(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కరీంనగర్)
ఇంటికి బంధువులొచ్చారు…. వారికి టీనో, కాఫీనో ఇవ్వడం కనీస మర్యాద… కాని ఇంట్లో పాలు లేవు… తెప్పిద్దామంటే తెచ్చేవారు లేరు…. బంధువుల ముందు మనమే బయటకు వెళ్లలేని పరిస్థితి…. ఎప్పుడో ఒకసారి అందరికీ ఈ పరిస్థితి ఎదురు కావడం సహజమే… కాని ఇప్పుడు ఆ పరిస్థితి వస్తే చింతించాల్సిన అవసరం లేదు. పాల ప్యాకెట్ నుంచి పండ్ల వరకు, కూరగాయల నుంచి సకల నిత్యావసర వస్తువుల వరకు ఆర్డర్ చేస్తే చాలు పది నిమిషాల్లో ఇంటికి తీసుకు వచ్చేందుకు పలు సంస్థలు క్యూ కడుతున్నాయి. పదంటే పది నిమిషాల్లోనే మీరు కోరుకున్న వస్తువులు మీ ముంగిట్లోకి తీసుకు వచ్చేందుకు సంస్థలు వెలిశాయి. హైదరాబాద్ లాంటి మహా నగరాల్లోనే కాదు, ద్వితీయ శ్రేణి పట్టణాల్లోకి కూడా క్విక్ కామర్స్ విస్తరించింది. కరీంనగర్ లాంటి అభివృద్ధి చెందుతున్న నగరాల్లోనూ ఈ సంస్థలు సేవలు ప్రారంభించాయి. ఆయా సంస్థలు ఆన్‌లైన్‌లో తమ ఆప్‌లను ఉంచి వాటి ద్వారా ఆర్డర్ చేసే కస్టమర్‌లకు ఇంటి వద్దకే వస్తువులు తెచ్చి ఇచ్చే సేవలను ప్రారంభించాయి.
తక్కువ సమయంలో డెలివరీ
జెప్టో, బ్లింకిట్, స్విగ్గీ ఇన్‌స్టా మార్ట్ వంటి సంస్థలు క్విక్ కామర్స్ రంగంలోకి రాగా, కరీంనగర్‌లో జెప్టో, స్విగ్గీ ఇన్‌స్టా మార్ట్ తమ సేవలను ప్రారంభించాయి. ఈ సంస్థలు నగరంలోని వినియోగదారులకు చేరువై వారు ఆశించిన దానికంటే ఎక్కువే ఆర్డర్‌లు పొందుతున్నాయి. మిగతా సంస్థలు కూడా తమ సేవలు ప్రారంభించేందుకు ముందుకు వస్తున్నాయి. భార్య, భర్తలు ఉద్యోగులు కావడమో, వ్యాపార వాణిజ్య ఇతర వృత్తుల్లో ఉండే వారు ఉదయమే పనుల నిమిత్తం బయటకి వెళ్లాల్సిన పరిస్థితుల్లో గృహిణులకు నిత్యావసర వస్తువులు తెచ్చుకోవడం సమస్యగా మారుతున్న రోజులివి. పెద్ద పెద్ద సూపర్ మార్కెట్లు, మాల్స్ ఇంటి వద్దకు సామాను డెలివరీ చేసే పద్ధతిని ఇది వరకే ప్రారంభించాయి. అవి ఉదయం ఆర్డర్ ఇస్తే సాయంత్రానికో, సాయంత్రం ఆర్డర్ ఇస్తే ఉదయానికో వచ్చేవి. వంట చేస్తున్న సమయంలోనే ఏదైనా నిత్యావసర వస్తువు లేదని గమనించినా పాలు, పెరుగు కూరగాయలాంటివి తక్షణమే కావాల్సి ఉంటే ఇప్పుడు క్షణాల్లో ఆర్డర్ చేసి పది నిమిషాల్లో పొందే వీలు నగరంలో ఉన్నది. షాపులకు మార్కెట్‌లకు, మాల్స్‌కు వెళ్లి సరుకులు కొనుగోలు చేసేందుకు ఎక్కువ సమయం పట్టడంతో ఆ సమయాన్ని ఆదా చేసుకుని ఇతర పనులు చేసుకునేందుకో ఇంట్లో గడిపేందుకో వినియోగించుకునేందుకు చాలా మంది క్విక్ కామర్స్ సేవలను వినియోగించుకోవడానికి ముందుకు వస్తున్నారు. ఆన్‌లైన్‌లో డబ్బు చెల్లించి కాని, క్యాష్ ఆన్ డెలివరీ పద్ధతిలో గాని ఆర్డర్ చేసి సరుకులు పొందవచ్చు. పది నిమిషాల్లో సరుకులు మీ ఇంట్లో అనే నినాదంతో ఈ క్విక్ కామర్స్ సంస్థలు మార్కెట్‌లోకి వచ్చి సేవలు అందిస్తున్నాయి.
చార్జీలతో కలిపి ధర ఎక్కువైనా..
బయటి మార్కెట్‌లోని షాపుల్లో కంటే చార్జీలతో కలిపి కొంత ధర ఎక్కువ ఉన్నా అవసరమైనప్పుడు ఆ వస్తువు అందుబాటులోకి వస్తుండడంతో వినియోగదారులు ఈ సేవలను పొందడానికి ఆసక్తి చూపిస్తున్నారు. కరీంనగర్‌లో ప్రస్తుతం జెప్టో సంస్థ ఫిబ్రవరి నెల నుంచి ఈ సేవలు అందిస్తున్నది. హనుమాన్‌నగర్, వావిలాలపల్లి, సప్తగిరి కాలనీలో మూడు గోడౌన్‌లను ఏర్పాటు చేసింది.లోకేషన్ సర్వీస్ ద్వారా ఆయా వినియోగదారులకు సమీపంలోని గోడౌన్ నుంచి సరుకులను వారికి చేరవేస్తున్నారు. 75 మంది ప్యాకర్స్, పిక్కర్స్ పని చేస్తున్నారు. క్విక్ కామర్స్ సంస్థల ద్వారా పలువురు నిరుద్యోగ యువతీ యువకులకు ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయి. ఈ వ్యవస్థతో కొన్ని నష్టాలూ ఉన్నాయి. ముందుగా ఆఫర్లు ఇచ్చి కాస్త తక్కువ చార్జీలు వసూలు చేసినా వినియోగదారులకు అలవాటైన తర్వాత పెంచే అవకాశం ఉంది. సాంప్రదాయ దుకాణాల వ్యాపారం దెబ్బతినే అవకాశం ఉంది.