రైతులను ఆదుకుంటాం: సీఎం | CM Chandrababu Assures Assist for Farmers Affected by Premature Rains and Crop Losses

Written by RAJU

Published on:


ABN
, Publish Date – Mar 24 , 2025 | 03:24 AM

బాధిత రైతులకు ప్రభుత్వ పరంగా సాయం అందించాలని అధికారులను ఆదేశించారు. పంట నష్టంపై ఆదివారం రాత్రి సీఎం సమీక్షించారు.

రైతులను ఆదుకుంటాం: సీఎం

అమరావతి, మార్చి 23(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో వడగళ్లతో కూడిన అకాల వర్షాలకు పంట నష్టపోయిన రైతులను ఆదుకుంటామని, రైతులెవరూ ఆందోళన చెందవద్దని సీఎం చంద్రబాబు భరోసా ఇచ్చారు. బాధిత రైతులకు ప్రభుత్వ పరంగా సాయం అందించాలని అధికారులను ఆదేశించారు. పంట నష్టంపై ఆదివారం రాత్రి సీఎం సమీక్షించారు. అనంతపురం జిల్లా యల్లనూరు మండలం వీర్జంపల్లిలో ఇద్దరు అరటి రైతుల ఆత్మహత్యాయత్నంపై మంత్రి అచ్చెన్నాయుడు, జిల్లా కలెక్టర్‌, వ్యవసాయ అధికారులతో సీఎం మాట్లాడారు. ప్రస్తుతం ఇద్దరు రైతుల పరిస్థితి కాస్త మెరుగ్గా ఉందని, ప్రాణాపాయం తప్పిందని అధికారులు సీఎంకు చెప్పారు. మెరుగైన వైద్యం కోసం అనంతపురం తరలిస్తున్నట్లు వివరించారు. వడగళ్ల వానతో పాటు ఈదురు గాలుల కారణంగా కడప, అనంతపురం, శ్రీసత్యసాయి, ప్రకాశం జిల్లాల్లో 10 మండలాల్లోని 40 గ్రామాల్లో పంట నష్టం జరిగినట్లు ఉద్యాన శాఖ డైరెక్టర్‌ శ్రీనివాసులు సీఎంకు తెలిపారు. మొత్తం 1,364 మంది రైతులకు చెందిన 1,670 హెక్టార్లలో ఉద్యాన పంటలకు నష్టం వాటిల్లినట్లు క్షేత్రస్థాయి సందర్శనలో గుర్తించినట్లు తెలిపారు. అనంతపురం జిల్లాలో రెండు మండలాల్లో 47 మంది రైతులకు చెందిన 35హెక్టార్లలో మొక్కజొన్న గాలుల వల్ల దెబ్బతిన్నట్లు వ్యవసాయశాఖ డైరెక్టర్‌ డిల్లీరావు తెలిపారు.

27న పోలవరానికి సీఎం

ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ నెల 27న పోలవరం ప్రాజెక్టును సందర్శించనున్నారు. ఇప్పటి వరకు జరిగిన, జరుగుతున్న, పెండింగ్‌లో ఉన్న పనులపై సమీక్షిస్తారు. 25, 26వ తేదీల్లో కలెక్టర్ల సమావేశం పూర్తి చేసుకుని.. మర్నాడే పోలవరం వస్తుండడం గమనార్హం.

Updated Date – Mar 24 , 2025 | 03:26 AM

Google News

Subscribe for notification