
శరీరానికి అవసరమైన ముఖ్యమైన పోషకాల్లో విటమిన్ బి12 ఒకటి. ఇది రక్తకణాల ఉత్పత్తికి, నరాల పనితీరుకు, మెదడు ఆరోగ్యానికి అత్యంత అవసరమైన పోషకం. కానీ ఈ విటమిన్ శరీరంలో తక్కువగా ఉంటే అనేక రకాల ఆరోగ్య సమస్యలు చుట్టుముట్టే ప్రమాదం ఉంటుంది. చాలా మందికి ఈ లోపం ఉన్నా గుర్తించలేక పోతుంటారు. అయితే కొన్ని లక్షణాల ద్వారా దీనిని గుర్తించవచ్చు.
బి12 తక్కువగా ఉన్నప్పుడు శరీరంలోని నర వ్యవస్థ బలహీనమవుతుంది. దీంతో చేతులు, కాళ్లు బలహీనంగా అనిపించటం, తిమ్మిర్లు రావడం, సూదితో పొడిచినట్టుగా గుచ్చే భావన కలగడం వంటి ఇబ్బందులు కనిపించవచ్చు. ఇది ముఖ్యంగా నరాలకు అవసరమైన పోషకాహారం లేకపోవడం వల్ల జరుగుతుంది.
విటమిన్ బి12 లోపం మెదడుపై ప్రభావం చూపుతుంది. చిన్న విషయాలు కూడా గుర్తు లేకపోవడం, ఏకాగ్రత కోల్పోవడం వంటి సమస్యలు వస్తాయి. దీర్ఘకాలంగా ఈ లోపం ఉంటే అల్జీమర్స్, డిమెన్షియా వంటి బలహీనతలకు కూడా దారి తీస్తుంది.
విటమిన్ బి12 తక్కువగా ఉన్నప్పుడు శరీరంలోని ఆక్సిజన్ సరఫరా తగ్గుతుంది. దీని ప్రభావం గుండెపై పడుతుంది. గుండె వేగం ఒక్కసారిగా పెరగడం లేదా తగ్గిపోవడం, ఛాతీలో అసౌకర్యం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి సమస్యలు తలెత్తుతాయి.
బి12 లోపంతో ముఖం రంగు మసకబారినట్లుగా మారుతుంది. ఒక్కోసారి పచ్చటి రంగులోనూ కనిపించొచ్చు. ఇది శరీరంలో హిమోగ్లోబిన్ తగ్గడం వల్ల రక్తహీనత ఏర్పడి చర్మం సహజ రంగు కోల్పోవడం వల్ల జరుగుతుంది.
ఇది బి12 లోపానికి చాలా సాధారణ లక్షణం. శరీరానికి శక్తి లేకుండా ఉండటం, పని చేయడానికి ఉత్సాహం లేకపోవడం, చిన్న పని చేసినా అలసట వస్తుండటం అనుభవించవచ్చు.
విటమిన్ బి12 మెదడు ఫంక్షన్ కు అవసరం. ఇది సరిపడా లేకపోతే మూడ్ స్వింగ్స్, డిప్రెషన్, ఆందోళన, చిరాకు వంటి సమస్యలు రావొచ్చు. మనసు నిలకడగా లేకపోతే దాని ప్రభావం జీవన విధానంపై కూడా పడుతుంది.
బి12 తక్కువగా ఉన్నవారికి నోటిలో చిన్న చిన్న పుండ్లు, దద్దుర్లు ఏర్పడతాయి. ఈ సమస్య తినడానికి, మాట్లాడడానికి అసౌకర్యాన్ని కలిగిస్తుంది. నడవడానికి ఇబ్బంది పడటం, శరీర బ్యాలెన్స్ కోల్పోవడం వంటి లక్షణాలు బి12 లోపంతో సంభవిస్తాయి. ఇది ముఖ్యంగా వృద్ధులలో ఎక్కువగా కనిపించే సమస్య.
శాకాహారులు, వృద్ధులు విటమిన్ బి12 లోపానికి ఎక్కువగా గురవుతారు. ఎందుకంటే ఇది ముఖ్యంగా మాంసాహారంలో ఎక్కువగా లభిస్తుంది. శాకాహారులు అయితే బి12 ఉన్న ఆహార పదార్థాలు తీసుకోవడం లేదా అవసరమైన సప్లిమెంట్లు డాక్టర్ సూచనతో తీసుకోవాలి.
బి12 లోపాన్ని గుర్తించి త్వరగా చర్య తీసుకుంటే ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. మంచి పోషకాహారాన్ని తీసుకోవడం, రక్త పరీక్షల ద్వారా స్థాయిలను తెలుసుకోవడం, అవసరమైన మెడికేషన్ తీసుకోవడం ద్వారా ఈ సమస్య నుండి బయట పడవచ్చు.
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)