రోడ్డు ప్రమాదంలో స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ దుర్మరణం

Written by RAJU

Published on:

రోడ్డు ప్రమాదంలో స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ దుర్మరణం– సిఎం చంద్రబాబు సంతాపం
పీలేరు : అన్నమయ్య జిల్లా రాయచోటి నియోజకవర్గ పరిధిలోని సంబేపల్లెలో జరిగిన రోడ్డు ప్రమాదంలో పీలేరు హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్‌ స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ ఎస్‌.రమ మృతి చెందారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించారు. రమ మృతికి సంతాపం తెలిపారు. పోలీసుల కథనం ప్రకారం…. అన్నమయ్య జిల్లా కలెక్టరేట్‌లో నిర్వహించే పిజిఆర్‌ఎస్‌ కార్యక్రమంలో స్పెషల్‌ కో-ఆర్డినేటర్‌గా విధులకు హాజరయ్యేందుకు పీలేరు నుంచి రాయచోటికి కారులో తన ఇద్దరు సిబ్బందితో రమ సోమవారం బయలుదేరారు. మార్గమధ్యలోని సంబేపల్లె సమీపంలో ఎదురుగా వచ్చిన మరో కారు వీరి కారును ఢకొీంది. దీంతో, రమ అక్కడికక్కడే మృతి చెందారు. అటెండర్‌ నాయక్‌, కంప్యూటర్‌ ఆపరేటర్‌ ముబారక్‌ తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ముబారక్‌ పరిస్థితి విషమంగా ఉండడంతో కడప రిమ్స్‌ ఆస్పత్రికి తరలించారు. అనంతపురం జిల్లాకు చెందిన రమ గత ఏడాది ఫిబ్రవరి ఐదున పీలేరు హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్‌ కార్యాలయానికి స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌గా కర్నూలు నుంచి బదిలీపై వచ్చారు. ఎస్‌డిసి పీలేరు నియోజకవర్గం ఓటర్‌ నమోదు అధికారిగా కూడా ఆమె వ్యవహరిస్తున్నారు. ప్రమాద సమాచారం తెలుసుకున్న పీలేరు తహశీల్దారు భీమేశ్వరరావు, హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్‌ కార్యాలయం సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. రోడ్డు ప్రమాదంలో రమ మృతి చెందడం దురదృష్టకరమని ముఖ్యమంత్రి చంద్ర బాబు పేర్కొన్నారు. ఆమె కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు.
మంత్రి రాంప్రసాద్‌రెడ్డి నివాళి
రాయచోటి ప్రభుత్వాస్పత్రిలోని మార్చురీలో ఉంచిన రమ భౌతికకాయాన్ని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్‌రెడ్డి, కలెక్టర్‌ శ్రీధర్‌ చామకూరి సందర్శించి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రమాద వివరాలను పోలీసులను అడిగి తెలుసుకున్నారు. ప్రమాదంలో గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఇరువురిని కూడా వారు పరామర్శించారు. రమ కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని మంత్రి రాంప్రసాద్‌రెడ్డి హామీ ఇచ్చారు. రమా మృతికి అన్నమయ్య జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి బిసి జనార్థన్‌రెడ్డి ఒక ప్రకటనతో సంతాపం తెలిపారు ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

Subscribe for notification
Verified by MonsterInsights