– నిమ్స్‌లో 3 నెలలుగా పెండింగ్
– ఇబ్బందులు పడుతున్న సిబ్బంది కుటుంబాలు
నవతెలంగాణ-సిటీబ్యూరో
నిమ్స్ హాస్పిటల్‌లో పని చేసే సెక్యూరిటీ సిబ్బంది వేతన వెతలు ఎదుర్కొంటున్నారు. వేతనాలు సకాలంలో చెల్లించక మూడు నెలలుగా పెండింగ్‌లో ఉండటంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ విషయమై ఈ నెల 19వ తేదీన బాధితులు హాస్పిటల్‌లో నిరసన సైతం తెలిపారు. ఇది గడిచి దాదాపు 15 రోజులు కావస్తున్నా.. ఇటు నిమ్స్ యాజమాన్యం కానీ.. అటు సంబంధిత ఏజెన్సీ కానీ స్పందించకపోవడంతో రోజురోజుకూ పరిస్థితి జఠిలంగా మారుతోంది.
పంజాగుట్ట నిజాం ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ అండ్ సైన్స్ (నిమ్స్)లో సెక్యూరిటీ సిబ్బంది జీవితాలకు భద్రత కరువైంది. ఇక్కడ దాదాపు 120 మంది వరకు సెక్యూరిటీ గార్డులు పని చేస్తున్నారు. నిత్యం వేలాది మంది రోగులు, వారి సహాయకులతో పాటు డైట్ క్లర్ట్ మొదలు వార్డు బారుల వరకు అందరికీ రక్షణగా నిలిచే వీరికి సకాలంలో వేతనాలు అదకపోవడంతో పరిస్థితి దయనీయంగా మారింది. 24/7 గంటలు హాస్పిటల్ భద్రతను పర్యవేక్షించే సెక్యూరిటీ గార్డులకు వేతనాలు పెండింగ్‌లో ఉండటంతో ఉగాది పండగ పూట సైతం పస్తులుండాల్సిన పరిస్థితి దాపురించింది. ఇచ్చేది అరకొర వేతనాలే అయినా.. సకాలంలో అందకపోవడంతో పిల్లల స్కూల్ ఫీజులు, ఇంటి అద్దెలు చెల్లించలేక నానా అవస్థలు పడుతున్నారు. స్కూల్ యాజమాన్యం, ఇంటి యజమానులతో నిత్యం అవమానాలు తట్టుకోలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 3 నెలలుగా వేతనాలు రాకపోవడంతో ఇంటిల్లిపాది రోడ్డున పడే దుస్థితి నెలకొందని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా నిమ్స్ యాజమాన్యం స్పందించి పెండింగ్ వేతనాలతోపాటు ఇక నుంచి నెల నెలా సకాలంలో వేతనాలు అందేలా చర్యలు తీసుకోవాలని బాధితులు కోరుతున్నారు.
గోల్‌మాల్ ఏజెన్సీకే మళ్లీ బాధ్యతలు..!
నిమ్స్ హాస్పిటల్‌లో సెక్యూరిటీ గార్డుల ఏజెన్సీలు ఎన్ని మారినా రెండు, మూడు నెలలకోసారి వేతనాలివ్వడం పరిపాటిగా మారిపోయింది. గతంలో ఓ ఏజెన్సీ నిమ్స్ సెక్యూరిటీ గార్డులకు చెల్లించాల్సిన రూ.లక్షల పీఎఫ్ డబ్బులను నొక్కేసినా ఇప్పటి వరకు యాజమాన్యం ఆ ఏజెన్సీపై ఎలాంటి విచారణకు ఆదేశించకపోగా, మళ్లీ అలాంటి సంస్థలకే బాధ్యతలు అప్పగిస్తోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆయా ఏజెన్సీలతో నిమ్స్ యాజమాన్యం కుమ్మక్కై చిరు ఉద్యోగులను ఇబ్బందులకు గురి చేస్తున్నట్టు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుతం కార్తికేయ, ఓసీడీఎస్‌ఎస్ (ఓం సాయి ప్రొఫెషనల్ డిటెక్టివ్ అండ్ సెక్యూరిటీ ప్రయివేటు లిమిటెడ్ సంస్థలు) నిమ్స్ సెక్యూరిటీ బాధ్యతలను చూసుకుంటున్నాయి. దాదాపు మూడు నెలలుగా వేతనాలు చెల్లించకుండా తాత్సారం చేస్తున్నారు. దాంతో సెక్యూరిటీ గార్డులు ఇటీవల విధులు బహిష్కరించి నిరసనకు దిగారు. కాగా గతంలో సుమారు రూ.3 కోట్ల పీఎఫ్ డబ్బులు గోల్‌మాల్‌కు పాల్పడినట్టు ఆరోపణలు సైతం బహిరంగంగానే వచ్చాయి. ఆ సంస్థకు ఈ విషయంపై కార్మికశాఖ నుంచి నోటీసులు సైతం అందినట్టు సమాచారం. ఆయా ఏజెన్సీలతో నిమ్స్ యాజమాన్యం కుమ్మక్కై సెక్యూరిటీ గార్డుల వేతనాల విషయంలో తాత్సర్యం వహిస్తున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి.