– జిల్లా వ్యాప్తంగా కలర్‌ఫుల్ జోష్
– అంబరాన్నంటిన హోలీ సంబురాలు
(ఆంధ్రజ్యోతి సిరిసిల్ల)
ఆనందాల కేరింతలు, యువకుల నృత్యాలు, చిన్నారుల చిద్విలాసాల మధ్య శుక్రవారం రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా హోలీ సంబురాలు జరుపుకున్నారు. జిల్లాలో ఉదయం నుంచే గ్రామాలు మొదలుకొని పట్టణాల వరకు హోలీ సందడి కనిపించింది. మాజీ ప్రజాప్రతినిధులు, అధికారులు, వివిధ పార్టీల నాయకులు అన్ని వర్గాల ప్రజలు వేడుకల్లో భాగస్వాములు అయ్యారు. సిరిసిల్ల జిల్లా కేంద్రంలో వివిధ వాడల్లో డీజేసౌండ్ల మధ్య నృత్యాలు చేస్తూ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. యువకులు బైక్‌లపై తిరుగుతూ రంగులు చల్లుకోవడంతో సందడి వాతావరణం ఏర్పడింది. హోలీ సందర్భంగా కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా, ఎస్పీ మహేష్ బాబా సాహెబ్‌లకు పలు పార్టీల నాయకులు శుభాకాంక్షలు తెలిపారు. బీఆర్‌ఎస్, బీజేపీ, కాంగ్రెస్ నాయకులు హోలీ సంబురాలు జరిపారు. బీఆర్‌ఎస్ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు తోట అగయ్య, టెక్స్‌టైల్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ గూడూరి ప్రవీణ్, మున్సిపల్ మాజీ చైర్‌పర్సన్ జిందం కళచక్రపాణి, బీఆర్‌ఎస్ పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపాణి, మాజీ కౌన్సిలర్లు, మాజీ ఎంపీపీలు, నాయకులు హోలీ సంబురాల్లో పాల్గొన్నారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి, పట్టణ అధ్యక్షుడు శ్రీనివాస్, రాష్ట్ర కమిటీ సభ్యుడు రాంప్రసాద్ తదితరులు హోలీ సంబురాల్లో పాల్గొన్నారు. జూనియర్ కళాశాల మైదానంలో గోర్ బంజారా ఆధ్వర్యంలో గిరిజన యువకులు హోలీ సంబురాలు జరిపారు. పట్టణంలో విద్యానగర్, గీతానగర్, సుభాష్‌నగర్, నెహ్రూనగర్, బీవైనగర్, సుందరయ్యనగర్, వెంకంపేట, పద్మనగర్, సర్ధార్‌నగర్, గోపాల్‌నగర్, అంబేద్కర్‌నగర్, పాతబస్టాండ్, కొత్త బస్టాండ్‌లతో పాటు విలీన గ్రామాలైన చంద్రంపేట, బోనాల, పెద్దూర్, రగుడు, సర్ధాపూర్, జెగ్గారావుపల్లె తదితర ప్రాంతాల్లో యువతీ యువకులు మహిళలు హోళీ సంబురాల్లో పాల్గొన్నారు.
Updated Date – Mar 15 , 2025 | 01:33 AM