వైద్యారోగ్యానికి రూ.12,393 కోట్లు కేటాయింపు –

Written by RAJU

Published on:

వైద్యారోగ్యానికి రూ.12,393 కోట్లు కేటాయింపు –– గతేడాది కన్నా రూ.800 కోట్లు అధికం రాష్ట్ర బడ్జెట్‌లో 4.06 శాతం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
వైద్యారోగ్య రంగానికి రాష్ట్ర ప్రభుత్వం 2025-26 వార్షిక బడ్జెట్‌లో రూ.12,393 కోట్లు కేటాయించింది. గతేడాది కన్నా రూ.800 కోట్లు అధికంగా ప్రస్తుత రాష్ట్ర బడ్జెట్‌ రూ.3,04,965 లక్షల కోట్లలో 4.06 శాతంగా ఉంది. ప్రజారోగ్యరంగం బలోపేతానికి కనీసం 8 నుంచి 10 శాతం నిధులు కేటాయించాలని డిమాండ్‌ ఉన్నా గత కొన్ని సంవత్సరాలుగా వైద్యారోగ్య బడ్జెట్‌ 4 శాతానికి అటు, ఇటుగా ఉంటుందే తప్ప పెరగడం లేదు. గతేడాది బడ్జెట్‌ అంచనాలు రూ.11,468 కాగా అందులో, సవరించిన బడ్జెట్‌ రూ.11,043కు తగ్గింది. ఇది 2024-25 బడ్జెట్‌ రూ.2,91,159 కోట్లలో 3.9 శాతంగా ఉంది. కోవిడ్‌-19 మహమ్మారి వణికించిన ఏడాది 2020-21లో మాత్రమే అప్పటి రాష్ట్ర బడ్జెట్‌లో 4.3 శాతం కేటాయించారు. ఆ తర్వాత 2021-22లో అది 3.3 శాతానికి తగ్గింది. 2022-23లో దాదాపు ఐదు శాతానికి పెరిగి, ఆ తర్వాత తగ్గుతూ వస్తున్నది. గతేడాదితో పోలిస్తే స్వల్పంగా పెరిగిన బడ్జెట్‌లో కొన్ని అంశాలకు ప్రాధాన్యత ఇచ్చారు. ఆరోగ్య సదుపాయాల నిర్వహణకు గతేడాది రూ.5,181 కోట్లు ఉండగా ఈ ఏడాది రూ.485.80 కోట్లు అదనంగా రూ.5,666.86 కోట్లు కేటాయించారు. ఆరోగ్య పథకాల బడ్జెట్‌ను రూ.5,216.66 కోట్ల నుంచి రూ.6,070.27 కోట్ల పెంచారు. గతేడాది కన్నా ఇది రూ.853.61 కోట్లు అదనం. రాజీవ్‌ ఆరోగ్యశ్రీ పథకానికి అధిక ప్రాధాన్యతనిచ్చారు. 2023 డిసెంబర్‌ నుంచి ప్రభుత్వం వివిధ ఆస్పత్రులకు ఆరోగ్యశ్రీ పథకం కింద రూ.1,215 కోట్లు (గత సంవత్సరాల కన్నా 50 శాతం అధికం) విడుదల చేసినట్టు తెలిపింది. నిర్వహణ కింద డీఎంఈకి రూ.2,293 కోట్లు, డీహెచ్‌ కు రూ.1,252 కోట్లు, ఈహెచ్‌ఎస్‌ కు రూ.150 కోట్లు, ఆయుష్మాన్‌ భారత్‌కు రూ.81 కోట్లు ఇచ్చారు. గతేడాది జీరోగా ఉన్న ఎంసీహెచ్‌ కిట్‌ కు రూ.16 కోట్లు కేటాయించారు. రూ.2,700 కోట్లతో 27 ఎకరాల్లో ఉస్మానియా ఆస్పత్రిని పునర్నిర్మిస్తున్నట్టు ప్రకటించింది.
ఆ ఆస్పత్రులపై ప్రత్యేక శ్రద్ధ అవసరం -డాక్టర్‌ కిరణ్‌ మాదాల
హైదరాబాద్‌ నగర జనాభా పెరుగుతున్న దృష్ట్యా ఉస్మానియా, గాంధీ ఆస్పత్రులపై ప్రత్యేక శ్రద్ధ కనబరచాలని తెలంగాణ ప్రభుత్వ బోధనా వైద్యుల సంఘం సెక్రెటరీ జనరల్‌ డాక్టర్‌ కిరణ్‌ మాదాల తెలిపారు. వీటితో పాటు కాకతీయ మెడికల్‌ కాలేజీకి పునర్వైభవం తేవాల్సిన అవసరముందని చెప్పారు. ఒకప్పుడు ప్రయివేటు రంగంతో పోటీ పడిన ఈ ఆస్పత్రులు గత 20 ఏండ్లుగా పోటీని తట్టుకోలేకపోతున్నాయని వివరించారు. వచ్చే పదేండ్లలో హైదరాబాద్‌ జనాభా రాష్ట్ర జనాభాలో 40 శాతం కానున్న నేపథ్యంలో ఇక్కడి పేదలకు మెరుగైన వైద్యం, విద్యార్థులకు మెరుగైన వైద్యవిద్య కోసం వీటిని మరింత బలోపేతం చేయాలని సూచించారు.
ఉద్యోగుల సమస్యల ప్రస్తావనేది? :భూపాల్‌
వైద్యారోగ్య రంగం కీలకమంటూనే ఆ శాఖలో పని చేసే ఉద్యోగుల సమస్యలను ప్రస్తావించలేదని తెలంగాణ యునైటెడ్‌ మెడికల్‌ అండ్‌ హెల్త్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ గౌరవాధ్యక్షులు భూపాల్‌ తెలిపారు. కాంగ్రెస్‌ సర్కారు ఉద్యోగుల పట్ల వివక్ష చూపించిందని విమర్శించారు. కేటాయింపులు ఉద్యోగుల జీతభత్యాలు, నిర్వహణకే సరిపోయేలా ఉన్నాయ చెప్పారు. కాంట్రాక్ట్‌ ఉద్యోగుల రెగ్యులరైజేషన్‌ అంటూ కాంగ్రెస్‌ ఇచ్చిన హామీపై ప్రకటన లేదన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను బలోపేతం చేస్తే తప్ప ఆరోగ్యరంగం బలోపేతం కాదని స్పష్టం చేశారు.

Subscribe for notification