సెర్ప్‌లో మెప్మా విలీనం | Mepma merges with Serp

Written by RAJU

Published on:

జగిత్యాల, ఏప్రిల్‌ 1 (ఆంధ్రజ్యోతి): పట్టణ ప్రాంతాల్లో పొదుపు సంఘాల మహిళలకు బ్యాంకుల్లో రుణాలు ఇప్పించి వారి ఆర్థిక అభివృద్ధికి తోడ్పాటు అందిస్తున్న మెప్మా (పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ) విభాగాన్ని ఇక నుంచి డీఆర్‌డీఏ పరిధిలోని గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్‌)లో విలీనం చేశారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇందుకు అవసరమైన మార్గదర్శకాలు ఇంకా జిల్లా అధికారులకు అందలేదు. జిల్లాలోని జగిత్యాల, ధర్మపురి, రాయికల్‌, కోరుట్ల, మెట్‌పల్లి మున్సిపాలిటీల్లోని మెప్మా ఉద్యోగులు, సిబ్బందితో పాటు జిల్లా కేంద్రంలోని మెప్మా జిల్లా కార్యాలయ ఉద్యోగులంతా సెర్ప్‌ పరిధిలోకి వెళ్లనున్నారు. మున్సిపాలిటీల్లో మహిళలను గ్రూపుగా ఏర్పాటు చేసే మెప్మా ఉద్యోగులు జిల్లాలో, పట్టణ స్థాయిలో రిసోర్స్‌ పర్సన్‌, కమ్యూనిటీ ఆఫీసర్లు, వార్డు పరిధిలో రిసోర్స్‌ పర్సన్లు వంద మంది వరకు ఉన్నారు. వీరంతా మున్సిపల్‌ కమిషనర్ల ఆధ్వర్యంలో పనిచేస్తున్నారు. మహిళా సంఘాలకు బ్యాంకుల్లో రుణాలు ఇప్పించడంతో పాటు ప్రతి నెలా చెల్లింపులు జరిగేలా చర్యలు తీసుకుంటారు. గ్రామీణ ప్రాంతాల్లో ఈ పనిని సెర్ప్‌ కార్యాలయం కింద పనిచేసే ఉద్యోగులు పర్యవేక్షిస్తున్నారు. ఈ రెండు శాఖలను విలీనం చేస్తే సెర్ప్‌ కార్యాలయంలో విధులు నిర్వర్తించనున్నారు.

ఫపట్టణాల్లో సర్వేలకు ఇబ్బందే..

రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే సంక్షేమ పథకాలు, ఇతరత్రా పనులను క్షేత్రస్థాయిలో మెప్మా ఆర్‌పీలు, మెప్మా సీవోలు సర్వే చేస్తుంటారు. మెప్మా ఆర్‌పీలకు కాలనీల్లో ఉండే వివరాలు తేలికగా తెలిసే అవకాశం ఉంటుందని ప్రతీ సర్వేకు వారి సేవలను వినియోగించుకుంటున్నారు. ఇక నుంచి వారు ఇతర శాఖ పరిధిలోకి వెళ్తే మున్సిపాలిటీల సేవలకు వారు వచ్చే అవకాశం ఉండకపోవచ్చన్న చర్చ నడుస్తోంది. ప్రభుత్వ తాజా నిర్ణయంతో కాలనీల్లో సర్వే చేయాలంటే మున్సిపల్‌ యంత్రాంగానికి ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందన్న వాదనలు వినిపిస్తున్నాయి.

ఫజీత భత్యాల్లో తేడా..

పట్టణాల్లోని మెప్మా రిసోర్స్‌పర్సన్‌లకు నెలకు రూ.6 వేల వేతనం చెల్లిస్తుంటే, సెర్ప్‌ ఆర్‌పీలకు నెలకు రూ.5 వేల చొప్పున చెల్లిస్తున్నారు. ఒకవేళ ఈ రెండు గ్రూపులు కలిపితే జీతాలు పెరుగుతాయా..?తగ్గుతాయా..? అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మహిళా సంఘాల విలీనంపై త్వరలో మార్గదర్శకాలు విడుదల కానున్నాయని సంబంధిత వర్గాలు అంటున్నాయి. మున్సిపల్‌, గ్రామీణ ప్రాంతాల్లో ఎప్పటిలాగే కార్యకలాపాలు ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఒకే శాఖ పరిధిలో ఉద్యోగులంతా పనిచేసేలా విధి విధానాలు తయారు చేసినట్లు సమాచారం. సర్వేలు, ఓటర్ల జాబితాలు, ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక, కొత్త రేషన్‌ కార్డుల దరఖాస్తుల పరిశీలన, రాజీవ్‌ యువశక్తి దరఖాస్తుల పరిశీలన తదితర విధులు యథావిధిగా ఉండనున్నట్లు తెలుస్తోంది. గ్రామీణ, పట్టణ సంస్థలు ఒకే చోట ఒకే అధికారి పర్యవేక్షణలో ఉద్యోగులంతా పనిచేయనున్నారు.

ప్రభుత్వ ఆదేశాల మేరకు నిర్ణయం

-శ్రీనివాస్‌గౌడ్‌, మెప్మా జిల్లా అధికారి

మెప్మాను సెర్ప్‌లో విలీనం చేస్తూ ఇటీవల ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందుకు అనుగుణంగా జీవో జారీ అయింది. కానీ విధి విధానాలకు సంబంధించిన మార్గదర్శకాలు ఇంకా రాలేదు. ప్రభుత్వం నిర్ణయం మేరకు విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది.

——————————————————————————————

జిల్లా వివరాలు ఇలా..

——————————————————————————————

మొత్తం మండలాలు…20

స్వయం సహాయక మహిళా సంఘాలు..14,964

సభ్యులు…1,73,412

గ్రామైఖ్య మహిళా సంఘాలు..565

మండల సమాఖ్య సంఘాలు…18

జిల్లా సమాఖ్య సంఘం…1

——————————————————————————————

మొత్తం మున్సిపాలిటీలు…5

మెప్మా రిసోర్స్‌ పర్సన్‌లు…173

పట్టణ మహిళా సమాఖ్య సంఘాలు..5

స్వయం సహాయక మహిళా సంఘాలు..5,361

మహిళా సంఘాల్లో సభ్యుల సంఖ్య….58,076

——————————————————————————————

Updated Date – Apr 02 , 2025 | 12:59 AM

Subscribe for notification
Verified by MonsterInsights