సుప్రీం నిర్ణయం తర్వాతే విచారణ –

Written by RAJU

Published on:

సుప్రీం నిర్ణయం తర్వాతే విచారణ –– కంచ గచ్చిబౌలి భూములపై హైకోర్టు స్పష్టీకరణ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం కంచ గచ్చిబౌలి భూముల వివాదంపై సుప్రీం కోర్టు విచారణలో ఉన్నందున తాము విచారణ చేయడం సబబు కాదని హైకోర్టు పేర్కొంది. సుప్రీం కోర్టులో కేసు పెండింగ్‌లో ఉన్నందున అక్కడ నిర్ణయం వెలువడిన తర్వాతే తాము విచారణ చేపడతామని స్పష్టం చేసింది. దీంతో విచారణను ఈనెల 24కి వాయిదా వేస్తున్నట్టు ప్రకటించింది. ఈలోగా ప్రభుత్వంతోపాటు ప్రతివాదులు కౌంటర్లు దాఖలు చేయాలని కోరింది. కంచ గచ్చిబౌలి సర్వే నెంబర్‌ 25లో 400 ఎకరాలు కేటాయిస్తూ ప్రభుత్వ జీవో 54ను సవాలు చేస్తూ హైదరాబాద్‌కు చెందిన వాటా ఫౌండేషన్‌, కె బాబూరావు, హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ విద్యార్థుల యూనియన్‌లు, తాజాగా ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కెఎ పాల్‌ వేసిన పిల్స్‌ను యాక్టింగ్‌ చీఫ్‌ జస్టిస్‌ సుజరుపాల్‌, జస్టిస్‌ యారా రేణుకలతో కూడిన బెంచ్‌ సోమవారం విచారించింది. వారి తరఫున న్యాయవాది వాదిస్తూ, సుప్రీం కోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చిందనీ, ఈ వ్యవహారం ప్రస్తుతం సుప్రీం కోర్టు విచారణ చేపట్టినందున ఇక్కడి కేసు విచారణను వాయిదా వేయాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర అటవీశాఖ తరఫున హాజరైన సీనియర్‌ న్యాయవాది మేనకా గురుస్వామి వాదనలు వినిపిస్తూ భూకేటాయింపును వ్యతిరేకిస్తున్న వాళ్లు నెమళ్లు, జింకలు పారిపోతున్నట్టు ఫేక్‌ వీడియాలు, ఫొటోలను సృష్టించి తప్పుడు ప్రచారం చేసిన ఘటనపై పోలీసులతో దర్యాప్తు చేయించి ప్రాథమిక నివేదిక తెప్పించుకోవాలని సూచించారు. సుప్రీం కోర్టు విచారణ నేపథ్యంలో ఉత్తర్వులు ఇవ్వమన్న కారణంగా హైకోర్టు విచారణను ఈనెల 24వ తేదీకి వాయిదా వేసింది.
ఫోన్‌ట్యాపింగ్‌ కేసులో కీలక సూత్రధారి ప్రభాకర్‌రావే : హైకోర్టులో పోలీసులు కౌంటర్‌
ఫోన్‌ట్యాపింగ్‌ కేసులో ప్రధాన నిందితుడు టి ప్రభాకర్‌రావు కీలక సూత్రధారి అని గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో ప్రతిపక్ష నేతలు, వాళ్ల కుటుంబ సభ్యులు, జర్నలిస్టులు, హైకోర్టు జడ్జీలు, న్యాయాధికారులు, వ్యాపారులు, అధికారులు, ఇతరులకు చెందిన ఫోన్లపై అనధికారిక నిఘా పెట్టి ఫోన్‌ ట్యాపింగ్‌ చేయించారని పోలీసులు తెలిపారు. ఫోన్‌ట్యాపింగ్‌ కేసును కొట్టేయాలనీ, ముందస్తు బెయిల్‌ మంజూరు చేయాలంటూ ప్రధాన నిందితుడైన టి ప్రభాకర్‌రావు దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్‌ జె శ్రీనివాసరావు సోమవారం విచారణ చేపట్టారు. పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ వాదిస్తూ, ఎన్నికల ఫలితాలు వచ్చిన వెంటనే కీలక ఆధారాలైన హార్డ్‌డిస్క్‌లను ధ్వంసం చేయించారనీ, ఎఫ్‌ఐఆర్‌ దాఖలు అవ్వగానే అమెరికా పారిపోయారనీ, ముందస్తు బెయిల్‌ ఇవ్వొద్దని కోరారు. అనారోగ్యమంటూ ఇప్పుడు చెబుతున్న ప్రభాకర్‌రావు రెండుసార్లు సర్వీస్‌ పొడిగింపులో విధులు నిర్వహించారని వివరించారు. ఉద్యోగ విరమణ చేసినా ఐపీఎస్‌ క్యాడర్‌ నిబంధనలకు విరుద్ధంగా రెండుసార్లు సర్వీసు పొడిగింపుతోపాటు కీలకమైన నిఘా విభాగానికి ఆర్నెల్లు ఇన్‌ఛార్జిగా పూర్తి బాధ్యతలను నిర్వహించారని తెలిపారు. హైదరాబాద్‌ వదిలే ముందే ఇంటిలో ఎలాంటి ఆధారాలు లభించకుండా చేయడంతో సోదాలు నిర్వహించినా అవి లభించలేదన్నారు. పిటిషనర్‌ తరఫు న్యాయవాది సమాధానం కోసం హైకోర్టు విచారణను ఈనెల 15వ తేదీకి వాయిదా వేసింది.
దిల్‌సుఖ్‌నగర్‌ పేలుళ్లపై నేడు తీర్పు
దిల్‌షుక్‌నగర్‌ బాంబు పేలుళ్ల కేసులో మంగళవారం హైకోర్టు తీర్పు వెలువరించనుంది. 2013 ఫిబ్రవరి 21న బస్టాప్‌లోను, మిర్చిపాయింట్‌ దగ్గర రెండు పేలుళ్ల ఘటనలు జరిగాయి. 18 మంది చనిపోగా, 131 మంది గాయపడ్డారు. ఈ కేసులో ఎన్‌ఐఏ కోర్టు ఐదుగురికి ఉరిశిక్ష విధిస్తూ 2016 డిసెంబరు 13న తీర్పు చెప్పింది. ఏ1 మహమ్మద్‌ రియాజ్‌ అలియాస్‌ రియాజ్‌ భత్కల్‌ పరారీలో ఉన్నారు. అసదుల్లా అక్తర్‌, జియా ఉర్‌ రహమాన్‌, మహ్మద్‌ తహసీన్‌ అక్తర్‌, మహమ్మద్‌ అహ్మద్‌ సిద్ధి, అజాజ్‌ షేక్‌లకు మరణ శిక్ష విధించింది. దీన్ని నిర్ధారించే నిమిత్తం ఈ వ్యవహారం హైకోర్టుకు చేరింది. ఐదుగురు కూడా అప్పీల్‌ దాఖలు చేశారు. వీటిపై జస్టిస్‌ కె లక్ష్మణ్‌, జస్టిస్‌ పి శ్రీసుధలతో కూడిన డివిజన్‌ బెంచ్‌ మంగళవారం తీర్పు చెప్పనుంది.

Subscribe for notification
Verified by MonsterInsights