వైద్యుల నిర్లక్ష్యం కారణంగా ఓ మహిళ దాదాపు 17 ఏళ్లు కడుపు నొప్పి భరించాల్సి వచ్చింది. 17 ఏళ్ల క్రితం ప్రసవం సమయంలో సిజేరియన్ చేయించుకున్న బాధితురాలి కడుపులో శస్త్రచికిత్సకు ఉపయోగించే కత్తెర కనిపించింది. ఈ షాకింగ్ ఘటన ఉత్తరప్రదేశ్‌లో వెలుగు చూసింది.17 ఏళ్ల నుంచి తన భార్య కడుపునొప్పితో బాధపడుతోందని ఆమె భర్త తెలిపారు. ఎక్కడకు వెళ్లినా నయం కాలేదని చెప్పారు. చివరకు లక్నోలోని మెడికల్ కాలేజీలో చేసిన ఎక్స్‌రేలో కడుపులో కత్తెర ఉన్నట్లు తేలింది.
యూపీలోని లక్నోకు చెందిన సంధ్యా పాండే అనే మహిళ పురిటి నొప్పులతో ఫిబ్రవరి 28, 2008న ‘షీ మెడికల్ కేర్’ ఆస్పత్రిలో చేరారు. వైద్యులు ఆమెకు సి-సెక్షన్ ఆపరేషన్ చేయగా.. ఆ సమయంలో కత్తెరను ఆమె కడుపులోనే మర్చిపోయారు. ఇన్నేళ్లుగా కడుపు నొప్పి వస్తుండటంతో KGMU ఆస్పత్రికి తీసుకెళ్లి స్కాన్ చేయించడంతో అసలు విషయం బయటపడింది. ఎక్స్-రేలో ఆమె పొత్తికడుపులో కత్తెర ఉన్నట్లు గుర్తించారు వైద్యులు. తరువాత, ఆమెను కింగ్ జార్జ్ మెడికల్ యూనివర్శిటీ (KGMU)లో చేర్పించారు. అక్కడ మార్చి 26న ఆమెకు సర్జరీ చేసిన వైద్యులు కడుపులో ఉండిపోయిన కత్తెరను తొలగించారు.
KGMU ప్రతినిధి సుధీర్ సింగ్ ఈ సంఘటనను ధృవీకరించారు. అతి కష్టం మీద బాధితురాలికి ఆపరేషన్ చేసిన తర్వాత కత్తెరను విజయవంతంగా తొలగించామని చెప్పారు. బాధితురాలి ఆరోగ్యం కుదుటపడిన తరువాతే ఆమెను డిశ్చార్జ్ చేసి ఇంటికి పంపించామని చెప్పారు.
ఇవి కూడా చదవండి
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..