Jagan New Look: నుదుట సింధూరం.. జగన్ హిందుత్వ టర్న్ వెనుక కథేంటి?

Jagan New Look: గతంలో ఎన్నడూ లేని విధంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ లో( Y S Jagan Mohan Reddy ) స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. గతం మాదిరిగా ఆయనలో దూకుడు తనం తగ్గుతోంది. బెదురు కనిపిస్తోంది. ఇటీవల జరిగిన పరిణామాలతోనే జగన్మోహన్ రెడ్డిలో ఆ మార్పు అని తేలిపోయింది. అయితే ఇటీవల ఆయన నుదుటిపై సింధూర తిలకం తో అందర్నీ ఆశ్చర్య పరుస్తున్నారు. ఆపై గడ్డం కూడా తెల్ల వెంట్రుకలతో నెరిసి కనిపిస్తోంది. ఫ్యాన్ పార్టీ అధినేతలో ఏంటి మార్పు? దీని వెనుకున్న కథ ఏంటి అనేది ఇప్పుడు చర్చగా మారింది. అయితే హిందుత్వ వాదాన్ని బయట పెట్టేందుకే జగన్మోహన్ రెడ్డి అలా ప్రయత్నిస్తున్నారన్న టాక్ నడుస్తోంది. ముందుగా పార్టీ శ్రేణులకు తనలో వచ్చిన మార్పును చూపించి.. తరువాత ప్రజల్లోకి వెళ్లాలని ఆయన భావిస్తున్నట్లు స్పష్టమవుతోంది.

Also Read: ఈసారి అమరావతి పక్కా.. బాబు సింగపూర్ ప్లాన్లు ఫలిస్తాయా?

అకాస్మాత్తుగా సింధూరం బొట్టుతో
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీ( political Advisory Committee ) సమావేశం నిన్ననే జరిగింది. రాష్ట్రవ్యాప్తంగా 30 మందికి పైగా నేతలతో జంబో కమిటీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. మద్యం కుంభకోణం కేసులో తనను అరెస్టు చేస్తారన్న ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో.. పార్టీ శ్రేణుల అభిప్రాయాన్ని తీసుకునేందుకు జగన్మోహన్ రెడ్డి ఈ సమావేశాన్ని నిర్వహించారు. అయితే ఆయన అకస్మాత్తుగా సింధూరం తిలకంతో కనిపించేసరికి నేతలంతా ఆశ్చర్యపోయారు. గతంలో ఏదైనా ఆలయాలకు వెళ్లినప్పుడు మాత్రమే సింధూరంతో కనిపించేవారు. ఇప్పుడు ఏకంగా పార్టీ సమావేశానికి సింధూరంతో బొట్టు పెట్టుకుంటూ రావడం మాత్రం ఆశ్చర్యం వేసింది. అయితే ఓ మహిళా నేత సింధూరం పెట్టినట్లు తెలుస్తోంది. అయితే క్లిష్ట సమయంలో ఉన్నందున ఆ సింధూరం పెట్టుకునేందుకు జగన్మోహన్ రెడ్డి సైతం ఒప్పుకున్నట్లు తెలుస్తోంది.

అన్యమత ప్రచారం వివాదం
జగన్మోహన్ రెడ్డి విషయంలో అన్యమత ప్రచారం ఎక్కువ. ఆయన హిందూ సాంప్రదాయాలను గౌరవించరని.. వైసిపి హయాంలో అన్యమత ప్రవేశాలు ఎక్కువయ్యాయని.. తిరుమలలో( Tirumala) సైతం అనేక మార్పులు సంభవించాయన్న విమర్శలు ఉన్నాయి. 2014, 2019 ఎన్నికల్లో జగన్ పై వచ్చిన హిందూ వ్యతిరేక ముద్ర పెద్దగా పనిచేయలేదు. ఎప్పుడైతే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందో.. అటు తరువాత ప్రభుత్వ చర్యలతో హిందుత్వ వ్యతిరేక ముద్ర పతాక స్థాయికి చేరింది. మొన్నటి ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి తీరని నష్టాన్ని చేకూర్చింది. అందుకే జగన్మోహన్ రెడ్డిలో ఈ మార్పు అని ప్రచారం జరుగుతోంది.

Also Read: చంద్రబాబే పెద్దన్న.. వైసీపీకి బిజెపి నో ఛాన్స్!

ఆ ముద్ర తొలగించుకునేందుకే
వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress) హయాంలో జగన్మోహన్ రెడ్డి సతీసమేతంగా తిరుపతి వెళ్ళిన దాఖలాలు లేవు. హిందూ మత పండుగలకు సంబంధించి వేడుకలు జరుపుకున్న సందర్భాలు కూడా లేవు. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో 2024 సంక్రాంతి సంబరాలను భారీ సెట్స్ నడుమ జరుపుకున్నారు జగన్మోహన్ రెడ్డి. సీఎం హోదాలో భారీ సెట్టింగ్ వేసి సంక్రాంతి వేడుకల్లో పాల్గొనడం అప్పట్లో చర్చకు దారి తీసింది. కేవలం ఎన్నికల్లో లాభం పొందేందుకే అలా చేశారన్న విమర్శలు ఉన్నాయి. అయితే 2024 ఎన్నికల్లో హిందుత్వ వ్యతిరేక ముద్ర బాగానే పనిచేసింది. దానిని తగ్గించేందుకే జగన్మోహన్ రెడ్డి ఈ కొత్త ఎత్తుగడ అంటూ తాజాగా విమర్శలు వస్తున్నాయి. మరి అందులో ఎంత వాస్తవం ఉందో చూడాలి.

Leave a Comment