– లక్ష్యం రూ. 15.98 కోట్లు.. ఆదాయం రూ. 20.69 కోట్లు
– జిల్లాలో 29.47 శాతం అధికం
– మెజార్టీ మార్కెట్ కమిటీల్లో వంద శాతానికి మించి వసూళ్లు
జగిత్యాల, మార్చి 21 (ఆంధ్రజ్యోతి): జిల్లాలోని పలు వ్యవసాయ మార్కెట్ యార్డులు లక్ష్యానికి మించి ఆదాయం సాధించాయి. 2024-25 ఆర్థిక సంవత్సరానికి గానూ మార్కెట్ యార్డుల వారీగా ఉన్నతాధికారులు నిర్ధేశించిన టార్గెట్లకు మించి ఆదాయం రాబట్టారు. జిల్లాలో గల మార్కెట్ కమిటీల్లో మెజార్టీ కమిటీలు ఆదాయ లక్ష్యాన్ని అదిగమించాయి. పంట ఉత్పత్తుల కొనుగోళ్లు నుంచి ఒక శాతం సెస్ వసూళ్ల ద్వారా కమిటీలకు ప్రధానంగా ఆదాయం సమకూరుతుంది. జిల్లాలో పదమూడు మార్కెట్ కమిటీల ద్వారా రూ. 15.98 కోట్లు ఆదాయం సాధించడం లక్ష్యం కాగా రూ. 20.69 కోట్లు ఆదాయాన్ని సాధించారు.
– జిల్లాలో 13 వ్యవసాయ కమిటీలు..
జిల్లాలోని పలు ప్రాంతాల్లో 13 వ్యవసాయ మార్కెట్ కమిటీలు, ఒకటి ఉపమార్కెట్ కమిటీలున్నాయి. జిల్లాలోని జగిత్యాల, మెట్‌పల్లి, కోరుట్ల, గొల్లపల్లి, ధర్మపురి, మల్యాల, కథలాపూర్, మేడిపల్లి, మల్లాపూర్, ఇబ్రహీంపట్నం, పెగడపల్లి, వెల్గటూరు, రాయికల్‌లో వ్యవసాయ మార్కెట్ కమిటీలు పనిచేస్తున్నాయి. వీటితో పాటు జిల్లాలో వెల్గటూరు మండలం చెప్యాల్‌లో ఉప మార్కెట్ కమిటీ పనిచేస్తోంది. వ్యవసాయ మార్కెట్ కమిటీల్లో రైతులకు, వర్తకులకు కావాల్సిన సౌకర్యాలు కల్పించి సేవలు అందిస్తున్నందుకు గానూ ప్రకటిత వ్యవసాయ ఉత్పత్తులపై ఒక శాతం మార్కెట్ ఫీజును కొనుగోలుదారుల నుంచి వసూలు చేస్తున్నారు. జిల్లాలోని వ్యవసాయ మార్కెట్ యార్డుల్లో 29,550 మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల 23 గోదాములు ఏర్పాటు చేశారు. నాబార్డు కింద జిల్లాలోని పలు ప్రాంతాల్లో 52,500 మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల 14 అధునాతన గోదాములు నిర్మించి రైతులకు సేవలు అందిస్తున్నారు. జిల్లాలోని జగిత్యాల, మెట్‌పల్లి, గొల్లపల్లి మార్కెట్ యార్డుల్లో జాతీయ వ్యవసాయ మార్కెట్ (ఈ-నామ్) విధానాన్ని అమలు చేస్తున్నారు.
– అత్యధికం ధర్మపురి, అత్యల్పం ఇబ్రహీంపట్నం..
జిల్లాలో 2023-24 ఆర్థిక సంవత్సరానికి గానూ అత్యధికంగా ధర్మపురి వ్యవసాయ మార్కెట్ కమిటీ రూ. 4.86 కోట్ల ఆదాయం సాధించగా, అత్యల్పంగా ఇబ్రహీపట్నం వ్యవసాయ మార్కెట్ కమిటీ రూ. 0.83 కోట్ల ఆదాయాన్ని సాధించాయి. జగిత్యాల మార్కెట్ కమిటీ 2.61 కోట్ల లక్ష్యానికి గానూ రూ. 2.79 కోట్లు వసూళ్లు జరపగా, మెట్‌పల్లి ఏఎంసీ రూ. 1.75 కోట్ల లక్ష్యానికి గానూ రూ. 1.31 కోట్లు, కోరుట్ల ఏఎంసీ రూ. 1.47 కోట్ల లక్ష్యానికి గానూ రూ. 1.01 కోట్ల ఆదాయం సమకూరింది. గొల్లపల్లి ఏఎంసీ రూ. 0.88 కోట్ల లక్ష్యానికి గానూ రూ. 0.84 కోట్లు, ధర్మపురి ఏఎంసీ రూ. 1.81 కోట్ల లక్ష్యానికి గానూ రూ. 4.86 కోట్లు, మల్యాల ఏఎంసీ రూ. 1.62 కోట్ల లక్ష్యానికి గానూ రూ. 3.56 కోట్లు, కథలాపూర్ ఏఎంసీ రూ. 1.05 కోట్ల లక్ష్యానికి గానూ రూ. 1.25 కోట్లు ఆదాయం సాదించాయి. మేడిపల్లి ఏఎంసీ రూ. 0.93 కోట్ల లక్ష్యానికి గానూ రూ. 1.16 కోట్లు, మల్లాపూర్ ఏఎంసీ రూ. 0.79 కోట్ల లక్ష్యానికి గానూ రూ. 0.83 కోట్లు, ఇబ్రహీంపట్నం ఏఎంసీ రూ. 46.22 లక్షలు లక్ష్యానికి గానూ రూ. 34.29 లక్షలు, పెగడపల్లి ఏఎంసీ రూ. 75.73 లక్షల లక్ష్యానికి గానూ రూ. 84.62 లక్షలు, వెల్గటూరు ఏఎంసీ రూ. 1.12 కోట్ల లక్ష్యానికి గానూ రూ. 1.12 కోట్లు, రాయికల్ ఏఎంసీ రూ. 69.62 లక్షల లక్ష్యానికి గానూ రూ. 72.27 లక్షల లక్ష్యాన్ని చేజిక్కించుకున్నాయి. జిల్లాలో కేవలం మెట్‌పల్లి, కోరుట్ల, గొల్లపల్లి, ఇబ్రహీంపట్నం వ్యవసాయ మార్కెట్ కమిటీలు లక్ష్యాన్ని సాధించలేకపోయాయి.
