
నిర్మల్ జిల్లాలో ఎండలు దంచికొడుతున్నాయి. రికార్డ్ స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రోడ్డెక్కితే చాలు మాడు పగిలిపోతోంది. ఎండ తీవ్రతకు వడగాలులు తోడవడంతో జనం బెంబెలెత్తిపోతున్నారు. రాష్ట్రంలోనే రికార్డ్ స్థాయి 45 డిగ్రీలపైనే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ దెబ్బకు ఎలక్ట్రిక్ వాహనాలు రోడ్డుపైనే ఖాళీ బూడిదవుతున్నాయి. పెట్రోల్ వాహనాలు సైతం ఎండ తీవ్రతకు అగ్ని ప్రమాదాలకు గురవుతున్నాయి. దీంతో అలర్ట్ అయిన ఓ పెట్రోల్ బంక్ యజమాని ఎండ తీవ్రత నుండి బంకు ను కాపాడుకునేందుకు ఎక్కడికక్కడ కూలర్లను ఏర్పాటు చేశాడు. పెట్రోల్, డీజిల్ కోసం వచ్చే ప్రయాణికులకు కాసేపు సేద తీరేలా ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేశాడు.
నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలం చించోలి బి గ్రామం వద్ద ఉన్న ఓ ప్రైవేట్ పెట్రోల్ ఫిల్లింగ్ స్టేషన్‌లో పెట్రోల్ పోసే మిషన్లకు ప్రత్యేకంగా కూలర్లను ఏర్పాటు చేశారు నిర్వహకులు. మధ్యాహ్నం పూట ఎండలు తీవ్రంగా ఉండడంతో మిషన్లు వేడెక్కుతున్నాయని, పేలిపోయే ప్రమాదం ఉందని కూలర్లను ఏర్పాటు చేయడంతో మిషన్లు పాడవకుండా ఉంటాయని ఆలోచనతో వీటిని ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. పెట్రోల్ కోసం వస్తున్న వాహనదారులు సైతం ఆ చల్లదనం కోసం బంకులో కాసేపు సేదతీరుతూ నిర్వహకులను మెచ్చుకుంటున్నారు.
మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..