వైసీపీ హయాంలో జరిగిన లిక్కర్ స్కామ్ కేసులో రాజ్యసభ మాజీ సభ్యుడు విజయ సాయిరెడ్డి ని సిట్ విచారణకు పిలిచిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే విచారణకు హాజరైన విజయసాయిరెడ్డిని సిట్ దాదాపు 3 గంటల పాటు విచారణ జరిపింది. విచారణ తర్వాత మీడియాతో మాట్లాడిన విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. లిక్కర్ కు సంబంధించిన రెండు సమావేశాలు ఎక్కడ జరిగాయి, ఏం చర్చించారు, ఎవరెవరు పాల్గొన్నారని అడిగారని విజయసాయి తెలిపారు.
హైదరాబాద్ లో, విజయవాడలో జరిగిన సమావేశాల్లో లిక్కర్ పాలసీపై చర్చించామని, వాసుదేవరెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డి, సత్య ప్రసాద్, సజ్జల శ్రీధర్ పాల్గొన్నారని చెప్పానని వెల్లడించారు. కిక్ బ్యాక్స్ గురించి తనకు తెలియదని చెప్పానని, అదాన్ డిస్టిలరీకి రూ. 60 కోట్లు, డీకార్ట్ కంపెనీకి రూ. 40 కోట్లు ఆరబిందో కంపెనీ నుండి 12 శాతం వడ్డీతో రుణం ఇప్పించానని… నిధుల వినియోగం గురించి తనకు తెలియదని అన్నారు. ఆ ఫండ్స్ ఎలా వాడుకున్నారు, ఎలా రీఫండ్ చేశారనే విషయం రాజ్ కసిరెడ్డి మాత్రమే చెప్పగలరని వెల్లడించారు.
మద్యం అమ్మకాల విషయంలో తాను ఎప్పుడూ జోక్యం చేసుకోలేదని, రాజ్ కసిరెడ్డి వసూలు చేసిన డబ్బులు ఎవరికి వెళ్లాయో తనకు తెలియదని అన్నారు. అన్ని ప్రశ్నలకు రాజ్ కసిరెడ్డే సరైన సమాధానాలు చెబుతారని తెలిపారు. రాజ్ కసిరెడ్డిది క్రిమినల్ మైండ్ అని తనకు తెలీదని షాకింగ్ వ్యాఖ్యలు చేశారు. రాజ్ కసిరెడ్డిని సిట్ అధికారులు ప్రశ్నిస్తే అన్ని వివరాలు బయటకు వస్తాయని, విచారణకు మళ్లీ ఎప్పుడు పిలిచినా వస్తానని అధికారులతో చెప్పానని తెలిపారు. లిక్కర్ స్కామ్ లో బిగ్ బాస్ ఎవరనేది రాజ్ కసిరెడ్డినే అడగాలని విజయసాయి చెప్పారు. ప్రజలు ఎప్పుడు కోరుకుంటే అప్పుడు రాజకీయాల్లోకి వస్తానని అన్నారు.
The post లిక్కర్ స్కాం..రాజ్ కసిరెడ్డిపై సాయిరెడ్డి షాకింగ్ ఆరోపణలు first appeared on namasteandhra.