ఒకప్పుడు గురువులను చూస్తే.. విద్యార్థులు వణికిపోయేవారు. స్కూళ్లు, కాలేజీల్లో ఉపాధ్యాయులు చాలా కఠినంగా ఉంటూ.. అవసరమైనపుడు చేతికి, కర్రకు పని చెబుతూ విద్యార్థుల్ని అదుపులో పెట్టేవారు. పిల్లల మీద చేయి చేసుకోవడం కరెక్ట్ అని చెప్పలేం కానీ.. కొన్నిసార్లు వారిని క్రమశిక్షణలో పెట్టడానికి అది అవసరం అన్న వాదనా ఉంది. కానీ ఈ రోజుల్లో స్కూళ్లు, కాలేజీల్లో పిల్లల మీద చెయ్యెత్తినా, కఠినంగా వ్యవహరించినా అంతే సంగతులు. అలా చేస్తే అదో పెద్ద వివాదంగా మారుతుంది. స్టూడెంట్ లను ఉపాధ్యాయులు కొట్టడం సంగతి అలా ఉంచితే.. ఇప్పుడు స్టూడెంట్సే టీచర్ల మీద దాడికి పాల్పడుతున్న ఉదంతాలు తరచుగా చూస్తున్నాం. తాజాగా విశాఖపట్నంలోని రఘు ఇంజినీరింగ్ కాలేజీలో జరిగిన ఓ ఘటన సోషల్ మీడియాలో సంచలనం రేపుతోంది.
ఒక విద్యార్థిని ఏకంగా లెక్చరర్‌ను చెప్పుతో కొట్టిన ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అమ్మాయి సెల్ ఫోన్ వాడుతుండడం చూసి లెక్చరర్ దాన్ని లాక్కున్నారు. దీంతో ఆ అమ్మాయికి పట్టరాని కోపం వచ్చేసింది. సెల్ ఫోన్ ఇచ్చేయమంటూ వార్నింగ్ ఇచ్చింది. కానీ లెక్చరర్ ఫోన్ ఇవ్వలేదు. దీంతో బూతులు తిడుతూ అమ్మాయి రెచ్చిపోయింది. ఫోన్ ఇవ్వకపోతే చెప్పు తీసుకుని కొట్టేస్తా అని వార్నింగ్ ఇచ్చిన ఆ అమ్మాయి.. మొబైల్ ఇవ్వకపోవడంతో అన్నంత పనీ చేసింది. చెప్పు తీసి లెక్చరర్‌ను కొట్టేసింది. దీంతో లెక్చరర్ తిరిగి ఆ అమ్మాయి మీద దాడి చేసింది. ఇంతలో చుట్టూ ఉన్న విద్యార్థులు వచ్చి ఆ అమ్మాయిని పక్కకు లాక్కెళ్లారు. సెల్ ఫోన్ లాక్కున్నందుకు ఏకంగా లెక్చరర్ మీద చెప్పుతో దాడి చేయడం ఏంటి అంటూ సోషల్ మీడియా జనాలు అవాక్కవుతున్నారు. ఈ రోజుల్లో పిల్లల పెంపకం ఎలా ఉంటోందో చెప్పడానికి ఇది రుజువు అని.. సదరు అమ్మాయి మీద కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
