– యాదాద్రికి రూ.200 కోట్లు.. వేములవాడకు రూ.100 కోట్లు
– భద్రాచలానికి గత, ప్రస్తుత ప్రభుత్వాల మొండిచేయి
– ఆలయ.. పట్టణ అథారిటీ లేకపోవడంతోనే నిర్లక్ష్యం
– నవమికి సీఎం రేవంత్ రెడ్డి వస్తుండటంతో ఆశలు
నవతెలంగాణ – ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
భద్రాచలం రామాలయంపై ప్రభుత్వాలు చిన్నచూపు చూస్తున్నాయి. ఓవైపు కేంద్ర ప్రభుత్వం ఆలయం బాగోగుల గురించి పట్టించుకోవడం లేదు. మరోవైపు గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం భద్రాద్రిని నిర్లక్ష్యం చేసింది. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వమూ అదే పద్ధతిలో వ్యవహరిస్తోందన్న అభిప్రాయం ప్రజల్లో ఉంది. గతంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం 2016-17 బడ్జెట్‌లో రూ. 100 కోట్లు కేటాయించింది కానీ ఒక్క పైసా విడుదల చేయలేదు. ఏండ్లు గడుస్తున్నా, ప్రభుత్వాలు మారు తున్నా భద్రాచలం పట్టణం, రామాలయ అభివృద్ధికి ఒక్క అడుగు కూడా ముందుకు పడటం లేదు. ప్రతి బడ్జెట్‌లో భక్తులు, స్థానికులకు ఎదురుచూపులు తప్పటం లేదు. కాంగ్రెస్ హయాంలోనూ ఈసారి బడ్జెట్‌లో భద్రాచలం రామాలయానికి మొండి ‘చేయే’ చూపారు. అయితే 6వ తేదీన శ్రీరామనవమికి జరిగే శ్రీ సీతారాముల కల్యాణానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దంపతులతో పాటు ఆరుగురు మంత్రులు హాజరవుతున్న దృష్ట్యా ప్రత్యేక నిధుల కేటాయిం పులు ఉంటాయనే ఆశ భక్తుల్లో నెలకొంది. ఆరోజు సీఎం వరాల జల్లు కురిపించవచ్చని స్థానికులు ఆశిస్తున్నారు.
భద్రాద్రి అభివృద్ధికి నిధుల లేమి..
ఉపముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క గత నెల ప్రవేశపెట్టిన బడ్జెట్లో యాదాద్రి టెంపుల్ డెవలప్‌మెంట్ అథారిటీకి రూ.200 కోట్లు, వేములవాడ ఏరియా డెవలప్‌మెంట్ అథారిటీకి రూ.100 కోట్లు కేటాయించారు. కానీ భద్రాచలానికి ఒక్క పైసా కూడా ఇవ్వలేదు. ఇటీవల రూ.34.4 కోట్లతో మాఢ వీధులు భూసేకరణ ప్రక్రియ పూర్తయింది. శ్రీరామ నవమికి సీఎం రానున్న దృష్ట్యా ఆ రోజున దీని అభివృద్ధికి శంకుస్థాపన చేస్తారు. ఇప్పటికే నిర్వాసితులతో అంగీకార పత్రం రాయించుకున్న నేపథ్యంలో మాడవీధుల అభివృద్ధికి నిధులు కేటాయిస్తారని భక్తులు ఆశిస్తున్నారు. మొన్నటి బడ్జెట్ లోటును ఈ రకంగానైనా కొంతమేరకు తీర్చుతారని భావిస్తున్నారు. ‘భద్రాచలం ఆలయ పట్టణాభివృద్ధి అథారిటీ’ ఏర్పాటు చేసి నిధులు విడుదల చేయాలనే డిమాండ్ గట్టిగా వినిపిస్తోంది. ఒక ప్రాంతాన్ని ప్రత్యేకంగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వాలు ప్రత్యేక అథారిటీలను ఏర్పాటు చేస్తుంటాయి. ఖమ్మం నగరాభివృద్ధికి స్తంభాద్రి అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీని నాలుగేండ్ల క్రితం ఏర్పాటు చేశారు. హైదరాబాద్‌లో మెట్రో డెవలప్‌మెంట్ అథారిటీ (హెచ్‌ఎండీఏ) ఎప్పటి నుంచో ఉంది. భద్రాచలం అభివృద్ధికి కూడా ఈ తరహా ప్రత్యేక అథారిటీని ఏర్పాటు చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
