ఒంటిమిట్ట కోదండరాముడి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా రేపు(ఏప్రిల్ 11 శుక్రవారం) సాయంత్రం రాములోరి కల్యాణ వేడుకగా జరగనుంది. స్వామివారి కల్యాణోత్సవానికి ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు. ముఖ్యమంత్రి చంద్రబాబు దంపతులు స్వామివారికి ముత్యాల తలంబ్రాలు, పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. ఇక సీతారాముల కల్యాణోత్సవాన్ని పండుగ వాతావరణంలో భక్తులందరూ వీక్షించేలా కల్యాణ వేదిక, గ్యాలరీలను సిద్ధం చేశారు. రోడ్లు, బారికేడ్లు, పార్కింగ్, విద్యుత్, ఇతర క్లినింగ్ పనులు ఇప్పటికే పూర్తయ్యాయి. 2 వేల మందికి పైగా పోలీసులతో బందోబస్తును ఏర్పాటు చేస్తున్నారు. రాములోరి కల్యాణానికి భారీ సంఖ్యలో హాజరవుతున్న భక్తులకు.. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదాన్ని అందించేందుకు టీటీడీ ఏర్పాట్లు చేసింది. దాదాపు 300 మంది శ్రీవారి సేవకులు 70 వేల లడ్డూలను ప్యాకింగ్ చేశారు.
ఏటా నవమి రోజు మధ్యాహ్నం నిర్వహించే కల్యాణం తాను చూడలేకపోతున్నానని బాధపడిన చంద్రుడికి శ్రీరాముడు మాటిచ్చాడని.. అందుకే ఒంటిమిట్టలో పున్నమి కాంతుల్లో కల్యాణం జరుగుతుందని కథనం.చంద్రవంశానికి చెందిన విజయనగరరాజులు తమ కులదైవానికి తృప్తి కలిగేలా రాత్రిపూట కల్యాణం జరిపించే ఆచారాన్ని అనుసరిస్తున్నారని మరో కథనం. కారణాలు ఏమైనా ఇతర వైష్ణవ ఆలయాలకు భిన్నంగా ఒంటిమిట్టలో సీతారాముల కల్యాణ వేడుక పున్నమి కాంతుల్లో జరగడం ప్రత్యేకం.
ఇవి కూడా చదవండి
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.