
Protests against waqf amendment act: వక్ఫ్ బిల్లుకు కేంద్రం ఆమోదం చెప్పడంపై కొన్ని ప్రాంతాల్లో ముస్లింలలో ఆగ్రహావేశాలు పెల్లుబుకుతున్నాయి. ఇప్పటికే అల్లర్లతో అట్టుడుకుతున్న మణిపూర్ లో ఆ పరిస్థితి మరింత ఎక్కువగా కనిపిస్తోంది. తౌబల్ జిల్లా లిలోంగ్ లో నిన్న ఆదివారం రాత్రి బీజేపి ఎంపీ, ఆ రాష్ట్ర బీజేపి ముస్లిం మైనార్టీ సెల్ అధ్యక్షుడు అస్కర్ అలీ ఇంటిపై దాడిచేసిన కొంతమంది వ్యక్తులు ఆయన ఇంటికి నిప్పుపెట్టారు. కేంద్రం తీసుకొచ్చిన వక్ఫ్ సవరణల బిల్లు వల్ల ముస్లింలకు మేలు జరుగుతుంది అని ఆయన బహిరంగ వ్యాఖ్యలు చేసిన తరువాతే ఈ దాడి జరిగింది.
దాడి అనంతరం ఈ ఘటనపై సోషల్ మీడియా ద్వారా మరో వీడియో షేర్ చేసిన అస్కర్ అలీ, తను వక్ఫ్ సవరణల బిల్లుకు మద్దతు ఉపసంహరించుకుంటున్నాను అని ప్రకటించినట్లు తెలుస్తోంది.
బీజేపి ఎంపీ అస్కర్ అలీ ఇంటిపై దాడి చేసి నిప్పంటించిన ఘటనపై తౌబల్ జిల్లా అధికార యంత్రాంగం తీవ్రంగా పరిగణించింది. జిల్లాలో శాంతి భద్రతల దృష్ట్యా కర్ఫ్యూ ఆంక్షలు విధిస్తూ జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీచేశారు. ఐదుగురు కంటే ఎక్కువ ఎక్కడా గుమికూడరాదని, మారణాయుధాలు, కర్రలు, రాళ్లు పట్టుకుని తిరగరాదని ఆంక్షలు విధించారు.
ఆందోళనకారులు అస్కల్ అలీ ఇల్లు తగులబెట్టడంపై లిలోంగ్ పోలీసులు స్పందించారు. ఆదివారం రాత్రి 9 గంటల సమయంలో 7000 నుండి 8000 మంది ఆందోళనకారులు ఎంపీ ఇంటిని చుట్టుముట్టి ఈ దాడికి పాల్పడినట్లు లిలోంగ్ పోలీసులు తెలిపారు.