
ఆచార్య చాణక్యుడు తన జీవితంలో అనేక విలువైన బోధనలు అందించారు. రాజకీయం, ఆర్థిక వ్యవస్థ, వ్యక్తిగత జీవితం ఇలా ప్రతి విషయంలోనూ అతని ఉపదేశాలు ఎంతో లోతైన అర్థాన్ని కలిగి ఉంటాయి. చాణక్య తన నీతి గ్రంథంలో స్త్రీలు తమ వయస్సును, పురుషులు తమ ఆదాయాన్ని చెప్పకూడదు అని చెప్పాడు. ఈ మాటలు వినడానికి సాధారణంగా అనిపించినా దీని వెనుక గొప్ప జీవన సత్యం దాగి ఉంది. స్త్రీల జీవితం ఎక్కువగా కుటుంబానికి అంకితమైనది. ఆమె వ్యక్తిగత జీవితం కన్నా కుటుంబ బాధ్యతలు, తల్లిగా, భార్యగా, కూతురిగా పోషించే పాత్రలే ముఖ్యమైనవి.
కుటుంబానికి అంకితభావం.. ఒక స్త్రీ తన ఆనందాన్ని పక్కన పెట్టి కుటుంబానికి ప్రాధాన్యం ఇస్తుంది. పిల్లలు, భర్త, తల్లిదండ్రుల కోసం కష్టపడుతూ వారి అవసరాలను తీర్చడానికి ముందుంటుంది.
సామాజిక అంచనాలు.. సమాజం చాలా సందర్భాల్లో మహిళల అందాన్ని వారి వయస్సుతో ముడిపెడుతుంది. వయస్సు పెరిగితే మహిళ అందం తగ్గుతుందని భావించే విధానం ఉంది. అందుకే చాలా మంది మహిళలు తమ వయస్సును బయటపెట్టడానికి ఇష్టపడరు.
ఆత్మగౌరవం.. వయస్సు కేవలం ఒక సంఖ్య మాత్రమే. అనుభవం, విజ్ఞానం, ప్రేమ వంటి అంశాల ద్వారానే ఒక మహిళ తన గొప్పదనాన్ని నిరూపించుకోవాలి.
పురుషుడు సంపాదనతో తన బాధ్యతను నెరవేర్చుతాడు. కుటుంబాన్ని పోషించడం అతని ప్రధాన లక్ష్యం. కానీ తన ఆదాయాన్ని బయటపెట్టడం వల్ల కొన్ని సమస్యలు తలెత్తుతాయి.
కుటుంబ బాధ్యతలు.. ఒక పురుషుడు సంపాదన తన అవసరాల కోసమే కాదు.. కుటుంబ అవసరాల కోసమూ కృషి చేస్తాడు. తన కుటుంబాన్ని నిలబెట్టేందుకు ఎన్నో త్యాగాలు చేస్తాడు.
సామాజిక ఒత్తిడి.. ఆదాయం గురించి ఎక్కువగా మాట్లాడటం వల్ల ఇతరులతో పోలికలు ప్రారంభమవుతాయి. తక్కువ సంపాదిస్తే హీన భావన కలుగుతుంది, ఎక్కువ సంపాదిస్తే అసూయ తలెత్తుతుంది. ఇది అనవసరమైన ఒత్తిడిని కలిగించవచ్చు.
వ్యక్తిగత గౌరవం.. తన స్థితిగతుల గురించి ఎక్కువగా మాట్లాడటం వల్ల కొన్నిసార్లు అనవసరమైన సమస్యలు వస్తాయి. తాను ఎంత సంపాదిస్తున్నాడో చెప్పడం వల్ల అసలు అవసరం లేకుండా కొన్ని అపార్థాలు, అభిప్రాయ భేదాలు రావచ్చు.
చాణక్యుడు చెప్పిన ఈ నీతి లోతైన అర్థాన్ని కలిగి ఉంది. స్త్రీ తన కుటుంబాన్ని ముందుకు నడిపించేందుకు తన వ్యక్తిగత విషయాలను వెనక్కి నెట్టేస్తుంది. పురుషుడు తన కుటుంబ భద్రత కోసం కష్టపడతాడు. కాబట్టి వారిద్దరి వ్యక్తిగత విషయాలను బయటపెట్టడం వల్ల సమాజంలో అనవసరమైన సమస్యలు తలెత్తుతాయి.
మనమంతా ఇతరుల వ్యక్తిగత విషయాల్లో ఆసక్తి చూపించకుండా వారి త్యాగాన్ని గౌరవించాలి. ప్రతి వ్యక్తి జీవిత ప్రయాణం భిన్నంగా ఉంటుంది. అందరూ ఒకే విధంగా ఉండాలని కోరుకోవడం అన్యాయం. ప్రతి ఒక్కరి జీవితాన్ని గౌరవిస్తూ వారి మనోభావాలను అర్థం చేసుకోవడం ద్వారా ఆరోగ్యమైన సమాజాన్ని నిర్మించుకోవచ్చు.
చాణక్య నీతి మనకు నిజమైన విలువలను నేర్పిస్తుంది. మనం ఇతరులను గౌరవించడాన్ని అలవాటు చేసుకుంటే.. మన జీవితం మరింత సంతోషంగా మారుతుంది.