– ఆదాయం సమకూరుతుందిలా…
మార్కెట్ యార్డులకు రైతులు తీసుకువచ్చిన పంట ఉత్పత్తులను వ్యాపారులు కొనుగోలు చేస్తారు. వ్యాపారుల చేపట్టే లావాదేవీల ఆధారంగా మార్కెట్ యార్డుకు సెస్ చెల్లిస్తారు. మార్కెట్ ఫీజు చెల్లింపు ప్రధాన ఆదాయ వనరుగా ఉంటోంది. దీంతో పాటు పంట ఉత్పత్తులను కొనుగోలు చేసే రైస్ మిల్లులు, ఆయిల్ మిల్లులు, జిన్నింగ్ మిల్లులు, ఇతర ఏజన్సీలు సైతం సెస్ చెల్లించాల్సి ఉంటుంది. పంట ఉత్పత్తులను ఇతర ప్రాంతాలకు తరలించేటప్పుడు చెక్ పోస్టుల వద్ద సంబంధిత యార్డులకు సెస్ చెల్లించాలి. ప్రభుత్వం తరఫున ఎఫ్‌సీఐ, సీసీఐ, ఐకేపీ, సింగిల్ విండోలు, మార్క్‌ఫెడ్, నాఫెడ్ తదితర సంస్థలు యార్డుల్లో పంట ఉత్పత్తులకు మద్దతు ధర చెల్లిస్తూ కొనుగోలు చేస్తుంటాయి. సంబంధిత సంస్థలు సైతం వ్యవసాయ మార్కెట్ కమిటీలకు సెస్ చెల్లించాల్సి ఉంటుంది. వ్యవసాయ మార్కెట్ కమిటీ పరిధిలో జరుపుతున్న పంట ఉత్పత్తుల క్రయవిక్రయాలపై ఫీజును వసూలు చేస్తూ ఆదాయం సమకూర్చుకుంటున్నాయి.
– మెట్‌పల్లి పసుపు.. జగిత్యాల మామిడి
జిల్లాలోని మార్కెట్ యార్డుల్లో వివిధ పంట ఉత్పత్తులు విక్రయానికి వస్తుంటాయి. ఇందులో మెట్‌పల్లి మార్కెట్ యార్డు పసుపుతి పంటకు పేరెన్నిక కలిగింది. జగిత్యాలలో మామిడి, వెల్గటూరులో పత్తి, ఇబ్రహీంపట్నంలో కందులు, వివిధ మార్కెట్ యార్డుల్లో వరి ధాన్యం, మొక్కజొన్న తదితర పంట ఉత్పత్తులు విక్రయానికి వస్తుంటాయి. వీటి క్రయవిక్రయాల ద్వారా మార్కెట్ కమిటీలు ఆదాయాన్ని సాధిస్తుంటాయి.
లక్ష్యం అధిగమించాం..
– ప్రకాశ్, జిల్లా మార్కెటింగ్ అధికారి
జిల్లాలో వ్యవసాయ మార్కెట్ కమిటీల్లో ప్రభుత్వం నిర్ధేశించిన లక్ష్యానికి మించి ఆదాయాన్ని సాధించాము. 2024-25 ఆర్థిక సంవత్సరానికి గానూ నిర్ధేశించిన ఆదాయం కంటే అధికంగా ఆదాయం వచ్చింది. కార్యదర్శులు, సిబ్బంది, రైతులు, వ్యాపారుల సమష్టి కృషి ఫలితంగా లక్ష్యానికి మిచి ఆదాయం సాధించాము.
===============================
జిల్లాలో సంవత్సరం వారీగా ఆదాయం
సంవత్సరం ఆదాయం
2019-20 రూ.11.66 కోట్లు
2020-21 రూ. 29.91 కోట్లు
2021-22 రూ. 18.05 కోట్లు
2022-23 రూ. 26.22 కోట్లు
2023-24 రూ. 29.70 కోట్లు
2024-25 రూ. 20.69 కోట్లు
==========================
మార్కెట్ కమిటీలు సాధించిన ఆదాయ శాతం…
మార్కెట్ కమిటీ ఆదాయం(శాతాల్లో)
జగిత్యాల 106.71 శాతం
మెట్‌పల్లి 74.90 శాతం
కోరుట్ల 68.80 శాతం
గొల్లపల్లి 95.86 శాతం
ధర్మపురి 267.45 శాతం
మల్యాల 220.14 శాతం
కథలాపూర్ 119.76 శాతం
మేడిపల్లి 124.37 శాతం
మల్లాపూర్ 105.01 శాతం
ఇబ్రహీంపట్నం 74.19 శాతం
పెగడపల్లి 111.74 శాతం
వెల్గటూరు 100.52 శాతం
రాయికల్ 103.81 శాతం
===========================
మొత్తం 129.47 శాతం
==========================