
2025 ఏప్రిల్ 24 క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ 52వ పుట్టినరోజు. నవంబర్ 2013లో అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అయిన సచిన్ ఇప్పటికీ లక్షలాది మంది అభిమానుల హృదయాల్లో దేవుడిగా నిలిచాడు. ఇక సచిన్‌కు, F1 ప్రపంచ ఛాంపియన్ మైఖేల్ షూమేకర్‌కు మంచి స్నేహం ఉన్న సంగతి తెలిసిందే. షూమేకర్ ఒకప్పుడు సచిన్‌కు తనకు ఇష్టమైన కారు ఫెరారీ 360 మోడెనాను బహుమతిగా ఇచ్చాడు.
2002లో, సచిన్ ఆస్ట్రేలియా లెజెండ్ సర్ డాన్ బ్రాడ్‌మాన్ 29 టెస్ట్ సెంచరీల రికార్డును సమం చేశాడు. ఈ చారిత్రాత్మక విజయంతో సంతోషంగా ఉన్న షూమేకర్ అతనికి లగ్జరీ కారును బహుమతిగా ఇచ్చాడు. సచిన్ ఈ కారును ఎంతగానో ఇష్టపడ్డాడు. చాలా సంవత్సరాలు ఉపయోగించిన తర్వాత దానిని సూరత్ వ్యాపారవేత్త జయేష్ దేశాయ్‌కు విక్రయించాడు. కార్ రేసింగ్ దేవుడిగా పరిగణించబడే మైఖేల్ షూమేకర్ 12 సంవత్సరాలుగా మృత్యువుతో పోరాడుతున్నాడు. నిజానికి, 2013లో, షూమేకర్ తన కుటుంబంతో సెలవులు గడపడానికి ఫ్రాన్స్‌లోని ఆల్ప్స్ నగరానికి వెళ్లాడు. అతను తన కొడుకుతో కలిసి స్కీయింగ్ చేశాడు. ఈ సమయంలో అతను ఒక బండరాయిని ఢీకొన్నాడు. ఈ ప్రమాదంలో అతని తలకు తీవ్ర గాయమైంది. షూమేకర్ గాయం చాలా తీవ్రంగా ఉండటం వల్ల అతను చాలాసార్లు మెదడు శస్త్రచికిత్స చేయించుకోవాల్సి వచ్చింది. దీని తరువాత అతను కోమాలోకి వెళ్ళాడు. మీడియా నివేదికల ప్రకారం, అతను దాదాపు 250 రోజులు కోమాలోనే ఉన్నాడు.
జూన్ 2014లో, షూమేకర్ నెమ్మదిగా కోమా నుండి బయటపడ్డాడు. కానీ అతని పరిస్థితి ఇంకా చాలా దారుణంగా ఉంది. అందువల్ల అతని భార్య కొరిన్నా(అతను 1995లో వివాహం చేసుకున్నాడు) అతని పరిస్థితి గురించి సీక్రెట్‌గా ఉంచింది. 2018లో, షూమేకర్‌ను అతని భార్య స్పానిష్ ద్వీపం మజోర్కాలోని ఒక ప్రైవేట్ భవనంలో రహస్యంగా ఉంచిందని పుకార్లు వ్యాపించాయి. అతను ఇప్పటికీ మాట్లాడలేడని.. తన కళ్ళతో మాత్రమే స్పందిస్తాడని తెలుస్తోంది. 2013లో జరిగిన ప్రమాదం తర్వాత అతను కనిపించలేదు. అతని ఆరోగ్యం గురించి ఎటువంటి ఖచ్చితమైన సమాచారం కూడా వెల్లడి కాలేదు.