ఉద్యోగుల జీతభత్యాలకే హుండీ ఆదాయం
యాదాద్రి, వేములవాడల డెవలప్‌మెంట్ అథారిటీలను ఏర్పాటు చేసిన ప్రభుత్వం.. ప్రతి బడ్జెట్లో నిధులు కేటాయించి అవసరమైన వసతులు కల్పిస్తోంది. కానీ భద్రా చలం రామాలయానికి, పట్టణాభివృద్ధికి ఎలాంటి అథారిటీ లేదు. భక్త రామదాసు నిర్మించిన ఆలయానికి కొద్దిపాటి మార్పులు, చేర్పులు, సీతారాముల కల్యాణానికి నిర్మించిన మిథిలా స్టేడియం తప్ప ఇతర అభివృద్ధి పనులకు నోచు కోలేదు. కల్యాణానికి ప్రతి ఏడాది భక్తులు పెరుగుతున్నా మిథిలా స్టేడియాన్ని ఆధునాతనంగా పున్ణనిర్మించడం లేదు. రామాలయ హుండీ ఆదాయం ఉద్యోగుల జీతభత్యాలు, ఉత్సవాల నిర్వహణకే సరిపోతున్నాయి. భక్తుల వసతుల సమస్య అలాగే ఉంటోంది.
భద్రాచలం పట్టణ ప్రగతి అధోగతి..
భద్రాచలం పట్టణ ప్రగతి అధోగతి పాలైందనే చెప్పాలి. మేజర్ గ్రామపంచాయతీగా ఉన్న భద్రాచలంలోని దాదాపు 25 కాలనీల్లో లక్ష వరకు జనాభా ఉంటున్నారు. భద్రాచలం అభివృద్ధికి రూ.100 కోట్లు ఇస్తామని బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఏండ్ల తరబడి ప్రకటనలు ఇచ్చిందే తప్ప రూపాయి కూడా మంజూరు చేయలేదు. వరదల సందర్భంగా రూ.1,000 కోట్లు ప్రకటించినా అందులోనూ పైసా విదల్చలేదు. రాష్ట్ర విభజన తర్వాత భద్రాచలంలో స్థల సమస్య తీవ్రమైంది. ఇక్కడ కీలకమైన దేవాదాయ, పంచాయతీరాజ్, రెవెన్యూ, అటవీశాఖ, ఐటీడీఏ, పోలీస్, పర్యాటక విభాగాల మధ్య సమన్వయం ఉంటేనే అభివృద్ధి పనులు ముందుకెళ్తాయి. ఒక విభాగం పనులు ప్రారంభిస్తే మరో శాఖ అడ్డుకునే పరిస్థితులు ఉన్న నేపథ్యంలో అన్నింటినీ సమన్వయం చేస్తూ ప్రత్యేక అథారిటీని ఏర్పాటు చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
భద్రాచలం అభివద్ధికి నిధులు కేటాయించాలి
గోదావరి కరకట్ట ఎత్తు పెంచాలి. ఇరువైపులా కరకట్టని పొడిగించాలి. పోలవరం బ్యాక్ వాటర్‌తో పొంచి ఉన్న ప్రమాదాన్ని రీ సర్వే చేసి నష్టంపై నిర్దిష్ట అంచనాకు రావాలి. బాధితులకు ప్రత్యామ్నాయం చూపించాలి. నష్టపరిహారం అందించాలి. భద్రాచలానికి ఆనుకుని ఉన్న ఐదు గ్రామ పంచాయతీలను పట్టణంలో కలపాలి. రామాలయం అభివృద్ధితో పాటు భద్రాచలం అభివృద్ధికి నిధులు కేటాయించాలి.
– ఏజే రమేష్, సీపీఐ(ఎం) భద్రాద్రి కొత్తగూడెం
జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు