
ఐరన్ శరీరంలో హీమోగ్లోబిన్‌తో పాటు మసిల్ సెల్స్‌లో ఉండే మయోగ్లోబిన్ అనే ప్రొటీన్లను కూడా నిర్మించేందుకు సహాయపడుతుంది. ఇవి మన శరీరంలో శక్తిని ఆరోగ్యాన్ని నిలబెట్టడంలో కీలక పాత్ర పోషిస్తాయి. అంతేకాదు ఐరన్ రోగనిరోధక శక్తిని మెరుగుపరిచి చర్మాన్ని, జుట్టును, గోళ్ళను ఆరోగ్యంగా ఉంచుతుంది.
ఐరన్ లోపం ఉన్నప్పుడు రక్త ప్రసరణ సరిగా జరగకపోవచ్చు. దీని ప్రభావం చేతులు, కాళ్ల మీద కనిపిస్తుంది. సాధారణంగా వేడి ఉండే ప్రాంతాల్లోనూ వారు చల్లగా అనిపించుకోవచ్చు. ఇది శరీరానికి తగినంత ఆక్సిజన్ అందకపోవడం వల్ల జరుగుతుంది.
ఐరన్ తక్కువగా ఉన్నవారికి చిన్న పని చేసినా అలసటగా అనిపిస్తుంది. శరీరంలో తక్కువ ఐరన్ వల్ల ఆక్సిజన్ సరైన మోతాదులో అందకపోవడం వల్ల శక్తి స్థాయి తగ్గిపోతుంది. ఈ కారణంగా వారు శారీరకంగా, మానసికంగా బలహీనంగా అనిపించుకుంటారు.
ఐరన్ లోపం ఉన్నవారికి చిన్న దూరం నడిచినా, సగం మెట్లు ఎక్కినా ఊపిరి పెరగడం, గాఢంగా శ్వాస తీసుకోవడం వంటి లక్షణాలు కనిపించవచ్చు. ఇది శరీరంలోని కండరాలకు తగినంత ఆక్సిజన్ అందకపోవడం వల్ల కలిగే పరిణామం.
తరచూ తలనొప్పి రావడం కూడా ఐరన్ తక్కువగా ఉన్నట్లు సూచించే ఒక సంకేతం. మెదడుకు తగినంత ఆక్సిజన్ అందకపోవడం వల్ల నాడీ వ్యవస్థ ప్రభావితమవుతుంది. ఫలితంగా మైగ్రేన్ లాంటి తలనొప్పులు వచ్చే అవకాశం ఉంటుంది.
ఐరన్ లోపం ఉన్నవారి గోళ్లు బలహీనంగా, పొడిగా మారతాయి. కొంచెం ఒత్తిడి వచ్చినా విరగడం లేదా ముడతలు పడటం వంటి సమస్యలు ఏర్పడతాయి. ఇది శరీరంలో పోషకాల లోపాన్ని సూచించే కీలక లక్షణంగా పరిగణించబడుతుంది.
ఐరన్ లోపాన్ని మొదటి దశలోనే గుర్తించి పోషకాహారంతో ఎదుర్కోవడం చాలా అవసరం. ఆహారంలో పాలకూర, బీట్రూట్, గోంగూర, ఎండు ద్రాక్ష వంటి ఐరన్ అధికంగా ఉండే పదార్థాలను చేర్చాలి. శరీరానికి అవసరమైన ఐరన్ తగినంతగా అందితే ఆరోగ్య సమస్యల నుంచి తప్పించుకోవచ్చు. కానీ తీవ్రమైన లక్షణాలు కనిపిస్తే వైద్యుని సలహా తీసుకోవడం మంచిది.