
నాగర్ కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శ్రీశైలం దర్శనానికి వెళ్తున్న మహారాష్ట్ర ఐపీఎస్ అధికారి సుధాకర్ పాతరే, ఆయన బంధువు ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ఉగాది పండుగ ముందురోజు నల్లమల అడవిలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. అమ్రాబాద్ మండలం దోమలపెంట ఆక్టోపస్ వ్యూ పాయింట్ సమీపంలో శ్రీశైలం నుంచి వస్తోన్న ఆర్టీసి బస్సు, బాధితులు ప్రయాణిస్తున్న ఇన్నోవా కారు ఎదురెదురుగా ఢీ కొన్నాయి. ఘటనలో మహారాష్ట్ర క్యాడర్ ఐపీఎస్ అధికారి డా సుధాకర్ పాతరే, ఆయన బంధువు భగవత్ కిషన్ రావు పాటిల్‌కు తీవ్ర గాయాలు అయ్యాయి. ప్రమాదంలో ఇన్నోవా కారు ముందు భాగం నుజ్జు నుజ్జు అయ్యింది. సమాచారం అందుకున్న ఈగలపెంట పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని క్షతగాత్రులను కారులో నుంచి బయటకు తీసారు. అనంతరం అచ్చంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స అందించేందుకు హైదరాబాద్ కు తరలించారు. అయితే దారిలో వెల్దండ సమీపంలోనే ఇద్దరు తుదిశ్వాస విడిచారు. మృతదేహాలు కల్వకుర్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ట్రైనింగ్ కోసం NPA హైదరాబాద్‌కు
ప్రస్తుతం డా,సుధాకర్ పాతరే ముంబై పోర్ట్ జోన్ డీసీపీగా విధులు నిర్వహిస్తున్నారు. త్వరలోనే ఆయన DIG గా ప్రమోషన్ పొందే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇక విధుల్లో భాగంగా ప్రస్తుతం ఆయన NPA లో ట్రైనింగ్ తీసుకుంటున్నారు. శ్రీశైలం మల్లికార్జున స్వామి వారిని దర్శించుకునేందుకు ఉదయం బంధువు భగవత్ కిషన్ రావు పాటిల్ తో కలిసి ఇన్నోవా కారులో ప్రయాణం అయ్యారు. మరి కొన్ని నిమిషాల్లో శ్రీశైలం చేరుతామనగా మృత్యువు కబళించింది. ఇక డా,సుధాకర్ పాతరే మరణ వార్త తెలియడంతో ఆయన కుటుంబంలో విషాదం నిండుకుంది. మరోవైపు డా,సుధాకర్ పాతరే మృతిపట్ల ముంబై పోలీస్ కమిషనర్ వివేక్ సంతాపం తెలిపారు. ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..