దేశ దిశ

రంకెవేస్తున్న పాకిస్థాన్.. భారత విమానాలకు గగనతలం మూసివేసిన షాబాజ్ సర్కార్!

రంకెవేస్తున్న పాకిస్థాన్.. భారత విమానాలకు గగనతలం మూసివేసిన షాబాజ్ సర్కార్!

మంగళవారం (ఏప్రిల్ 22) జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడి తర్వాత భారతదేశం పాకిస్తాన్‌పై కఠిన చర్యలు తీసుకుంది. పాకిస్తాన్ పౌరులందరినీ ప్రభావితం చేసిన 1960 సింధు జల ఒప్పందాన్ని రద్దు చేయడంతోపాటు అనేక చర్యలు తీసుకుంది. ఈ నేపథ్యంలోనే పాకిస్తాన్ సైతం భారత్ పట్ల కఠినంగా వ్యవహారిస్తోంది. పాకిస్థాన్ గగనతలం విషయంలో సంచలన నిర్ణయం తీసుకుంది షాబాజ్ సర్కార్.

భారతదేశానికి వచ్చే వాణిజ్య విమానాలు తమ గగనతలం గుండా వెళ్లకూడదంటూ వైమానిక ప్రాంతాన్ని మూసివేసింది. ఈ మేరకు పాకిస్తాన్ షాబాజ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుందని స్థానిక మీడియా పేర్కొంది. భారత విమానాలు పాకిస్తాన్ గగనతలంలోకి ప్రవేశించడానికి అనుమతించడం జరగదు. సింధు జల ఒప్పందాన్ని నిలిపివేయడం, దౌత్య సంబంధాలను తగ్గించాలనే భారతదేశం నిర్ణయం పట్ల పాకిస్తాన్ కలత చెందింది. పాకిస్తాన్ ప్రధాని షాబాజ్ షరీఫ్ గురువారం (ఏప్రిల్ 24) ఉన్నత స్థాయి భద్రతా సమావేశాన్ని కూడా ఏర్పాటు చేశారు.

బుధవారం రాత్రి ఒక ప్రైవేట్ టెలివిజన్ ఛానల్‌తో మాట్లాడుతూ పాకిస్తాన్ ఉప ప్రధాని ఇషాక్ దార్, భారతదేశం తీసుకున్న చర్యను తొందరపాటు నిర్ణయంగా అభివర్ణించారు. పహల్గామ్ దాడి తర్వాత జెడ్డా నుండి వెంటనే తిరిగి వస్తున్నప్పుడు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విమానం పాకిస్తాన్ గగనతలం గుండా వెళ్ళలేదు. మరో మార్గాన్ని ఎంచుకుంది. అంతకుముందు మంగళవారం (ఏప్రిల్ 22), జెడ్డాకు వెళుతుండగా, ప్రధానమంత్రి విమానం పాకిస్తాన్ గగనతలం గుండా వెళ్ళింది. జెడ్డా ప్రాంతానికి చేరుకున్న ప్రధాని మోదీ విమానానికి సౌదీ దేశ యుద్ద విమానాలతో ఘన స్వాగతం లభించింది.

పహల్గామ్ ఉగ్రవాద దాడి నేపథ్యంలో, బుధవారం భారతదేశం పాకిస్తాన్‌తో దౌత్య సంబంధాలను తీవ్రంగా తగ్గించడం, ఆరు దశాబ్దాలకు పైగా ఉన్న సింధు జల ఒప్పందాన్ని నిలిపివేయడం, అట్టారి చెక్‌పోస్ట్‌ను మూసివేయడం వంటి అనేక నిర్ణయాలు తీసుకోవడం ద్వారా పాకిస్తాన్‌కు బలమైన సందేశాన్ని ఇచ్చింది. దౌత్య సంబంధాలను మరింత తగ్గించడం ద్వారా, పాకిస్తాన్ – భారత హైకమిషన్లలో నియమించిన మొత్తం సిబ్బంది సంఖ్య మే 1 నాటికి 55 నుండి 30కి తగ్గుతుంది.

పహల్గామ్ దాడికి పాల్పడిన వారిని న్యాయస్థానం ముందు నిలబెట్టి, వారి స్పాన్సర్లను జవాబుదారీగా ఉంచాలని భారత CCS నిర్ణయించిందని విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ తెలిపారు. పాకిస్తాన్ సరిహద్దు ఉగ్రవాదానికి మద్దతు ఇవ్వడం విశ్వసనీయంగా ఆపే వరకు 1960 సింధు జల ఒప్పందం తక్షణమే నిలిపివేయడం జరుగుతుందని మిస్రి అన్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

Exit mobile version