– వచ్చే నెల నుంచి సన్న బియ్యం పంపిణీ
– జిల్లాలో 2.19 లక్షల కుటుంబాలకు ప్రయోజనం
– 3,200 మెట్రిక్ టన్నుల బియ్యం కోటా కేటాయింపు
(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)
రేషన్ వినియోగదారులకు రాష్ట్ర ప్రభుత్వం ఉగాది కానుకగా రేషన్ షాపుల ద్వారా సన్న బియ్యం పంపిణీ చేసేందుకు శ్రీకారం చుడుతోంది. ఈ నెల 30 ఉగాది పండుగ రోజున సుర్యాపేట జిల్లా మటంపల్లి గ్రామంలో ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ఆ తర్వాత ఏప్రిల్ ఒకటవ తేదీ నుంచి అన్ని రేషన్ షాపుల ద్వారా సన్న బియ్యం పంపిణీ చేయనున్నారు. అందులో భాగంగా జిల్లాలోని 2,19,637 రేషన్ కార్డులు కలిగిన కుటుంబాలకు 6 కిలోల చొప్పున 3,200 మెట్రిక్ టన్నుల సన్న బియ్యాన్ని ప్రభుత్వం కేటాయించింది. ఈ నెలా ఖరు వరకు జిల్లాలోని పెద్దపల్లి, సుల్తానాబాద్, మంథ నిలో గల పౌరసరఫరాల శాఖ ఎంఎల్‌ఎస్ పాయింట్ల నుంచి అన్ని రేషన్ షాపులకు సన్న బియ్యం సరఫరా చేయనున్నారు.
ఫ పక్క దారి పడుతున్న దొడ్డు బియ్యం
రేషన్ షాపుల ద్వారా ఇస్తున్న దొడ్డు రకం బియ్యం చాలా వరకు పక్కదారి పడుతున్నాయి. ఆ బియ్యాన్ని కేవలం 40 శాతం మంది ప్రజలే తింటుండగా, మిగతా వినియోగదారులు రేషన్ డీలర్లకు 10 నుంచి 12 రూపా యలకు కిలో చొప్పున విక్రయిస్తున్నారు. మరికొందరు వ్యాపారులు, సంచార జాతులకు చెందిన వారికి కిలో 12 నుంచి 15 రూపాయలకు విక్రయిస్తున్నారు. ఈ బియ్యం అటు, ఇటు తిరిగి రీసైక్లింగ్ అయి రేషన్ షాపు లకే చేరుకుంటున్నాయి. మరికొంత మంది పెద్ద ఎత్తున మహారాష్ట్ర, ఇతర రాష్ర్టాలకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. రేషన్ బియ్యం పక్కదారి పట్టకుండా సంబంధిత శాఖాధికారులు ఎన్ని కేసులు పెట్టినా, ఎంత నిఘా పెట్టినా అక్రమ దందాకు అడ్డుకట్ట పడ లేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల కడుపు నింపేందుకు కోట్ల రూపాయలు వెచ్చించి బలవర్థకమైన ఫోర్టిఫైడ్ రైస్ ఇచ్చినా వాటిని తినేందుకు మెజారిటీ ప్రజలు ఇష్ట పడడం లేదు. సన్న బియ్యం ఇస్తేనే అందరు వినియోగదారులు సద్వినియోగం చేసుకుంటారని భావించిన కాంగ్రెస్ పార్టీ రేషన్ షాపుల ద్వారా సన్న బియ్యం ఇస్తామని ప్రకటించింది. ఆ మేరకు వచ్చే నెల నుంచి శ్రీకారం చుడుతున్నది.
ఫ నెరవేరనున్న ఎన్నికల హామీ
ఏడాది క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా రేషన్ షాపుల ద్వారా సన్నబియ్యం ఇస్తామని హామీ ఇవ్వడమే గాకుండా మేనిఫెస్టోలో కూడా పేర్కొన్నారు. ఆ మేరకు ప్రభుత్వం సన్న బియ్యం సేకరించేందుకు రాష్ట్రంలో గడిచిన వానా కాలం సీజన్‌లో సన్న రకం వరి ధాన్యం సాగును ప్రభుత్వం ప్రోత్సహించింది. సన్న రకం వరి పంటను పండించే రైతులకు క్వింటాలు ధాన్యానికి 500 రూపాయల బోనస్ ఇస్తామని ప్రకటించింది. దీంతో జిల్లాలో 80 శాతం వరకు సన్న రకం వరి పంటనే రైతులు సాగు చేశారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా కూడా 40 శాతం వరకు సన్న రకం వరి పంటనే రైతులు సాగు చే,శారు. జిల్లాలో 2 లక్షల 40 వేల మెట్రిక్ టన్నుల సన్న రకం ధాన్యాన్ని సేకరించారు. డిసెంబర్ నెలాఖరు వరకే కొనుగోళ్లు పూర్తయినప్పటికీ, ఆ వెంటనే మర ఆడించిన బియ్యం పంపిణీ చేయలేదు. అవి కొత్త బియ్యం కావడంతో అన్నం మెత్తగా అవు తుందని జనవరి నెలలో సన్న బియ్యం పంపిణీని నిలిపివేశారు. మూడు మాసాల పాటు బియ్యం మగ్గిన తర్వాత ఉగాది కానుకగా సన్న బియ్యం పంపిణీని ఆరంభిస్తున్నారు. మెజారిటీ వినియోగదారులు తప్పని సరిగా సన్న బియ్యం తీసుకవెళ్లి సద్వినియోగం చేసుకునే అవకాశాలున్నాయి. సన్న బియ్యం పంపిణీతో అక్రమ వ్యాపారులకు అడ్డుకట్ట పడనున్నది.