రైతులకు ఏ కష్టం రాకుండా చూస్తాం

Written by RAJU

Published on:

– ధాన్యాన్ని దళారులకు అమ్ముకోవద్దు

– కాంగ్రెస్‌ ప్రభుత్వం రైతు ప్రభుత్వం

– బీసీ సంక్షేమ, రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌

సైదాపూర్‌, ఏప్రిల్‌ 16(ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్‌ ప్రభుత్వం రైతు ప్రభుత్వమని, రైతులకు ఏ కష్టం రాకుండా చూస్తామని రాష్ట్ర బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ అన్నారు. బుధవారం మంత్రి సైదాపూర్‌ మండలంలో ఐకేపీ ద్వారా నిర్వహించే సోమారం వరి ధాన్యం కొనుగోలు కేంద్రం, వెన్కేపల్లి విశాల సహకార పరపతి సంఘం ద్వారా నిర్వహించే సైదాపూర్‌ వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను అడిషనల్‌ కలెక్టర్‌ లక్ష్మికిరణ్‌తో కలిసి ప్రారంభించారు. అనంతరం లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్‌ మాట్లాడుతూ ఎక్కడైనా ధాన్యం కొనుగోలు కేంద్రం అవసరముంటే మంజూరు చేయిస్తామన్నారు. రైతులు ధాన్యాన్ని దళారులకు అమ్ముకొని మోసపోవద్దన్నారు. ఇప్పుడు కూడా సన్న వడ్లకు రూ. 500ల బోనస్‌ ఇస్తున్నామని, గతంలో ఎవరికైనా సన్నవడ్ల బోనస్‌ రాకపోతే అడిషనల్‌ కలెక్టర్‌ దృష్టికి తీసుకరావాలన్నారు. తెలంగాణ ప్రభుత్వం దేశంలో ఎక్కడ లేని విధంగా పేద ప్రజలకు సన్న బియ్యం పంపిణీ చేస్తుందన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాలలో సన్న బియ్యం ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నిం చారు. రైతులకు సమస్యలు రాకుండా ధరణి స్థానంలో భూభారతి తీసుకవచ్చామన్నారు. ఎస్సీ వర్గీకరణపై చరిత్రాత్మక నిర్ణయం తీసుకున్నామని, దేశంలోనే మొదటి సారి చట్టం తెచ్చామన్నారు. బీసీ కుల గణన చేశామని, రిజర్వేషన్ల పంపునకు చట్టం తెచ్చామని పేర్కొన్నారు. ఇందిరమ్మ ఇళ్ల ఎంపిక పారదర్శకంగా జరుగుతుందని, ఇందులో రాజకీయ జోక్యం ఉండదని తెలిపారు. మంచి నీటి కొరత ఉంటే తమ దృష్టికి తీసుకరావాలన్నారు. అధికారులు అప్రమత్తంగా ఉండాలని గ్రామాలలో నీటి కొరత లేకుండా చర్యలు తీసుకో వాలని ఆదేశాలు జారీ చేశారు. కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ దొంత సుధాకర్‌, వెన్కేపల్లి విశాల సహకార పరపతి సంఘం అధ్యక్షుడు కొత్త తిరుపతిరెడ్డి, ఆర్డీవో రమేష్‌, తహసీల్దార్‌ మంజుల, కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు గుండారపు శ్రీనివాస్‌, మహిళలు, రైతులు, కాంగ్రెస్‌ నాయకులు పాల్గొన్నారు.

Leave a Comment

Subscribe for notification
Verified by MonsterInsights