పాకిస్తాన్ ప్రధాన మంత్రి షాబాజ్ షరీఫ్ గురువారం (ఏప్రిల్ 24) జాతీయ భద్రతా కమిటీ (NSC) సమావేశానికి అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకుంది పాకిస్థాన్ సర్కార్. 2025 ఏప్రిల్ 22న పహల్గామ్లో జరిగిన ఉగ్రవాద దాడి తర్వాత జాతీయ భద్రతా వాతావరణం, ప్రాంతీయ పరిస్థితిని చర్చించారు. పాకిస్తాన్ జాతీయ భద్రతా కమిటీ సమావేశంలో అనేక సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. భారతదేశం నీటిని ఆపివేస్తే దానిని యుద్ధంగా పరిగణిస్తామని పాకిస్తాన్ హెచ్చరించింది.
పాక్ జాతీయ భద్రతా కమిటీ నిర్ణయాలుః
భారతదేశంతో ఉన్న అన్ని ద్వైపాక్షిక ఒప్పందాలను తక్షణమే నిలిపివేయాలని పాకిస్తాన్ సర్కార్ నిర్ణయం.
సిమ్లా ఒప్పందాన్ని నిలిపివేస్తున్నట్లు ప్రకటించిన పాకిస్థాన్.
వాఘా సరిహద్దును మూసివేస్తూ పాకిస్థాన్ నిర్ణయం.
పాకిస్తాన్ తన వైమానిక ప్రాంతాన్ని మూసివేసింది.
భారతీయుల వీసాలను రద్దు చేసిన పాకిస్థాన్.
పాకిస్తాన్లో ఉన్న భారతీయులందరూ ఏప్రిల్ 30 లోపు దేశం విడిచి వెళ్లాలని పాకిస్తాన్ ఆదేశాలు జారీ చేసింది. పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత సింధు జల ఒప్పందాన్ని నిలిపివేయాలన్న భారతదేశ నిర్ణయాన్ని పాకిస్తాన్ తిరస్కరించింది. ఇది 240 మిలియన్ల పాకిస్తానీయులకు జీవనాడి అని పేర్కొంది. సింధు జల ఒప్పందాన్ని భారతదేశం ఏకపక్షంగా నిలిపివేయడం యుద్ధ చర్యకు సమానమని, పూర్తి జాతీయ శక్తితో ప్రతిస్పందించినట్లని పాకిస్తాన్ ప్రభుత్వం ఆరోపించింది.
సింధు జల ఒప్పందాన్ని నిలిపివేయాలనే భారతదేశ నిర్ణయాన్ని పాకిస్తాన్ పూర్తిగా తప్పుబట్టింది. ఈ ఒప్పందం ప్రపంచ బ్యాంకు మధ్యవర్తిత్వంలో కుదిరిన అంతర్జాతీయ ఒప్పందం అని, భారతదేశం దీనిని ఏకపక్షంగా నిలిపివేయలేమని సమావేశంలో చర్చించారు. సింధు నది నీటిని ఆపడానికి లేదా మళ్లించడానికి భారతదేశం ప్రయత్నిస్తే, దానిని యుద్ధ చర్యగా పరిగణించి, పూర్తి శక్తితో ప్రతిస్పందిస్తామని పాకిస్తాన్ హెచ్చరించింది.
భారత్ – పాక్ మధ్య ఉన్న వాఘా సరిహద్దును తక్షణమే మూసివేయాలని పాకిస్థాన్ నిర్ణయించింది. అన్ని రకాల వ్యాపారాలు, పౌర కదలికలు నిషేధిస్తున్నట్లు ప్రకటించింది. దీంతో పాటు, ఇస్లామాబాద్‌లోని భారత హైకమిషన్‌లోని సైనిక, నావికాదళ, వైమానిక దళ సలహాదారులను అవాంఛనీయ వ్యక్తులుగా ప్రకటించారు. ఏప్రిల్ 30 నాటికి దేశం విడిచి వెళ్లాలని ఆదేశించారు. అలాగే, భారత హైకమిషన్ సిబ్బంది సంఖ్యను 30కి పరిమితం చేశారు.
సార్క్ వీసా మినహాయింపు పథకం కింద భారతీయ పౌరులకు జారీ చేసిన అన్ని వీసాలను పాకిస్తాన్ తక్షణమే రద్దు చేసింది. సిక్కు యాత్రికులకు మాత్రమే దీని నుండి మినహాయింపు ఇచ్చింది. అంతే కాకుండా, పాకిస్తాన్ భారత విమానయాన సంస్థలకు తన గగనతలాన్ని పూర్తిగా మూసివేసింది. ఇప్పుడు ఏ భారతీయ విమానాలు పాకిస్తాన్లోకి ప్రవేశించలేవు. పాకిస్థాన్‌పై ఎగరలేవు.
ఈ సమావేశంలో, పాకిస్తాన్ మరోసారి అంతర్జాతీయ వేదికపై కాశ్మీర్ సమస్యను లేవనెత్తడం గురించి మాట్లాడింది. కాశ్మీర్ అనేది భారతదేశం – పాకిస్తాన్ మధ్య పరిష్కారం కాని వివాదం అని, భారతదేశం ఇటీవలి చర్యలు ప్రాంతీయ శాంతికి హాని కలిగిస్తాయని అన్నారు. భారతదేశంలో మైనారిటీలపై, ముఖ్యంగా ముస్లింలపై ప్రభుత్వ ప్రాయోజిత హింస పెరుగుతోందని, ఇది దక్షిణాసియా స్థిరత్వానికి పెద్ద ముప్పుగా పరిణమిస్తుందని పాకిస్తాన్ ఆరోపించింది.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..