
మీ కాళ్లలో తరచూ తిమ్మిర్లు, నొప్పులు రావడం కాల్షియం లేదా మెగ్నీషియం లోపానికి సంకేతం కావచ్చు. ముఖ్యంగా రాత్రిపూట కాళ్లలో కదిలించేలా నొప్పి కలగడం గమనించాలి. ఇది శరీరంలో మినరల్స్ సమతుల్యత తగ్గిపోవటానికి సంకేతం. ఇటువంటి పరిస్థితుల్లో పాల ఉత్పత్తులు, ఆకుకూరలు, నట్స్ వంటివి తీసుకోవడం ద్వారా సమస్యను తగ్గించవచ్చు.
రాత్రిపూట సరిపడ నిద్ర పోయినప్పటికీ ఉదయానికే అలసటగా అనిపిస్తుంటే.. అది పోషక లోపానికి గుర్తుగా భావించాలి. ముఖ్యంగా మెగ్నీషియం, జింక్ తక్కువగా ఉన్నప్పుడు శక్తి స్థాయి తగ్గిపోతుంది. శరీరానికి అవసరమైన ఎనర్జీ కోసం ప్రోటీన్స్, మెగ్నీషియం, జింక్ ఉన్న ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవాలి.
గోళ్లపై తెల్లని చిన్న మచ్చలు లేదా చారలు కనిపించడం ఒక సాధారణ సమస్య. అయితే ఇది జింక్ తక్కువగా ఉన్నట్లు సూచించవచ్చు. శరీరంలో జింక్ తగ్గితే గోళ్లు బలహీనపడతాయి. ఇది శరీరంలోని జీర్ణవ్యవస్థ పనితీరుపై ప్రభావం చూపుతుంది. జింక్ ఎక్కువగా ఉండే విత్తనాలు, పప్పులు తీసుకోవడం మంచిది.
గాయం అయినప్పుడు అది త్వరగా మానకపోతే.. అది కూడా జింక్ లోపానికి సంకేతంగా పరిగణించాలి. జింక్ శరీర గాయాలు మానించడంలో కీలకంగా పని చేస్తుంది. శరీర పునరుద్ధరణ ప్రక్రియను వేగవంతం చేయాలంటే జింక్ తగినంత తీసుకోవాలి.
మీకు తరచూ నిద్ర రాకపోతే లేదా మధ్యలో నిద్ర లేస్తుంటే.. మెగ్నీషియం లోపం ఉన్నట్టు భావించవచ్చు. మెగ్నీషియం శరీరంలోని మెలటోనిన్ అనే నిద్ర హార్మోన్ ఉత్పత్తిలో కీలక పాత్ర పోషిస్తుంది. డ్రై ఫ్రూట్స్, ఆకుకూరలు వంటి వాటిలో మెగ్నీషియం అధికంగా ఉంటుంది. ఇవి నిద్ర సమస్యలను తగ్గించడంలో సహాయపడతాయి.
గోళ్లు త్వరగా చిట్లిపోవడం లేదా జుట్టు అసహజంగా ఊడిపోవడం వంటి సమస్యలు ఉన్నా కూడా.. అది కాల్షియం లేదా జింక్ లోపం వల్లే కావొచ్చు. గోళ్లు, జుట్టు ఆరోగ్యంగా ఉండాలంటే ఈ మినరల్స్ చాలా అవసరం. అందుకే రోజువారీ ఆహారంలో పాలు, పన్నీర్, గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ తీసుకోవాలి.
తరచూ తలనొప్పులు రావడం లేదా మైగ్రేన్ లక్షణాలు కనిపించడం కూడా మెగ్నీషియం లోపానికి సంకేతం. మెగ్నీషియం నాడీ వ్యవస్థపై ప్రభావం చూపుతుంది. అది సరిగా లేకపోతే తలనొప్పుల రూపంలో బయటపడుతుంది. అటువంటి సందర్భాల్లో డాక్టర్‌ని సంప్రదించి అవసరమైన టెస్టులు చేయించుకోవాలి.
ఒక వేళ శరీరం అంతా నొప్పిగా అనిపిస్తూ సూదులతో పొడిచినట్లు ఫీలవుతుంటే.. కాల్షియం లోపం ఉన్నట్టు స్పష్టంగా చెప్పవచ్చు. ఇది వెన్నెముక, కండరాలపై ప్రభావం చూపుతుంది. దీనిని తగ్గించాలంటే కాల్షియం అధికంగా ఉన్న ఆహారాలను తీసుకోవడం మంచిది.
ఇలాంటి లక్షణాలు కనిపించిన వెంటనే నిర్లక్ష్యం చేయకుండా పోషకాహారాన్ని సమతుల్యంగా తీసుకోవాలి. అవసరమైతే వైద్యుని సంప్రదించి రక్తపరీక్షలు చేయించుకొని.. లోపాలను తెలుసుకొని తగిన ఆహార మార్పులు చేసుకోవాలి. ఆరోగ్యంగా ఉండాలంటే శరీరానికి అవసరమైన అన్ని మినరల్స్ సమతుల్యంగా ఉండేలా జాగ్రత్త పడాలి.
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)