బిచ్చగాళ్లకు బీరు, బిర్యానీ ఆశచూపి వీర్యం సేకరణ..!

వెలుగులోకి సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ అక్రమాలు
సికింద్రాబాద్ సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ నిర్వాహకుల అరాచకాలు ఒక్కొక్కటిగా వస్తున్నాయి. సరోగసీ పేరుతో పేద దంపతుల నుంచి శిశువులను తక్కువ ధరకు కొని, సంతానం లేని వారికి లక్షల్లో విక్రయించినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. అత్యంత దిగ్భ్రాంతికర విషయాలు కూడా బయటపడ్డాయి.
సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల్లోని రైల్వే స్టేషన్ ఫుట్‌పాత్‌లపై ఉండే బిచ్చగాళ్లకు బీరు, బిర్యానీ ఆఫర్ చేసి వారి నుంచి వీర్యం సేకరించినట్లు తెలుస్తుంది. వీర్యం తీసుకునే సమయంలో వారికి పోర్న్ వీడియోలు చూపించేవారని సమాచారం. అండాల సేకరణ కోసం కూడా పేద మహిళలను లక్ష్యంగా చేసుకున్నారు. వీర్యం ఇస్తే రూ. 800 నుంచి రూ. 4 వేలు, అండం ఇచ్చే మహిళలకు రూ. 10 నుంచి రూ. 25 వేల వరకు చెల్లించినట్లు తెలుస్తోంది. ఇలా సేకరించిన వీర్యం, అండాలను అహ్మదాబాద్‌కు తరలించినట్లు పోలీసులు గుర్తించారు.

సృష్టి టెస్ట్ ట్యూబ్ సెంటర్‌కు హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి, కొండాపూర్ ప్రాంతాల్లో బ్రాంచీలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అలాగే, ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ, వైజాగ్‌తో పాటు ఒడిశా, కోల్‌కతాలోనూ బ్రాంచీలు విస్తరించి ఉన్నట్లు సమాచారం. నాలుగేళ్ల కిందట సికింద్రాబాద్‌లో ప్రారంభించిన ఇండియన్ స్పెర్మ్ టెక్ అనే సంస్థతో సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్‌కు సంబంధాలున్నట్లు తేలింది. ఇండియన్ స్పెర్మ్ టెక్ సంస్థ కూడా స్పెర్మ్ దానం చేయాలని ప్రచారం చేస్తూ వందలాది మంది నుంచి వీర్యం, అండాలు సేకరించినట్లు సమాచారం. రోజువారీ కూలీలు, పేదరికంతో బాధపడుతున్న దంపతులు, యువకులను వీరు లక్ష్యంగా చేసుకున్నారు. గోపాలపురం పోలీసులు దర్యాప్తులో భాగంగా సృష్టి క్లినిక్ నుంచి పెద్ద సంఖ్యలో ఐవీఎఫ్ , సరోగసీ కేసుల రికార్డులు, ఫైళ్లను స్వాధీనం చేసుకున్నారు. దాదాపు 200 మంది దంపతులు ఈ సెంటర్‌లో రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు సమాచారం. పోలీసులు ప్రస్తుతం ఐవీఎఫ్, సరోగసీ చికిత్స తీసుకున్న దంపతులకు ఫోన్లు చేస్తూ వివరాలు సేకరిస్తున్నారు.

The post బిచ్చగాళ్లకు బీరు, బిర్యానీ ఆశచూపి వీర్యం సేకరణ..! appeared first on Visalaandhra.

Leave a Comment