
కన్నవారిని చివరి దశలో కంటికి రెప్పలా కాపాడాల్సిన సంతానం వారిని వృద్ధాశ్రమానికి పరిమితం చేస్తున్నారు. తల్లిదండ్రుల ఆస్తులు పంచుకుంటున్న కొడుకులు, కూతుళ్లు.. కన్నవారి కడుపుకోతను మాత్రం అర్థం చేసుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు. యాంత్రికయుగంలో బంధాలు అనుబంధాలు దూదిపింజల్లా తేలిపోతున్నాయి. ఓ ఇంటివారు కాగానే కన్నవారు పరాయివారవుతున్నారు. పిల్లల్ని పసితనం నుంచీ గారంబంగా పెంచి, ఉన్నత చదువులు చదివించి వారిని ఓస్థాయిలో నిలబెట్టేందుకు రెక్కలు ముక్కలు చేసుకున్న తల్లిదండ్రులకు చివరి దశలో ఒంటరిగా మిగిలిపోతున్నారు.
ఆర్థికస్థోమత లేక, పెళ్లాం పిల్లల్ని పోషించడమే కష్టమైపోతుందనుకుంటున్నారు కొందరు పుత్రరత్నాలు. చిన్నప్పుడు గోరుముద్దలు తినిపించిన అమ్మానాన్నల్ని వృద్ధాశ్రమానికి చేరుస్తున్నారు. కొంతమంది సంపాదన ఉండి కూడా.. వృద్ధాప్యంలో ఉన్న కన్నవారిని వదిలించుకుంటున్నారు. హైదరాబాద్ నగరంలో గతంలో వేళ్లమీద లెక్కపెట్టే సంఖ్యలో ఉన్న వృద్ధాశ్రమాలు ఇప్పుడు పదుల సంఖ్యకు చేరుకున్నాయి.
రెక్కలొచ్చిన పిల్లలు దూరమయ్యారనే వేదనే తప్ప శాపనార్థాలు పెట్టటం లేదెవరూ. మనవళ్లు మనవరాళ్లను చూసుకోలేకపోతున్నామనే ఆవేదన ఉన్నా.. ఎవరి జీవితాలు వారివని సరిపెట్టుకుంటున్నారు. ఎక్కడున్నా తమ పిల్లలు బాగుండాలని కోరుకుంటున్నారు. పిల్లలకు ఇబ్బంది కలగొద్దనే ఉద్దేశంతోనే తామిక్కడ ఉంటున్నామంటున్నారు కొందరు కన్నతల్లులు.
చిన్నప్పుడు మా పిల్లలను ఎలా పెంచి పెద్దచేశామో ఇప్పుడు వారు కూడా తమ పిల్లల్ని పెంచి పెద్ద చేయాలి కదా. అందుకే వారికి భారం కాకూడదనే వృద్ధాశ్రమంలో ఉంటున్నామంటున్నారు. ఎవరూ లేక అనాధల్లా వృద్ధాశ్రమంలో ఉంటున్నవారు కొందరైతే.. అందరూ ఉండికూడా అనాథల్లా బతుకుతున్నవారు ఇంకొందరు.
అనాథల్లా కాకుండా ఆత్మీయుల్లా చూసుకుంటూ తమకింత నీడనిస్తున్న ఇలాంటి జాయ్ ఫౌండేషన్‌ని ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాయి పండుటాకులు. ఈ ఫౌండేషన్ లేకపోతే తామెప్పుడో దిక్కులేని చావు చచ్చేవాళ్ళమని, తమలాంటివారిని చేరదీసి కన్నబిడ్డలకు దూరంగా ఉన్నామన్న లోటు లేకుండా చూసుకుంటున్న ఫౌండేషన్‌కి రుణపడి ఉంటామంటున్నారు.
కొందరు డబ్బున్నవాళ్లు క్షణం తీరికలేనంత బిజీగా ఉండి తల్లిదండ్రులను వృద్ధాశ్రమంలో వదిలేస్తున్నారు. ఎక్కడెక్కడో స్థిరపడాల్సి రావటంతో తల్లిదండ్రులను తోడు తీసుకెళ్లలేక కొందరు అన్ని సదుపాయాలున్న ఓల్డేజ్ హోమ్స్‌లో చేరుస్తున్నారు. తాము దగ్గర లేమన్న బాధ తప్ప అన్నీ తామే సమకూరుస్తున్నామంటున్నారు కొందరు. మిడిల్ క్లాస్ వాళ్ళు మాత్రం ఎన్జీవోలు రన్ చేస్తున్న ఉచిత వృద్ధాశ్రమాలలో తల్లిదండ్రులను ఉంచుతున్నారు.
దేశ జనాభాలో గణాంకాలను బట్టి 10శాతంమంది వృద్ధులున్నారు. వారిలో 60 సంవత్సరాలు పైబడినవారే ఎక్కువ. అయితే ఈకాలపు యువత పెళ్లి తర్వాత కుటుంబంతో గడపాలని కోరుకోవడం లేదు. విడిగా ఉండాలనుకుంటున్నారు. తమ కెరీర్, సంపాదన, సంతోషం.. వీటిపైనే దృష్టిపెడుతోంది ప్రస్తుత జనరేషన్. ఉన్నోళ్లయినా లేనోళ్లయినా చెప్పుకోవడానికి అందరికీ ఏదో ఒక కారణం. కానీ కన్నవారి గుండెలు ఎంతలా తల్లడిల్లిపోతున్నాయో ఎంతమందికి తెలుసు?!