– రెండున్నర ఏండ్లలో ఎస్‌ఎల్‌బీసీ పూర్తి చేస్తాం : మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
– ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ వద్ద సహాయక చర్యల పర్యవేక్షణ
నవతెలంగాణ- మహబూబ్‌నగర్ ప్రాంతీయ ప్రతినిధి
ఎస్‌ఎల్‌బీసీ సొరంగంలో మృతిచెందిన వారి కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని, సహాయక చర్యలు మరో 15 రోజుల్లో పూర్తవుతా యని రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గం అమ్రాబాద్ మండలం దోమలపెంటలోని ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌ను బుధవారం మంత్రి సందర్శిం చారు. సహాయక చర్యలపై ఉన్నతాధికారులతో సమీక్షించారు. సహాయక చర్యల గురించి ప్రత్యేక అధికారి శివశంకర్ లోతేటి, జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ మంత్రికి వివరించారు. సొరంగంలో చిక్కుకున్న వారి ఆనవాళ్లు తెలుసుకునేందుకు కేరళకు చెందిన కడావర్ డాగ్స్ సేవలను ఉపయోగించుకుంటున్నట్టు వివరించారు. టన్నెల్‌లో సహాయక చర్యలు 15 రోజుల్లో పూర్తికానున్నట్టు మంత్రి తెలిపారు. మరో 105 -110 మీటర్ల మేర తవ్వకాలు పూర్తయితే సమస్య ఓ కొలిక్కి వస్తుందని తెలిపారు. ప్రమాదం జరిగిన ప్రాంతంలో 250 మీటర్ల మేర రాళ్లు, మట్టి, బురద కారణంగా సహాయక చర్యలకు అడ్డంకి ఏర్పడినట్టు చెప్పారు. ప్రస్తుతం సుమారు 550-560 మంది అత్యాధునిక పరికరాలతో సహాయక చర్యలను కొనసాగిస్తున్నా రన్నారు. టన్నెల్‌లో భారీ డ్రిల్లింగ్ యంత్రానికి ఇనుము, ఇతర వస్తువులు అతుక్కుపోవడం వల్ల బురద తొలగింపు కష్టంగా ఉందన్నారు. డిజాస్టర్ అండ్ మేనేజ్‌మెంట్ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ అరవింద్ కుమార్, ప్రత్యేక పర్యవేక్షణాధికారి శివశంకర్ లోతేటి, జిల్లా కలెక్టర్, ఎస్పీ, ఉన్నత అధికారులు అన్ని వేళలా అందుబాటులో ఉంటూ పనులు చేయిస్తున్నారన్నారు. జలయజ్ఞంలో భాగంగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రారంభించిన ఎస్‌ఎల్బీసీ ప్రాజెక్టును ఇందిరమ్మ ప్రభుత్వం రెండున్నరేండ్లలో పూర్తి చేయనున్నట్టు తెలిపారు. తద్వారా నల్లగొండ – ఖమ్మం జిల్లాలను సస్యశ్యామలం చేసే కృష్టానది జలాలు అందుబాటు లోకి తీసుకొచ్చామన్నారు. ఈ సమావేశంలో, ఆర్మీ అధికారులు వికాస్ సింగ్, విజరు కుమార్, ఎన్‌డీఆర్‌ఎఫ్ అధికారి డాక్టర్ హరీష్, సింగరేణి మైన్స్ రెస్క్యూ జనరల్ మేనేజర్ బైద్య, ఎస్‌డీఆర్‌ఎఫ్ అధికారి గిరిధర్‌రెడ్డి, హైడ్రా అధికారి జయప్రకాష్, దక్షిణ మధ్య రైల్వే అధికారి రవీంద్రనాథ్, సింగరేణి మైన్స్ రెస్క్యూ అధికారి, నీటిపారుదల శాఖ డీఈ శ్రీనివాసులు, ర్యాట్ హౌల్ మైనర్స్ ప్రతినిధి ఫిరోజ్ ఖురేషి, జీఎస్‌ఐ అధికారులు రాజశేఖర్, కడావర్ డాగ్స్ ప్రతినిధి ప్రభాత్, జేపీ కంపెనీ ప్రతినిధులు పాల్గొన్నారు.