
వెర్టిగో అనేది తరచుగా తల తిరుగడానికి ప్రధాన కారణంగా పేర్కొనబడుతుంది. BPPV (Benign Paroxysmal Positional Vertigo) అనే పరిస్థితిలో చెవి లోపల చిన్న కణాలు తారుమారు అయి శరీర సమతుల్యాన్ని ప్రభావితం చేస్తాయి. దీంతో వ్యక్తి స్థిరంగా ఉండగలిగినా అంతర్గతంగా తల తిరుగుతున్నట్లు అనిపిస్తుంది. ముఖ్యంగా తల ఉంచిన దిశ మారినప్పుడు ఈ లక్షణం స్పష్టంగా కనిపించవచ్చు.
శరీరానికి అవసరమైన మేరకు ద్రవాలు అందకపోతే రక్తం ప్రసరణ మెల్లగా జరగడం మొదలవుతుంది. దీని ప్రభావంగా మెదడుకు తగినంత ఆక్సిజన్ చేరకపోవచ్చు. ఇది తల తిరిగినట్లు అనిపించడానికి కారణమవుతుంది. వేసవి కాలంలో అధికంగా చెమట రావడం, నీరు తక్కువగా తాగడం వంటి అలవాట్లు ఈ సమస్యకు దారి తీస్తాయి.
అకస్మాత్తుగా లేచినప్పుడు తల తిరగడం చాలా మందిలో కనిపించే సమస్య. ఇది తరచూ ఆర్థోస్టాటిక్ హైపోటెన్షన్ అనే పరిస్థితి కారణంగా జరుగుతుంది. దీనిలో శరీరం నిలబడిన వెంటనే రక్తపోటు తక్కువవడం వల్ల తల తిరుగుతుంది. దీనికి సరైన ఆహారం, మందుల ద్వారా చికిత్స అవసరం.
కొన్ని రకాల మందులు ముఖ్యంగా మానసిక ఒత్తిడికి సంబంధిత ఔషధాలు, నిద్రలేమి మందులు లేదా రోగనిరోధక మందులు కూడా తల తిరుగుడికి కారణమవుతాయి. దీన్ని గమనించి ఉపయోగిస్తున్న మందులపై డాక్టర్‌ను సంప్రదించడం అవసరం.
స్లీప్ అప్నియా ఉన్నవారిలో రాత్రివేళ శ్వాస సవ్యంగా జరగకపోవడంతో మెదడుకు అవసరమైన ఆక్సిజన్ సరిపడా చేరదు. దీని ప్రభావంగా రోజు సమయంలో అలసట, తల తిరుగుట వంటి లక్షణాలు కనిపించవచ్చు.
గుండె సమస్యలు ఉన్నవారికి రక్త సరఫరా సరైన స్థాయిలో జరగకపోవడం వల్ల తల తిరుగుతుంది. ఇది ముఖ్యంగా గుండె పంపింగ్ సామర్థ్యం తగ్గినప్పుడు లేదా హృదయ సంబంధ సమస్యలు ఉన్నప్పుడు కనిపిస్తుంది. ఇది తీవ్రమైన సమస్య కావచ్చు కాబట్టి డాక్టర్‌ను సంప్రదించాలి.
మహిళలలో నెలసరి సమయంలో లేదా మెనోపాజ్ సమయంలో ఎస్ట్రోజన్ లెవెల్స్ మారటం వల్ల తల తిరిగినట్లు అనిపించవచ్చు. ఇది తాత్కాలికంగా ఉండే పరిస్థితి అయినా పదే పదే జరిగితే వైద్య సలహా అవసరం.
ఈ సమస్యకు నివారణ చిట్కాలు
- రోజూ సమయానికి తగినంత నీరు తాగడం
- ఒత్తిడిని తగ్గించే యోగా, ధ్యానం చేయడం
- నిద్ర పట్టే విధంగా జీవన విధానంలో మార్పులు
- ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం
- మితంగా వ్యాయామం చేయడం
- అవసరమైతే వైద్య పరీక్షలు చేయించుకోవడం
ఈ విధంగా సడన్ గా తల తిరుగుతున్న అనుభూతి వెనుక అనేక కారణాలు ఉండవచ్చు. అవి తాత్కాలికమైనవైనా, దీర్ఘకాలికమైనవైనా సరే వాటిని నిర్లక్ష్యం చేయకూడదు.