అసెంబ్లీ సమావేశాలకు మాజీ సీఎం కేసీఆర్ రావడం లేదని సీఎం రేవంత్ రెడ్డి పదే పదే విమర్శలు గుప్పిస్తోన్న సంగతి తెలిసిందే. ఓటమి తర్వాత కేసీఆర్ ఫాం హౌస్ కే పరిమితమయ్యారని రేవంత్ పలుమార్లు విమర్శించారు. ఈ క్రమంలో రేవంత్ లో సభలో ఢీ అంటే ఢీ అనేందుకు కేసీఆర్ సిద్ధమయ్యారు. అసెంబ్లీలో అమీతుమీ తేల్చుకునేందుకు రెడీ అయ్యారు. త్వరలో జరగబోయే అసెంబ్లీ సమావేశాల్లో తాను పాల్గొని ప్రభుత్వ తీరును ఎండగడతానని స్వయంగా కేసీఆర్ చెప్పారు.
కాంగ్రెస్ కు చాలా సమయమిచ్చామని, హామీలను నెరవేరుస్తారని ఓపికగా ఎదురుచూశామని అన్నారు. కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం హామీలను నెరవేర్చకుండా రైతులు, ప్రజలను ఇబ్బంది పెడుతోందని, అసత్య ప్రచారాలతో టైం పాస్ చేస్తోందని ఆరోపించారు. కాంగ్రెస్ అసమర్థ పాలనతో ప్రజలు విసిగిపోయారని విమర్శించారు. తెలంగాణ సమాజానికి బీఆర్ఎస్ రక్షణ కవచమని మరోసారి రుజువైందని అన్నారు.

వచ్చే నెలలో జరగబోయే పార్టీ ఆవిర్భావ దినోత్సవం, బీఆర్ఎస్ రజతోత్సవ వేడుకలు, వరంగల్‌లో 10 లక్షల మందితో భారీ బహిరంగ సభ, ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక, రాష్ట్ర, దేశ వర్తమాన రాజకీయ పరిస్థితులపై ఫాం హౌస్ లో బీఆర్ఎస్ నేతలతో కేసీఆర్ చర్చించారు. రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా బీఆర్‌ఎస్ కు బ్రహ్మరథం పట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు.