
Donald Trump: డోనల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా మూడోసారి ఎన్నిక అయ్యేందుకు అవకాశాలున్నాయని ఓ న్యూస్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. రాజ్యాంగం అమనుమతించకపోయినా మూడోసారి తాను అధ్యక్షుడు కావడానికి చాలా మార్గాలున్నాయని ఆయన చెప్పారు. ఒక వ్యక్తి అమెరికా అధ్యక్షుడిగా రెండుసార్లు కొనసాగే అవకాశం ఉంది. కానీ, మూడోసారి అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలు చేపట్టడానికి అవకాశాలున్నాయా? ఒకసారి తెలుసుకుందాం.
నాలుగుసార్లు అమెరికా అధ్యక్షుడిగా ఫ్రాంక్లిన్ డి రూజ్‌వెల్ట్
అమెరికా అధ్యక్షుడిగా ఫ్రాంక్లిన్ డి రూజ్ వెల్ట్ నాలుగుసార్లు కొనసాగారు. 1932, 1936, 1940, 1944లలో అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. 1945 ఏప్రిల్ 12న మరణించే సమయానికి ఆయన అమెరికా అధ్యక్షుడిగా ఉన్నారు. 1951లో అమెరికా రాజ్యాంగాన్ని సవరించింది.
ఈ రాజ్యాంగ సవరణతో ఒక వ్యక్తి రెండుసార్లకు మించి అధ్యక్ష పదవిని చేపట్టే అవకాశం కోల్పోయారు.
22వ రాజ్యాంగ సవరణ ఏం చెబుతుంది?
ఒక వ్యక్తి రెండుసార్లకు మించి అ్యధ్యక్షుడిగా ఎన్నిక కావడానికి అమెరికా 22వ రాజ్యాంగ సవరణ చెక్ పెడుతోంది. రాజ్యాంగ సవరణలోని సెక్షన్ 1 ప్రకారం ఒక్క వ్యక్తి రెండుసార్లకు మించి అధ్యక్షుడిగా ఎన్నిక కావడానికి వీల్లేదు. మూడోసారి ఒక వ్యక్తి అధ్యక్ష పదవికి పోటీ చేయడానికి 22వ రాజ్యాంగ సవరణను రద్దు చేయాలి. ఇది జరగాలంటే సెనెట్, ప్రతినిధుల సభల్లో మూడింటి రెండొంతుల మెజారిటీతో ఆమోదం పొందాలి. ఆ తర్వాత అమెరికాలోని 50 రాష్ట్రాల్లో మూడు వంతుల రాష్ట్రాలు దీన్ని ఆమోదించాలి.అయితే అమెరికా అధ్యక్షుడిగా రెండుసార్ల కంటే మించి పోటీ చేయవద్దని చేసిన రాజ్యాంగ సవరణను రద్దు చేయాలని కోరుతూ రిపబ్లికన్ పార్టీ సభ్యులు యాండీ ఓగిల్స్ ఇటీవలనే తీర్మానాన్ని ప్రవేశ పెట్టారు.
25వ రాజ్యాంగ సవరణ ఏం చెబుతోంది?
అమెరికా రాజ్యాంగాన్ని 25వ సవరణలో కొన్ని కీలక అంశాలను చేర్చారు. అమెరికా అధ్యక్షుడిగా ఉన్న వ్యక్తి చనిపోయినా లేదా రాజీనామా చేసినా ఉపాధ్యక్షుడిగా ఉన్న వ్యక్తి అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికయ్యేందుకు అవకాశం ఉంది. ఉపాధ్యక్షుడి పదవి ఖాళీగా ఉన్న సమయంలో ఉపాధ్యక్ష పదవికి అధ్యక్షుడు ఒకరిని నామినేట్ చేయవచ్చు. కాంగ్రెస్ లోని రెండు సభల్లో మెజారిటీ ఆధారంగా నిర్ణయం తీసుకుంటారు.
మూడోసారి అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికయ్యే అవకాశం ఉందా?
ఒక వ్యక్తి అమెరికాకు మూడోసారి అధ్యక్షుడిగా ఎన్నికయ్యేందుకు అవకాశం ఉందా అంటే ఒక ప్రత్యామ్నాయం కన్పిస్తోంది. అమెరికా అధ్యక్షులుగా 9 మంది ఎన్నిక కాకుండానే బాధ్యతలను చేపట్టారు. వీరంతా అమెరికాకు ఉపాధ్యక్షులుగా పనిచేశారు. ఈ 9 మంది ఉపాధ్యక్షులుగా పనిచేస్తున్న సమయంలో ఉన్న అధ్యక్షులు చనిపోవడం వల్లనో, రాజీనామా చేయడం వల్లనో ఉపాధ్యక్షులుగా ఉన్న వారంతా అమెరికా అధ్యక్షులుగా బాధ్యతలు చేపట్టారు. ఈ ఒక్క అవకాశం ట్రంప్ నకు ఉంది. ఒకవేళ ట్రంప్ ఉపాధ్యక్షుడిగా బాధ్యతలు చేపడితే అప్పుడు అధ్యక్ష పదవిలో ఉన్న వ్యక్తి ఆ పదవి నుంచి తప్పుకుంటే ఆయనకు ఈ అవకాశం దక్కనుంది.
22వ రాజ్యాంగ సవరణ రద్దుకు ప్రయత్నాలు జరిగాయా?
అమెరికా రాజ్యాంగ సవరణ 22ను రద్దు చేయాలని ప్రయత్నాలు జరిగాయి. 1956లో అమెరికా రాజ్యాంగ సవరణ 22ను రద్దు చేసేందుకు ప్రయత్నించారు. 1997, 2013 మధ్య డెమోక్రాట్ జోస్ ఇ. సెరానో తొమ్మిది తీర్మానాలను ప్రవేశపెట్టారు. ఈ తీర్మానాలు ఆమోదం పొందలేదు. ఈ రాజ్యాంగ సవరణ అమల్లోకి వచ్చినప్పుడు అధ్యక్షుడిగా ఉన్న హ్యారీ ట్రూమాన్ దీన్ని తీవ్రంగా విమర్శించారు. అమెరికా అధ్యక్షుడిగా రెండుసార్లు పనిచేసిన రోనాల్డ్ రీగన్ ఈ సవరణ రద్దుకు మద్దతు ఇస్తానని తెలిపారు.రెండుసార్లు మాత్రమే అధ్యక్ష పదవికి పోటీలో ఉండాలనే విధానం అమల్లో ఉన్నందున తాను మరోసారి పోటీ చేయలేదని బిల్ క్లింటన్ 2000లో ప్రకటించారు.