీ సమాచారాన్ని అప్‌డేట్ చేయాలని సూచించింది. ఈ అప్‌డేట్‌ను ఆర్‌బీఐ మార్గదర్శకాలకు చేస్తున్నట్టు బ్యాంకు ప్రకటించింది.

ఎస్‌బీఐ కార్డ్‌ నిబంధనలు

కో-బ్రాండెడ్‌ క్రెడిట్‌ కార్డుల ద్వారా ఎయిర్‌ యాక్సిడెంట్‌ ఇన్సూరెన్స్‌ ప్రయోజనాలు పొందున్నవారికి ఆగస్టు 11 నుంచి వాటిని తొలగిస్తున్నట్టు ఎస్‌బీఐ కార్డు తెలిపింది. ఈ ప్రభావం ఎలైట్‌, ప్రీమియం, ప్లాటినమ్‌ క్రెడిట్‌ కార్డులు వాడుతున్న వారిపై ఉండనుంది.

వడ్డీ రేట్ల కోత

ఈ నెలలో 4-6 తేదీల్లో భారతీయ రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బీఐ) ద్రవ్య పరపతి విధాన కమిటీ(ఎంపీసీ) సమావేశం జరగనుంది. ఈ ఏడాదిలో ఇప్పటికే 100 బేసిస్ పాయింట్ల మేర రెపో రేటును తగ్గించిన నేపథ్యంలో ఈసారి మరో 25-50 బేసిస్ పాయింట్ల వరకు తగ్గించే ఛాన్స్ ఉందనే అంచనాలున్నాయి. ఇదే నిర్ణయం గనక తీసుకునే రుణాలు తీసుకున్నవారికి భారీ ఊరట లభిస్తుంది.

Leave a Comment