Galla Jayadev Political Comeback: రాజకీయాల్లో( politics) కొన్ని నిర్ణయాలు ఇక్కట్లు తెచ్చి పెడతాయి. కొన్ని రకాల అవకాశాలను దూరం చేస్తాయి. అటువంటి నిర్ణయంతోనే కేంద్ర మంత్రి పదవిని దూరం చేసుకున్నారు గుంటూరు మాజీ ఎంపీ గల్లా జయదేవ్. రాజకీయాలను సరిగ్గా అంచనా వేయలేకపోయారు జయదేవ్. టిడిపి కూటమి అధికారంలోకి వస్తుందని భావించలేదు. కేంద్రంలో టిడిపి కీలక భాగస్వామి అవుతుందని భావించలేకపోయారు. అందుకే ఈ ఎన్నికలకు ముందు అనూహ్యంగా క్రియాశీలక రాజకీయాలకు దూరం అయ్యారు. అయితే ఆయన స్థానంలో మరో పారిశ్రామికవేత్త పెమ్మసాని చంద్రశేఖర్ రంగంలోకి దిగారు. గుంటూరు ఎంపీగా పోటీ చేసి గెలిచారు. కేంద్ర మంత్రివర్గంలో చేరారు. అయితే ఆ పదవి ముమ్మాటికి గల్లా జయదేవ్ దే. ఎప్పుడైతే గల్లా జయదేవ్ క్రియాశీలక రాజకీయాలకు దూరమయ్యారో.. అప్పుడే తెరపైకి వచ్చారు చంద్రశేఖర్. అయితే గల్లా జయదేవ్ కు సరైన గౌరవం దక్కుతుందని అంతా భావించారు. కానీ ఎందుకో కూటమి పెద్దలు ఆయనను పక్కన పెట్టినట్లు తెలుస్తోంది.
Also Read: మంత్రివర్గంలోకి ఆ మహిళ ఎమ్మెల్సీ?!
సుదీర్ఘ నేపథ్యం..
గల్లా కుటుంబానికి ఉమ్మడి రాష్ట్రంలోనే మంచి పేరు ఉంది. గల్లా రామచంద్ర నాయుడు ( Ramachandra Naidu )పారిశ్రామికవేత్తగా రాణించారు. ఆయనే గల్లా జయదేవ్ తండ్రి. మరోవైపు జయదేవ్ సూపర్ స్టార్ కృష్ణ అల్లుడు. స్వతహాగా పారిశ్రామిక కుటుంబం గా పేరుగాంచింది గల్లా ఫ్యామిలీ. రామచంద్ర నాయుడు చిత్తూరు జిల్లా రాజకీయాలను కూడా శాసించారు. కాంగ్రెస్ పార్టీలో ఒక వెలుగు వెలిగారు. అందుకే రాజశేఖర్ రెడ్డి పిలుపు మేరకు రాజకీయాల్లోకి వచ్చారు జయదేవ్ తల్లి అరుణ కుమారి. 2004, 2009 ఎన్నికల్లో చంద్రగిరి నియోజకవర్గంలో నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. రాజశేఖర్ రెడ్డి మంత్రివర్గంలో కీలక శాఖను నిర్వర్తించారు. అయితే 2014లో రాష్ట్ర విభజనతో కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పింది గల్లా కుటుంబం. తెలుగుదేశం పార్టీలో చేరింది. చంద్రగిరి నుంచి గల్లా అరుణకుమారి, గుంటూరు పార్లమెంట్ స్థానం నుంచి కుమారుడు జయదేవ్ టిడిపి అభ్యర్థులుగా పోటీ చేశారు. అయితే అరుణకుమారి ఓడిపోయారు. కానీ జయదేవ్ మాత్రం ఎంపీగా గెలిచారు. 2019 ఎన్నికల్లో జగన్ ప్రభంజనంలో సైతం రెండోసారి పోటీ చేసి గెలిచారు జయదేవ్. అటువంటి జయదేవ్ 2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు క్రియాశీలక రాజకీయాలకు దూరమయ్యారు.
Also Read: పులివెందులకు ఉప ఎన్నిక.. జగన్ కు అగ్నిపరీక్ష!
అనూహ్యంగా మంత్రి అయిన చంద్రశేఖర్..
అయితే 2024 ఎన్నికల్లో గుంటూరు( Guntur ) నుంచి పోటీ చేసేందుకు మరో పారిశ్రామికవేత్త పెమ్మసాని చంద్రశేఖర్ ముందుకు వచ్చారు. ఆ ఎన్నికల్లో పోటీ చేసి గెలిచిన చంద్రశేఖర్ కు కేంద్ర మంత్రివర్గంలో స్థానం దక్కింది. అయితే కూటమి అధికారంలోకి రావడంతో జయదేవ్ మళ్ళీ తిరిగి యాక్టివ్ అయ్యేందుకు ప్రయత్నించారు. చంద్రబాబుతో పాటు లోకేష్ వెంట తరచూ కనిపించేవారు. దీంతో జయదేవ్ సేవలను చంద్రబాబు వినియోగించుకుంటారని.. ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిగా జయదేవ్ ను నియమించే అవకాశం ఉందని పెద్ద ఎత్తున ప్రచారం నడిచింది. కానీ ఆ పదవిలో ఓ సీనియర్ ఐఏఎస్ అధికారిని నియమించారు చంద్రబాబు. మరోవైపు జయదేవ్ ను రాజ్యసభకు నామినేట్ చేస్తారని కూడా పెద్ద ఎత్తున ప్రచారం అయితే జరిగింది. కానీ ఇప్పటివరకు ఆ అవకాశం దక్కలేదు. అయితే జయదేవ్ విషయంలో చంద్రబాబుతో పాటు లోకేష్ సానుకూలంగా ఉన్నారని.. ఆయనకు కీలక హామీ ఉన్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది.
త్వరలో పెద్ద పదవి..
అయితే ఇటీవల కాలంలో గల్లా జయదేవ్( Gala Jaidev ) పెద్దగా కనిపించడం లేదు. వాస్తవానికి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ హయాంలో జయదేవ్ అమర్ రాజా కంపెనీలు చాలా ఇబ్బంది పడ్డాయి. అప్పట్లో కేంద్ర ప్రభుత్వం సైతం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉండడంతో.. అమర్ రాజా కంపెనీలకు అనేక రకాలుగా ఇబ్బందులు ఎదురైనట్లు ప్రచారం నడిచింది. అయితే అప్పట్లో ఆ పరిస్థితి నుంచి గట్టెక్కేందుకు రాజకీయాలనుంచి తప్పుకోవడమే ఉత్తమం అన్న నిర్ణయానికి జయదేవ్ వచ్చినట్లు తెలుస్తోంది. అయితే ఆ చిన్నపాటి నిర్ణయమే గల్లా జయదేవ్ కు కేంద్రమంత్రి అయ్యే అవకాశం తప్పిపోయేలా చేసింది. అయితే మున్ముందు అంతకుమించి పెద్ద పదవి గల్లా జయదేవ్ ను వరించే అవకాశం ఉన్నట్లు ప్రచారం నడుస్తోంది. మరి ఎలాంటి పదవి వస్తుందో చూడాలి.