Visakhapatnam development projects: చంద్రబాబు వచ్చాక వైజాగ్ లో ఏం జరుగుతోంది?

Visakhapatnam development projects: విశాఖ నగరం( Visakha City) శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. ఏపీకి ఆర్థిక రాజధానిగా మారుతోంది. ముఖ్యంగా కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత విశాఖ నగరం అభివృద్ధి పట్టాలెక్కుతోంది. రాష్ట్రంలో గమ్య నగరంగా విశాఖకు పేరు ఉంది. జాతీయస్థాయిలో పర్యాటకంగా మంచి గుర్తింపు ఉంది. సువిశాల సముద్రతీరం.. ఆపై మన్యం ఈ జిల్లా సొంతం. అయితే విశాఖను ఐటీ హబ్ గా మార్చాలని కూటమి ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. వాణిజ్య వ్యాపార రంగాల్లో అగ్రగామిగా ఉంచేందుకు ఏర్పాటు చేస్తోంది. అందుకు విశాఖ మహా ప్రాంత అభివృద్ధి సంస్థ  ( వి.ఎం.ఆర్.డి.ఏ ) మంచి ప్రయత్నాలు చేస్తోంది. విశాఖ నగరం అంటే ఒక్కటి కాదు. పక్కనే ఉన్న విజయనగరం, అనకాపల్లి, ఆపై అల్లూరి సీతారామరాజు జిల్లాలను కలుపుకుంటూ ఎన్నో మంచి పథకాలకు శ్రీకారం చుడుతోంది విఎంఆర్డిఏ. అభివృద్ధి చెందుతున్న నగరం కాబట్టి.. విశాల ప్రయోజనాలు, భవిష్యత్ అవసరాలను తీర్చుతూ నగర ప్రణాళిక వేస్తోంది కూటమి ప్రభుత్వం.

  మరో భూగర్భ వంతెన..

 నగరంలో ఎన్ఏడి జంక్షన్ వద్ద రాష్ట్రంలోనే అతిపెద్ద ఫ్లైఓవర్ ఉంది. అయితే నగరంలో పెరుగుతున్న వాహనాలు, ప్రయాణికుల దృష్ట్యా.. సమీపంలోని కాకాని నగర వద్ద మరో భూగర్భ వంతెన నిర్మించాలని వి ఎం ఆర్ డి ఏ నిర్ణయించింది. ఎన్ఏడి వైపు నుంచి వచ్చే వాహనాలు నేరుగా వెళ్లేలా ఈ వంతెన నిర్మిస్తే.. కింది నుంచి వెళ్లే వారికి సులభంగా ఉంటుంది. అందుకే రూ.12.50 కోట్ల  రూపాయల వ్యయంతో ఈ వంతెన నిర్మాణం చేపడుతున్నారు.

  •  మరోవైపు సిరిపురం ఉద్యోగ భవనం వద్ద వి ఎం ఆర్ డి ఏ కు 98 సెంట్లు స్థలం ఉంది. అక్కడ భారీ షాపింగ్ కాంప్లెక్స్ నిర్మిస్తున్నారు. సుమారు 100 కోట్ల రూపాయలతో దీని నిర్మాణం చేపట్టనున్నారు.
  •  మరోవైపు ఇప్పటికే మధురవాడలో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జాతీయ క్రీడా మైదానం ఉంది. అయితే తాజాగా మధురవాడ సర్వేనెంబర్ 175 /4 లో విఎమ్ఆర్డిఏ కు మూడు ఎకరాల స్థలం ఉంది. అయితే అక్కడ పది కోట్ల రూపాయల వ్యయంతో అవుట్ డోర్ క్రీడా సముదాయాన్ని నిర్మించనున్నారు.
  •  నగరంలోని రెండు చోట్ల కన్వెన్షన్ సెంటర్ల నిర్మాణానికి కూడా బీజం పడింది. పెందుర్తి మండలం చీమలపల్లి, ఎండాడ వద్ద వీటి నిర్మాణం చేపడుతున్నారు. దాదాపు 13 కోట్ల రూపాయల వ్యయంతో వీటి నిర్మాణం పూర్తి చేయనున్నారు.
  •  అనకాపల్లి జోనల్ కార్యాలయం పునరుద్ధరణ పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. అదనపు గదుల నిర్మాణంతో పాటు వాణిజ్య దుకాణాలను నిర్మిస్తున్నారు. ఇందుకుగాను ఐదు కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు.

అభివృద్ధి పరుగు

 సాధారణంగా టిడిపి అధికారంలో ఉంటే విశాఖ నగరం శరవేగంగా అభివృద్ధి చెందుతుంది అనే ముద్ర ఉంది. అయితే ఇప్పుడు జరుగుతోంది అదే. నగరంలో లీక్ వ్యూ లేఅవుట్ నుంచి నగరంపాలెం మీదుగా వాంబే కాలనీ వైపు దాదాపు 8 కోట్ల రూపాయలతో రహదారి నిర్మాణం చేపడుతున్నారు. అనకాపల్లి జిల్లా గొల్లల పాలెం ఆర్సి లేఅవుట్ నుంచి అమృతపురం రోడ్డు వరకు 60 అడుగుల రోడ్డును 25 కోట్ల రూపాయలతో నిర్మిస్తున్నారు. లంకెలపాలెం నుంచి అస్కపల్లి రోడ్డును  ముసిడివాడకు కలిపేలా 100 అడుగుల వెడల్పుతో నిర్మిస్తున్నారు. దీనికిగాను దాదాపు 31 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. మరోవైపు గండిగుండం నుంచి నిర్మించే రోడ్డు చింతపాలెం వద్ద అరకు మార్గాన్ని కలపనున్నారు. నగరంలో ట్రాఫిక్ సమస్య లేకుండా చేసేందుకు గాను దీనిని నిర్మిస్తున్నారు. ఇందుకుగాను 44 కోట్ల రూపాయల వరకు ఖర్చు చేస్తున్నారు. ఇలా చంద్రబాబు సర్కార్ వచ్చిన తర్వాత విశాఖ నగరంలో అభివృద్ధి పరుగులు పెడుతోంది. ప్రజలు కూడా ప్రభుత్వం విషయంలో సానుకూలంగా ఉన్నారు. అభివృద్ధి పనులను స్వాగతిస్తున్నారు.

Leave a Comment