జగిత్యాల, ఏప్రిల్ 24 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో వానాకాలం పంట ప్రణాళిక ఖరారైంది. వానాకాలంలో రైతుల ఇబ్బందులు తొలగించడానికి వ్యవసాయశాఖ ముందస్తుగా సాగు ప్రణాళిక రూపొందించింది. వ్యవసాయ క్లస్టర్ల వారీగా ఎన్ని ఎకరాల్లో భూమి సాగవుతుందని అంచనా వేసి ఈ మేరకు అవసరమైన విత్తనాలు, ఎరువులు సిద్ధంగా ఉంచనున్నారు. జిల్లాలో సాధారణ సాగు కంటే వచ్చే వానాకాలం సీజన్‌లో అధికంగా వివిధ పంటలు సాగు అవుతాయని అధికారులు అంచనాలు రూపొందించారు. జిల్లా వ్యాప్తంగా అధికారులు రూపొందించిన వానాకాలం పంట ప్రణాళికపై ‘ఆంధ్రజ్యోతి’ కథనం…
ఫ3.10 లక్షల ఎకరాల్లో వరి సాగు అంచనా
జిల్లా వ్యాప్తంగా సాధారణ సాగు విస్తీర్ణం కంటే అధికంగా వానాకాలంలో పంటల సాగు అవుతుందన్న అంచనాను అధికారులు వేశారు. జిల్లాలో వివిధ పంటల సాధారణ సాగు విస్తీర్ణం 3,35,978 ఎకరాలు కాగా ఈ సీజన్‌లో 4,14,419 ఎకరాలు సాగు చేస్తారని అంచనా వేశారు. ఇది సాధారణం కన్నా 78,441 ఎకరాలు అధికంగా ఉంది. మండలాల్లోని క్లస్టర్ల వారీగా సాగు విస్తీర్ణం అంచనాలను వ్యవసాయ అధికారులు రూపొందించారు. ఇందులో ప్రధానంగా వరి 3,10,642 ఎకరాలు, మొక్కజొన్న 32,000 ఎకరాలు, కందులు 1,500, పెసర్లు 100, సోయా చిక్కుడు 500, పత్తి 18,000, చెరుకు 500 ఎకరాలు, పసుపు 8,500, మిరప 500 ఎకరాలు, పలు కూరగాయల పంటలు 400 ఎకరాలు, ఆయిల్ ఫాం 3,000 ఎకరాలు, మామిడి 38,277 ఎకరాలు, ఇతర పంటలు 500 ఎకరాల్లో సాగు కానున్నట్లు అధికారులు అంచనా వేశారు. 2023 సంవత్సరం వానాకాలం సీజన్‌లో జిల్లాలో 4,17,378 ఎకరాల్లో, 2024 వానాకాలం సీజన్‌లో 4,13,974 ఎకరాల్లో రైతులు వివిధ పంటలను సాగు చేశారు. 2025 వానాకాలం సీజన్‌లో గత యేడాది కంటే 445 ఎకరాలు అధికంగా సాగు చేయనున్నట్లు అధికారులు అంచనా వేశారు.
ఎరువుల ప్రణాళిక ఇలా…
జిల్లాలో ప్రతిపాదించిన పంటల విస్తీర్ణం ఆధారంగా ఎరువుల ప్రణాళికలు తయారు చేశారు. జిల్లాకు అవసరమైన ఎరువుల సరఫరా కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలను అధికారులు సమర్పించారు. ప్రస్తుత ఏప్రిల్ మాసం నుంచి రానున్న వానాకాలం సీజన్‌లో సెప్టెంబరు వరకు జిల్లాలో మొత్తం కాంప్లెక్స్ 10,653 మెట్రిక్ టన్నులు అవసరమవుతాయన్న అంచనా ఉంది. యూరియా 40,351 మెట్రిక్ టన్నులు, డీఏపీ 7,768, ఎంఓపీ 26,632, ఎస్‌ఎస్‌పీ 3,329 మెట్రిక్ టన్నులు అవసరమవుతాయని అంచనా వేశారు.
నకిలీ విత్తన విక్రయాలపై ప్రత్యేక నిఘా
జిల్లాలో సుమారు 450 విత్తన విక్రయ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. వాటి ద్వారా విత్తనాన్ని రైతులకు అందుబాటులో ఉంచనున్నారు. నకిలీ పత్తి, ఇతర విత్తన విక్రయాలను అరికట్టేందుకు టాస్క్‌ఫోర్స్ తనిఖీల్లో భాగంగా పోలీసులు, వ్యవసాయ శాఖ అధికారులతో కలిసి బృందాలను ఏర్పాటు చేశారు. మే 3వ వారం నుంచి జిల్లా వ్యాప్తంగా అన్ని విత్తన విక్రయ కేంద్రాల్లో తనిఖీలు నిర్వహిస్తున్నారు. రైతులకు నాణ్యమైన విత్తనం, ఎరువుల, పరుగు మందులు అందించడానికి అధికారులు ఇచ్చిన లక్ష్యం ప్రకారం ప్రతీ ఎరువు, విత్తన దుకాణాలను తనిఖీ చేసి నమునాలను సేకరించి పరీక్షా కేంద్రానికి పంపడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.
అంచనాలు రూపొందించాం
-భాస్కర్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి
జిల్లాలో రానున్న వానాకాలం పంట సాగు అంచనాలను రూపొందించాం. అందుకు అనుగుణంగా విత్తనాలు, ఎరువులను రైతులకు అందుబాటులో ఉంచేందుకు కసరత్తులు చేస్తున్నాం. జిల్లాలో ప్రధానంగా వరి, మొక్కజొన్న, ఇతర పంటలను సాగు చేస్తారు. ఇందుకు తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థ ద్వారా సిద్ధం చేస్తున్నాం. రైతులకు పంట సాగుపై అవగాహన కల్పించడానికి ప్రణాళిక రూపొందించాం.
Updated Date – Apr 25 , 2025 | 01:32 AM