– Advertisement –
కె.సుధాకర్ రెడ్డి, అరుణ్ రాజ్, పూర్ణ చంద్ర, మౌనికా బొమ్మ ప్రధాన పాత్రల్లో నటించిన అవార్డ్ విన్నింగ్ మూవీ ‘ముత్తయ్య’. భాస్కర్ మౌర్య దర్శకుడు. హైలైఫ్ ఎంటర్టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్, ఫిక్షనరీ ఎంటర్టైన్మెంట్ ఎల్‌ఎల్‌పి బ్యానర్లపై వంశీ కారు మంచి, వృదా ప్రసాద్ సంయుక్తంగా నిర్మించారు. దివాకర్ మణి సినిమాటోగ్రాఫర్, సహ నిర్మాతగానూ వ్యవహరించారు. మే 1వ తేదీ నుంచి ఈ సినిమా ఈటీవీ విన్‌లో స్ట్రీమింగ్‌కు రానుంది. ఈ నేపథ్యంలో దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి, నిర్మాత శోభు యార్లగడ్డ సంయుక్తంగా ఈ చిత్ర ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. ఈ మూవీ ట్రైలర్ తన మనసును కదిలించిందని రాజమౌళి చిత్ర బృందాన్ని అభినందించారు. నటుడు కావాలనేది 60 ఏళ్ల ముత్తయ్య కల. తమ ఊరైన చెన్నూరుకు ఏ సినిమా షూటింగ్ వాళ్లు వచ్చినా తనకో క్యారెక్టర్ ఇమ్మని అడుగుతుంటాడు. సోషల్ మీడియా రీల్స్, షార్ట్స్ చేస్తాడు. నాటకాల్లో బాగా డైలాగ్స్ చెప్పే ముత్తయ్యకు మంచి నటనా ప్రతిభ ఉంటుంది. కానీ సినిమా నటుడు కావాలంటే అంత సులువు కాదు. అతని కల నెరవేర్చుకునేందుకు కుటుంబ ఆర్థిక పరిస్థితులు సహకరించవు. స్నేహితులు, కుటుంబ సభ్యుల నుంచి ప్రోత్సాహాం అందదు. ఇలాంటి పరిస్థితులన్నీ తట్టుకుని ముత్తయ్య నటుడు కాగలిగాడా, ఏదో ఒక రోజు ఊరి ప్రజలకు తను నటించిన సినిమా పెద్ద తెరపై చూపించాలనే కలను ఎలా నెరవేర్చుకున్నాడు అనేది ట్రైలర్‌లో హార్ట్ టచింగ్‌గా చూపించారు. కలను వెంటనే నెరవేర్చుకోవాలి, లేదంటే అప్పుడే చంపేసుకోవాలి, కానీ వెంటపెట్టుకుని తిరగకూడదు అంటూ ముత్తయ్య చెప్పే డైలాగ్ అతని క్యారెక్టర్ పడే మానసిక సంఘర్షణను అద్భుతంగా చూపించింది.