హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన 400 ఎకరాల భూమిని చదును చేసే వ్యవహారంపై దుమారం రేగిన సంగతి తెలిసందే. ఈ క్రమంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్‌రెడ్డి తీరుపై బీఆర్‌ఎస్ నేతలు, హెచ్ సీయూ విద్యార్థులు మండిపడుతున్నారు. మరోవైపు, అక్కడ భూములు కొనేందుకు కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన ప్రకటన చేశారు. అక్కడ భూములు కొనొద్దని, మూడేళ్ల తర్వాత తాము అధికారంలోకి వచ్చిన తర్వాత అమ్మిన ప్రతి ఇంచు భూమిని వెనక్కి తీసుకుంటామని కుండబద్దలు కొట్టి మరీ చెప్పారు.
అంతేకాదు, బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ 400 ఎకరాల్లో ఒక అద్భుతమైన ఎకో పార్కును నిర్మిస్తామని, దానిని హైదరాబాద్ కు గిఫ్ట్ గా ఇస్తామని అన్నారు. ఈ రోజు భూములు కొన్నవారు రేపు తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత బాధపడినా తామేమీ చేయలేమని, తమను ఏమీ అనొద్దని ముందుగానే చెబుతున్నామని తెలిపారు. విద్యార్థుల ఆందోళన, పోరాట స్ఫూర్తికి బీఆర్‌ఎస్ పార్టీ తరఫున, హైదరాబాద్ నగర ప్రజల తరఫున సెల్యూట్ చేస్తున్నానని చెప్పారు.
ప్రజాస్వామిక లక్షణాలున్న ప్రభుత్వం అయితే నిరసన తెలుపుతున్న విద్యార్థులను పిలిచి మాట్లాడాల్సింది పోయి విద్యార్థులను స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి గుంట నక్కలు అని సంబోధించడం ఏంటని మండిపడ్డారు. ఇది దాయాదుల ఆస్తి తగాదా కాదని, ఆ భూములు హైదరాబాద్ భవిష్యత్తు అని చెప్పారు. బయో డైవర్సిటీ దెబ్బతినకుండా ఉండేందుకు అక్కడ ఎకో పార్క్ నిర్మిస్తామని, హెచ్ సీయూ విద్యార్థులతోపాటు ప్రజలందరికీ అందులోకి ప్రవేశం ఉంటుందని తెలిపారు.
సీఎం అంటే రాష్ట్రానికి బాసో.. నియంతనో.. చక్రవర్తో, రాజో కాదని, ఒక పెద్ద పాలేరులా, పెద్ద సర్వెంట్ మాదిరిగా పని చేసే బాధ్యత ఉన్న వ్యక్తి అని అన్నారు. ఇదేం పటేల్, పట్వారీ వ్యవస్థ కాదని, నియంతృత్వం కాదని గుర్తు చేశారు. దేశం మొత్తం హెచ్ సీయూ వైపు చూస్తోందని, విచిత్రమైన మానసిక రోగంతో బాధపడుతున్నట్లుగా రేవంత్‌రెడ్డి ప్రభుత్వ వ్యవహరం ఉందని విమర్శించారు. ఆ భూమికి సీఎం తాత్కాలిక ధర్మకర్త మాత్రమేనని, దాన్ని కాపాడాల్సింది పోయి.. ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తే కుదరదని రేవంత్ రెడ్డిని హెచ్చరించారు.
The post రియల్టర్లకు కేటీఆర్ షాకింగ్ న్యూస్ first appeared on namasteandhra.