ఇండిగో ఎయిర్‌లైన్స్ దేశీయ విమానం అత్యవసరంగా ల్యాండ్ అయింది. ఆకాశంలో ఎగురుతున్న విమానం ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ అంతర్జాతీయ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ చేయబడింది. విమానం టాయిలెట్‌లో బెదిరింపు సందేశం కనిపించడంతో ప్రయాణికుల్లో భయాందోళనలు నెలకొన్నాయి. దాంతో పైలట్ విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ చేయాల్సి వచ్చింది. ప్రోటోకాల్ ప్రకారం, విమానాన్ని ఐసోలేషన్ బేకు తరలించారు. ఎమర్జెన్సీ డోర్ నుండి 225 మంది ప్రయాణికులను కిందకు దింపేశారు. అనంతరం విమానంలో తనిఖీలు చేపట్టారు.
విమానంలోని ప్రతి మూలను వెతికారు. కానీ అనుమానాస్పదంగా ఏమీ కనిపించలేదు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ సంఘటనను ఎయిర్‌లైన్ ధృవీకరించింది. విమానంలో ఉన్న వారందరూ సురక్షితంగా ఉన్నారని తెలిపింది.
నివేదిక ప్రకారం, ఇండిగో విమానం 6E 5324 ఏప్రిల్ 7న జైపూర్ విమానాశ్రయం నుండి ముంబైకి బయలుదేరినట్లు పోలీసులు వివరించారు. ఆ విమానంలో సిబ్బంది కాకుండా 225 మంది ప్రయాణికులు ఉన్నారు. విమానం గాల్లో ఉండగా ఒక వ్యక్తి విమానం టాయిలెట్‌లో ఒక నోట్ చూశాడు. ఆ నోట్ పై విమానం లోపల బాంబు ఉందని, అది కొన్ని నిమిషాల్లో పేలిపోతుందని రాసి ఉంది. బాంబు మీ కోసం వేచి ఉంది..ఇది జోక్ కాదు అని రాసి ఉండటంతో ఆ వ్యక్తి ఆ నోట్‌ను సిబ్బందికి చూపించాడు. దాంతో పైలట్ విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ చేశాడు. ముంబై ఎయిర్‌పోర్ట్‌లో అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. ఆ విమానం గట్టి భద్రత మధ్య విమానాశ్రయంలో ల్యాండ్ అయింది.
ఇవి కూడా చదవండి
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..