వివాహ రజతోత్సవంలో విషాదం.. వేదికపై భార్యతో కలిసి డాన్స్ చేస్తుండగా కుప్పకూలిన భర్త..!

Written by RAJU

Published on:

ఉత్తరప్రదేశ్‌లోని బరేలీ జిల్లాలో ఒక షాకింగ్ సంఘటన వెలుగులోకి వచ్చింది. అక్కడ వివాహ వార్షికోత్సవ వేడుక అకస్మాత్తుగా శోకసంద్రంగా మారింది. వసీం – ఫరా అనే జంట 25వ వివాహ వార్షికోత్సవం నగరంలోని ప్రతిష్టాత్మక హోటల్ అయిన ఫహమ్ లాన్‌లో జరుపుకుంటున్నారు. ఈ ప్రత్యేక దినోత్సవాన్ని కుటుంబసభ్యులు, స్నేహితులతో జరుపుకోవడానికి ఒక గ్రాండ్ పార్టీ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా డీజే పాటలకు అనుగుణంగా అతిథులు డాన్స్ చేస్తున్నారు. ఇంతలో వసీం, ఫరా కూడా వేదికపై తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. కానీ ఈ సంతోష క్షణం అకస్మాత్తుగా దుఃఖంగా మారుతుందని ఎవరూ ఊహించలేకపోయారు.

వసీం తన భార్య ఫరాతో కలిసి వేదికపై డాన్స్ చేస్తూ, పాటకు తగ్గట్టుగా ఊగిపోతున్నాడు. అప్పుడు అకస్మాత్తుగా, వసీం హఠాత్తుగా వేదికపై కుప్పకూలిపోయాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు కెమెరాలో రికార్డ్ అయ్యాయి. అతను అకస్మాత్తుగా కిందపడిపోయాడు. కొన్ని సెకన్లలోనే అతని పరిస్థితి విషమంగా మారింది. కుటుంబ సభ్యులు, హోటల్ సిబ్బంది అతన్ని హుటాహుటీన సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. కానీ వైద్యులు అతను అప్పటికే చనిపోయినట్లు ప్రకటించారు.

వసీం ఆకస్మిక మరణంతో ఉత్సహమైన వేడుక వాతావరణం శోకసంద్రంగా మారింది. కొన్ని నిమిషాల క్రితం వేడుకలు చేసుకుంటున్న కుటుంబ సభ్యులు, స్నేహితులు, బంధువులు కన్నీళ్లు పెట్టుకోవాల్సి వచ్చింది. వసీం భార్య ఫరా భర్త మృతిని తట్టుకోలేక కుప్పకూలిపోయింది. వసీం బరేలీలో వ్యాపారవేత్తగా ఉండగా, అతని భార్య ఫరా ఒక ప్రైవేట్ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్నారు. ఈ ప్రత్యేక సందర్భాన్ని చిరస్మరణీయంగా మార్చాలని ఇద్దరూ కోరుకున్నారు. అందుకే వారు తమ వివాహ రజతోత్సవాన్ని ఎంతో ఆర్భాటంగా జరుపుకుంటున్నారు. ఈ పార్టీకి బంధువులు, స్నేహితులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. అంతలోనే వారి ఆనందం అవిరైపోయింది.

ఈ సంఘటన మొత్తం హోటల్‌లో ఏర్పాటు చేసిన CCTV కెమెరాలో రికార్డైంది. అందులో వసీం తన భార్యతో సంతోషంగా డాన్స్ చేస్తున్నట్లు కనిపించింది. కానీ అకస్మాత్తుగా ఆయన అస్వస్థతకు గురై వేదికపై పడిపోయారు. ఈ హృదయ విదారక సంఘటన అందరినీ కలచివేసింది.

పెరుగుతున్న గుండెపోటు కేసులు!

ఇలాంటి సంఘటనలు ఇటీవల ఎక్కువగా వినిపిస్తున్నాయి. దీన్ని బట్టి చూస్తుంటే గుండెపోటు కేసులు పెరుగుతున్నాయని సూచిస్తుంది. ఒత్తిడి, ఆహారం, జీవనశైలి కారణంగా యువతలో గుండెపోటు ప్రమాదం పెరుగుతోందని వైద్యులు అంటున్నారు. డాన్స్ చేస్తూ అధిక ఉత్సాహం సమయంలో, ఎక్కువ అడ్రినలిన్ హార్మోన్ విడుదల అవుతుంది. దీని కారణంగా హృదయ స్పందన అదుపు లేకుండా పోతుంది. ఇది గుండెపోటు ప్రమాదాన్ని పెంచుతుందంటున్నారు వైద్యులు. ఇదే ఇప్పుడు వసీం మరణం అతని కుటుంబంలో విషాదాన్ని నింపింది. వివాహ వార్షికోత్సవం నాడు జరిగిన ఈ ప్రమాదం ఎంత ఊహించనిదంటే, కొన్ని సెకన్ల క్రితం డాన్స్ చేస్తున్న వ్యక్తి ఇక ఈ లోకంలో లేడంటే ఎవరూ నమ్మలేకపోయారు.

ఆకస్మిక గుండెపోటును ఎలా నివారించాలి?

నిపుణుల అభిప్రాయం ప్రకారం, గుండెపోటును నివారించడానికి క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు, సమతుల్య ఆహారం, వ్యాయామం, ఒత్తిడికి దూరంగా ఉండటం అవసరం. ఎవరైనా డాన్స్ చేస్తున్నప్పుడు, పాడుతున్నప్పుడు లేదా ఏదైనా పని చేస్తున్నప్పుడు ఛాతీ నొప్పి, దడ లేదా శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిని అనుభవిస్తే, వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

Subscribe for notification
Verified by MonsterInsights