సొంత జిల్లా అయిన కడపలో జగన్ కు షాక్ తగలబోతుంది..? వైసీపీకి చెందిన మహిళా ఎమ్మెల్యే పార్టీని వీడబోతున్నారా..? అంటే అవునన్న సమాధానమే వినిపిస్తోంది. 2024 ఎన్నికల్లో వైసీపీ గెలిచింది పట్టుమని 11 సీట్లు. చాలా జిల్లాల్లో ఖాతా కూడా తెరవలేదు. కడపలో అతి కష్టం మీద మూడు సీటు దక్కగా.. ఇప్పుడు అందులో ఒక దాన్ని వైసీపీ కోల్పోబోతుందని బలంగా ప్రచారం జరుగుతోంది.
కడప జిల్లా బద్వేలు నుంచి శాసనసభకు ఎన్నికయ్యారు డాక్టర్ దాసరి సుధ. తన భర్త దివంగత ఎమ్మెల్యే డా. జి.వెంకటసుబ్బయ్య 2021లో మరణించన తర్వాత బద్వేలు నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా సుధ తొలిసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2024 ఎన్నికల్లో అదే నియోజకవర్గం నుంచి పోటీ చేసి రెండోసారి అసెంబ్లీలో అడుగుపెట్టారు. అయితే గత ఏడాది జరిగిన ఎన్నికల్లో కూటమి విజయకేతనం ఎగురవేసి అధికారంలోకి వచ్చింది.

సౌమ్యురాలిగా పేరున్న సుధకు అధికార పార్టీ నేతలతో ఎటువంటి ఇబ్బంది లేదు. కానీ ఆమెకు వ్యతిరేకంగా సొంత పార్టీలోనే కుంపటి రాజుకుంది. కడప జిల్లాలో ముందు నుంచి అవినాష్ రెడ్డి వర్గంగా సుధ ఉన్నారు. అయితే ఇటీవల మారిన రాజకీయ పరిస్థితుల నడుమ ఆమె వ్యతిరేక వర్గం యాక్టివ్ అయింది. సొంత పార్టీ నేతలే ఎమ్మెల్యే సుధపై నెగటివిటీ స్ప్రెడ్ చేయడం షురూ చేశారు. సుధ వల్ల నియోజవర్గంలో ఎటువంటి అభివృద్ధి జరగలేదంటూ ప్రచారం చేస్తున్నారు.
ఈ విషయాన్ని అవినాష్ రెడ్డి చూసిచూడనట్లు వదిలేయడంతో ఎమ్మెల్యే సుధ.. బద్వేలు నియోజకవర్గ పరిస్థితులను జగన్ దృష్టికి తీసుకెళ్లాలని ప్రయత్నించారట. కానీ జగన్ సైతం ముఖం చాటేయడంతో సుధ తీవ్ర మనస్తాపానికి గురై పార్టీ వీడాలని నిర్ణయించుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. వైసీపీకి గుడ్ బై చెప్పి కూటమిలో చేరాలని సుధ భావిస్తున్నారట. ఇప్పటికే ఆమె కూటమి నేతలతో టచ్‌లో వెళ్లినట్లు కూడా ఇన్‌సైడ్ టాక్ నడుస్తోంది.