రాష్ట్ర బడ్జెట్‌ షడ్రుచుల సమ్మిళితం

Written by RAJU

Published on:

రాష్ట్ర బడ్జెట్‌ షడ్రుచుల సమ్మిళితం– భట్టి, నేను జోడెద్దుల్లా పని చేస్తున్నాం
– అన్నింటికీ బడ్జెట్‌లో కేటాయింపులు చేశాం : సీఎం రేవంత్‌ రెడ్డి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్ర బడ్జెట్‌ షడ్రుచుల సమ్మిళితంగా ఉందని సీఎం రేవంత్‌ రెడ్డి అభివర్ణించారు. ఆదివారం హైదరాబాద్‌ రవీంధ్రభారతిలో ప్రభుత్వ ఆధ్వర్యంలో శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకల్లో ఆయన మాట్లాడుతూ తాను, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమం కోసం జోడెద్దుల్లా పని చేస్తున్నామని తెలిపారు. రాష్ట్ర ప్రజలందరికీ విశ్వావసు నామ సంవత్సరం సంతోషాలను అందించాలనీ, సంక్షేమం, అభివృద్ధి సమపాళ్లల్లో ఉండాలనీ, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు అందరికీ లభించాలని ఆకాంక్షించారు. వ్యవసాయ అభివృద్ధికి, పేదలకు విద్య అందించేందుకు బడ్జెట్‌లో ప్రాధాన్యం ఇచ్చినట్టు తెలిపారు. విద్య, వైద్య, ఉద్యోగ, ఉపాధి, సంక్షేమం అన్నిటికీ బడ్జెట్‌ లో నిధులు కేటాయిస్తున్నట్టు వెల్లడించారు. దేశంలో తెలంగాణ ఒక వెలుగు వెలగాలి, దేశానికే తెలంగాణ ఆదర్శంగా నిలవాలన్నారు. దేశంలో కొత్త నగరాల నిర్మాణం జరగాల్సిన అవసరముందంటూ, అందులో భాగంగానే ఫ్యూచర్‌ సిటీ నిర్మాణానికి తెలంగాణ శ్రీకారం చుట్టిందని తెలిపారు. ఫ్యూచర్‌ సిటీ పెట్టుబడుల నగరంగా అభివృద్ధి చెందుతుందని చెప్పారు. దేశంలోనే ఫుడ్‌ సెక్యూరిటీ యాక్ట్‌ను తీసుకొచ్చి పేదలకు ఆకలి దూరం చేసేందుకు ఆనాడు కాంగ్రెస్‌ ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని గుర్తుచేశారు. ఇప్పుడు పేదలకు సన్నబియ్యం అందించే పథకానికి ఉగాది రోజున శ్రీకారం చుడుతున్నట్టు తెలిపారు. దేశంలోనే అత్యధికంగా వరి ఉత్పత్తి చేసిన రాష్ట్రాల్లో తెలంగాణ ముందుభాగంలో నిలిచిందని వెల్లడించారు. రైతులు పండించిన సన్న ధాన్యాన్ని పేదలకు అందించబోతున్నామని తెలిపారు. ఆదాయం పెంచాలి, పేదలకు పంచాలన్నదే తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. ఇది రాజకీయాలు చేసే సందర్భం కాదనీ, అభివృద్ధి చేసే సందర్భమని తెలిపారు. తమ ఆలోచనలో, సంకల్పంలో స్పష్టత ఉందనీ, తెలంగాణ రైజింగ్‌-2050 ప్రణాళికతో దేశానికే తెలంగాణను ఆదర్శంగా నిలబెడతామని తెలిపారు. ఫ్యూచర్‌ సిటీ అంటే కేవలం ప్రజలు నివసించే నగరమే కాదనీ, అది పెట్టుబడుల నగరమని చెప్పారు. ఈ సిటీతో లక్షలాది మందికి ఉపాధి లభిస్తుందని తెలిపారు. శ్రీ సీతామచంద్ర స్వామి వారి తిరుకల్యాణ మహౌత్సవ ఆహ్వాన రాజపత్రాన్ని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డికి భద్రాచలం దేవస్థానం ఈవో, అర్చకులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యేలు అడ్లూరి లక్ష్మణ్‌, శంకరయ్య, మల్‌ రెడ్డి రంగా రెడ్డి, ఎమ్మెల్సీ మహేందర్‌ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
రియల్‌ ఎస్టేట్‌ రంగంలో పరుగులు పండితులు బాచంపల్లి సంతోష్‌ కుమార్‌ శాస్త్రి
ఉగాది వేడుకల్లో పండితులు బాచంపల్లి సంతోష్‌కుమార్‌ శాస్త్రి పంచాంగ శ్రవణం చేశారు. ”రియల్‌ ఎస్టేట్‌ రంగం తెలంగాణలో ఈ ఏడాది పరుగులు పెడుతుంది. తెలంగాణ రాష్ట్రం మిథున రాశి, పునర్వసు నక్షత్రంలో ఆవిర్భవించింది. పాలకుల మధ్య పోటీతత్వం పెరుగుతుంది. ఉభయ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పాలకులు పోటీపడి పరుగులుపెట్టి పాలిస్తారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రజలు మెచ్చే విధంగా పాలన చేస్తారు. తెలంగాణలో వర్షాలకు ఇబ్బంది లేదు, పంటలు అద్భుతంగా పండుతాయి. ఎర్రరేగడి భూములు, ఎర్రటి ధాన్యాలు మంచి ఫలితాలిస్తాయి. శాంతి భద్రతల విషయంలో నిరంతరం పోలీసులు జాగతంగా ఉండి పనిచేస్తారు. రాష్ట్రంలో పాడి పంటలు సమృద్ధిగా ఉంటాయి. తుఫాన్లు, భూకంపాలు అప్పుడప్పుడు పలకరించవచ్చు. ఆర్థిక భారం ఎక్కువగానే ఉంటుంది. ప్రజలకు డబ్బు బాగానే సిద్ధిస్తుంది. ఈ ఏడాది ప్రజలు అత్యంత సంతోషంగా ఉంటారు. రాష్ట్రానికి రావాల్సిన డబ్బు రాకపోవడంతో కొంత ఇబ్బంది ఉంటుంది. పొరుగు రాష్ట్రాలతో నీటి విషయంలో ఇబ్బందులు వస్తాయి.. వాటిని ముఖ్యమంత్రి అధిగమిస్తారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది విద్యావ్యవస్థకు అధిక ప్రాధాన్యం ఇస్తుంది. విద్య, వైద్యంపై ఎక్కువగా దృష్టి పెడుతుంది. సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు చేపడుతుంది. అనుకోని ఇబ్బందుల వల్ల అన్ని కార్యక్రమాలు మంచి ఫలితాలు ఇవ్వకపోవచ్చు. పాలకులు ప్రజాహిత కార్యక్రమాలకు ప్రజాధనాన్ని వెచ్చిస్తారు. విదేశీ పెట్టుబడులు ఎక్కువగా తెచ్చే ప్రయత్నం చేస్తారు. రాష్ట్ర ఆదాయం బయటకు పోకుండా కాపాడే ప్రయత్నం చేస్తారు. ఈ సంవత్సరం వర్షం బాగా పడుతుంది.. కానీ పంటలు కాపాడుకోవాలి” అని సంతోష్‌కుమార్‌ శాస్త్రి పంచాంగ శ్రవణంలో పేర్కొన్నారు.

Subscribe for notification
Verified by MonsterInsights