తొమ్మిదేళ్ల క్రితం ప్రతిపాదన
అప్పట్లో కార్యరూపం దాల్చని వైనం
తాజాగా మరోమారు కేంద్రం ప్రకటన
పారిశ్రామిక వర్గాల్లో హర్షాతిరేకం
షీలానగర్‌లో నిర్మిస్తున్న ఆస్పత్రి వద్ద
భూమి కేటాయిస్తే వెసులుబాటుగా ఉంటుందనే అభిప్రాయం
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)
విశాఖపట్నం రాష్ట్ర ఆర్థిక రాజధానిగానే కాకుండా పారిశ్రామిక రాజధానిగా కూడా వర్ధిల్లుతోంది. ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో పెద్ద సంఖ్యలో భారీ పరిశ్రమలు ఉన్నాయి. ఇంకా హైడ్రోజన్ హబ్, ఆర్సెలర్ స్టీల్‌ప్లాంటు, బల్క్ డ్రగ్ పార్క్ వంటివి ఏర్పాటు కాబోతున్నాయి. పరిశ్రమల్లో పనిచేస్తున్న వారి సంఖ్య సుమారుగా ఐదు లక్షలు. భవిష్యత్తులో ఈ సంఖ్య మరింత పెరగనుంది. వారికి ఉపయోగపడేలా విశాఖపట్నంలో మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేస్తామని ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఈఎస్‌ఐసీ) మంగళవారం ప్రకటించింది. దేశవ్యాప్తంగా మొత్తం పది మెడికల్ కాలేజీలు పెడతామని అందులో విశాఖపట్నం కూడా ఉందని వెల్లడించింది. ఈ ప్రకటనతో ఉత్తరాంధ్ర పారిశ్రామికవేత్తలతో పాటు కార్మికులు కూడా హర్షాతిరేకాలు వ్యక్తంచేస్తున్నారు.
పరిశ్రమల్లో పనిచేసే కార్మికులకు ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఈఎస్‌ఐసీ) ద్వారా ఉచిత వైద్య సేవలు అందుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తరువాత విశాఖలో కొత్త ఈఎస్‌ఐసీ ఆస్పత్రి నిర్మాణానికి రూ.384 కోట్లు మంజూరుచేసింది. మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు కేంద్ర మంత్రిగా పనిచేస్తున్న సమయంలో నాటి కేంద్ర కార్మిక శాఖా మంత్రి బండారు దత్తాత్రేయ, నాటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో కలిసి 2016 ఏప్రిల్ 11న షీలానగర్‌లో ఈ ఆస్పత్రి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అప్పుడే మరో ఐదు ఎకరాలు కేటాయిస్తే మెడికల్ కాలేజీ కూడా ఏర్పాటుచేస్తామని దత్తాత్రేయ ప్రకటించారు. కానీ ఎందుకనో మెడికల్ కాలేజీ ప్రతిపాదన పక్కన పడింది. భూ వివాదం వల్ల ఆస్పత్రి పనులు కూడా ప్రారంభం కాలేదు. ఆ తరువాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం కూడా ఈఎస్‌ఐసీ ఆస్పత్రి నిర్మాణంపై పెద్దగా దృష్టి పెట్టలేదు. అడిగినంత భూమీ ఇవ్వలేదు. ఎట్టకేలకు బీజేపీ నాయకులే ఢిల్లీలో మాట్లాడి 2023 ఏప్రిల్ 10న పనులు ప్రారంభింపజేశారు. దీనికి పూర్తి నిధులు మంజూరుచేసి, నిర్మాణ బాధ్యతలను సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ విభాగానికి అప్పగించారు. తొలి దశలో 350 పడకల ఆస్పత్రి, రెండో దశలో 50 పడకలతో సూపర్ స్పెషాల్టీ బ్లాక్ నిర్మించనున్నారు. 2025 అక్టోబరు నాటికి మొదటి దశ పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే పనులు అనుకున్నంత వేగంగా జరగడం లేదు. దీనిపై సరైన సమీక్షలు జరగకపోవడం వల్ల నత్తనడకన సాగుతున్నాయి.
భూమి ఎక్కడ ఇస్తారో…?
కేంద్రం మెడికల్ కళాశాల ప్రకటించినా రాష్ట్ర ప్రభుత్వమే భూమి కేటాయించాలి. షీలానగర్‌లోనే కొత్త ఆస్పత్రి పక్కన భూమి కేటాయిస్తే అనువుగా ఉంటుంది. దూరంగా ఎక్కడ కేటాయించినా ఇబ్బందులు తప్పవు. ఇప్పుడు ఇబ్బడి ముబ్బడిగా ఎక్కడికక్కడే మెడికల్ కాలేజీలు వచ్చినందున, దీనిని కూడా సద్వినియోగం చేసుకునేలా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే భూమి కేటాయించాల్సి ఉంది. వేలాది ఎకరాలను పరిశ్రమలకు కేటాయిస్తున్న నేపథ్యంలో వాటిలో పనిచేసే కార్మికులకు మెడికల్ కళాశాల కూడా అంతే అవసరమనే విషయం గుర్తించాల్సి ఉంది.
Updated Date – Apr 24 , 2025 | 01:31 AM