భారత్-జపాన్ ఎకనామిక్ పార్టనర్‌షిప్ రోడ్‌షోలో తెలంగాణ అధికారిక బృందం భారీ ప్రెజెంటేషన్ ఇచ్చింది. టోక్యోలోని హోటల్ ఇంపీరియల్‌లో నిర్వహించిన భారత్-జపాన్ ఎకనామిక్ పార్టనర్‌షిప్ రోడ్‌షోకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని అధికారిక బృందం హాజరైంది. ఈ కార్యక్రమంలో దాదాపు 150 మందికి పైగా పారిశ్రామిక, వ్యాపారవేత్తలు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న విస్తృత అవకాశాలను ఈ వేదికపై సమగ్రంగా వివరించారు. జపాన్ కంపెనీలు పరిశీలించాల్సిన రంగాలపై స్పష్టమైన దృష్టి పెట్టారు.
ఈ రోడ్‌షోలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, “తెలంగాణ దేశంలోనే కొత్త రాష్ట్రం. కానీ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతోంది. జపాన్‌ను ఉదయించే సూర్యుడి దేశం అంటారు. మా ప్రభుత్వ నినాదం ‘తెలంగాణ రైజింగ్’. తెలంగాణ జపాన్‌లో ఉదయిస్తోంది,” అని సీఎం రేవంత్ పేర్కొన్నారు. టోక్యో నగరాన్ని అభివృద్ధిలో ఆదర్శంగా చూసినట్టు వివరించారు. “ఇక్కడి మౌలిక సదుపాయాలు, పర్యావరణ పరిరక్షణ, ఆవిష్కరణలు అద్భుతం. జపాన్ ప్రజలు సౌమ్యులు, మర్యాదస్తులు, క్రమశిక్షణ కలిగినవారు. హైదరాబాద్‌ను అభివృద్ధి చేయడంలో టోక్యో నుంచి చాలా నేర్చుకున్నాను,” అని సీఎం రేవంత్ చెప్పారు.
ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు, నైపుణ్యం గల ప్రతిభ, స్థిరమైన పాలన విధానాలను ప్రజా ప్రభుత్వం అందిస్తుందని వివరించారు. లైఫ్ సైన్సెస్, గ్లోబల్ కెపాబులిటీ సెంటర్లు, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రిక్ వెహికిల్స్, టెక్స్‌టైల్స్, ఏఐ డేటా సెంటర్లు, లాజిస్టిక్స్ వంటి రంగాల్లో పెట్టుబడులకు తెలంగాణ అనుకూలంగా ఉందని చెప్పారు. “భారత్-జపాన్ కలిసి ప్రపంచానికి అద్భుతమైన భవిష్యత్తును నిర్మించాలి” అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.
ఈ సమావేశంలో భారత రాయబారి సిబి జార్జ్ మాట్లాడుతూ భారత్-జపాన్ మధ్య ఆర్థిక సంబంధాలు గతంలో ఎన్నడూ లేని విధంగా బలపడుతున్నాయని అన్నారు. జెట్రో (జపాన్ ఎక్స్‌టర్నల్ ట్రేడ్ ఆర్గనైజేషన్) బెంగళూరు డైరెక్టర్ జనరల్ తోషిహిరో మిజుటానీ మాట్లాడుతూ, “తెలంగాణతో సహకారాన్ని మరింత బలోపేతం చేయాలన్నదే మా అభిలాష,” అని పేర్కొన్నారు.
ఈ వేదికపై రాష్ట్ర ప్రభుత్వం రెండు ప్రధాన ప్రాజెక్టులపై ప్రచార వీడియోలను ప్రదర్శించింది. దేశంలోనే తొలి నెట్ జీరో ఇండస్ట్రియల్ సిటీగా హైదరాబాద్‌లో నిర్మిస్తున్న ఫ్యూచర్ సిటీ, అలాగే మూసీ పునరుజ్జీవన ప్రాజెక్ట్‌లకు సంబంధించిన విజన్‌ను ఈ ప్రదర్శన ద్వారా ప్రపంచానికి పరిచయం చేసింది. రోడ్‌షో అనంతరం తెలంగాణ బృందం జపాన్‌లోని పలు దిగ్గజ కంపెనీల ప్రతినిధులతో ప్రత్యేకంగా ముఖాముఖి భేటీలు నిర్వహించింది. ఎలక్ట్రానిక్స్, అర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఎలక్ట్రిక్ వెహికిల్స్, టెక్స్‌టైల్స్, గ్రీన్ ఎనర్జీ రంగాల్లో పెట్టుబడులకు అనువైన వాతావరణం తెలంగాణలో ఉందని రాష్ట్ర వాణిజ్య పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్ వివరించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..