– ప్రజా సమస్యలపై సర్వే : వనపర్తి పర్యటనలో సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ
నవతెలంగాణ -వనపర్తి రూరల్
ప్రజలకు మౌలిక వసతులను కల్పించా ల్సిన బాధ్యత ప్రభుత్వానిది, అధికారులదేనని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ అన్నారు. వనపర్తి జిల్లా కేంద్రంలోని హరిజనవాడ, గాంధీనగర్‌లో శనివారం ప్రజాసమస్యలపై సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో సర్వే చేపట్టారు. ఈ సందర్భంగా జాన్‌వెస్లీ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం సీఐ టీయూ కార్యాలయంలో విలేకరుల సమావేశం లో జాన్‌వెస్లీ మాట్లా డుతూ.. రాష్ట్రవ్యాప్తంగా ప్రజా సమస్యలపై ఆందోళనలు, సర్వే కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు చెప్పారు. ప్రజల సమస్యలను గుర్తించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తా మన్నారు. అందరికీ గ్యాస్ సబ్సిడీ రావడం లేదని, వెంటనే చర్యలు తీసుకోవాలని, మహిళలకు నెలకు రూ.2500 ఇవ్వాలని, వృద్ధులకు రూ.4000 పింఛన్ ఇవ్వాలని అన్నారు.
రేషన్ కార్డులు వెంటనే మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ పర్యటనలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి పుట్టా ఆంజనేయులు, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఎండి జబ్బర్, ఏ.లక్ష్మి, మండ్ల రాజు, పట్టణ కార్యదర్శి పరమేశ్వర చారి, నాయకులు గంధం మదన్, జి.బాలస్వామి, గంధం గట్టయ్య, నందిమల్ల రాములు, శ్రీను, జి.బాలరాజు, రాబర్ట్, మన్యం, సాయి లీల, కవిత, రేణుక, ఉమా, మద్దిలేటి పాల్గొన్నారు.
భావజాలరంగంలో వాస్తవాలను ప్రజలకు వివరించాలి
– కార్పొరేట్ దోపిడీ అర్థం కాకుండా భావోద్వేగాలను రెచ్చగొడుతున్న బీజేపీ : సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ
భావజాల రంగంలో వాస్తవాలను ప్రజల దృష్టికి తీసుకెళ్లాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ అన్నారు. భావజాల రంగంలో ముంచుకొస్తున్న ప్రమాదాన్ని ప్రజలకు వివరించేందుకు పార్టీ కార్యకర్తలు కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఆ పార్టీ సీనియర్ నాయకులు జి రాములు అధ్యక్షతన హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లో సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యాలయం ఎంబీ భవన్‌లో ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జాన్ వెస్లీ మాట్లాడుతూ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకు ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కట్టబెట్టేందుకు పూనుకుంటున్నదని విమర్శించారు. కార్పొరేట్ దోపిడీ ప్రజలకు అర్థం కాకుండా ఉండేందుకు భావోద్వేగాలను రెచ్చగొట్టి ప్రజల మధ్య చీలికలు తీసుకొచ్చేందుకు బీజేపీ పూనుకుంటున్నదని అన్నారు. ఈ వాస్తవాలతోపాటు కార్పొరేట్ దోపిడీ ప్రజలకర్తమయ్యే విధంగా విస్తృతంగా ప్రచారం నిర్వహించాలని సూచించారు. మైనార్టీలకు వ్యతిరేకంగా ప్రజలను రెచ్చగొట్టి వారు పబ్బం గడుపుకుంటున్నారని అన్నారు.
సీపీఐ(ఎం) సీనియర్ నాయకులు ఎంవిఎస్ శర్మ మాట్లాడుతూ మతోన్మాద శక్తులకు వ్యతిరేకంగా ప్రజానీకంలో పెద్ద ఎత్తున ప్రచారం చేపట్టి లౌకిక శక్తులను విశాల ప్రాతిపదికన సమీకరించాలని చెప్పారు. రాష్ట్ర స్థాయిలోనే కాకుండా జిల్లా, మండల స్థాయిలో విస్తృత ప్రచారం నిర్వహించాలని సూచించారు. రాజ్యాంగ హక్కులను పరిరక్షించుకునేందుకు సిద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రజల జీవనోపాధిని కుంగదీస్తున్న ఆర్థిక సమస్యల మీద పోరాటం చేస్తూనే ప్రజల్లో చీలికలు తీసుకొచ్చే విభజన, విద్వేష విధానాలకు వ్యతిరేకంగా పోరాడాలని కోరారు. దళితులు, మహిళలపై జరుగుతున్న దాడులను అరికట్టేందుకు ఉద్యమించాలని పార్టీ శ్రేణులకు ఆయన పిలుపునిచ్చారు. లౌకిక, అభ్యుదయ తాత్విక భావాలను సంస్కరణ ఉద్యమ నేతల జీవితాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు టి సాగర్, ఎండి అబ్బాస్, ఎండి జహంగీర్ తదితరులు పాల్గొన్నారు.