ABN
, Publish Date – Apr 12 , 2025 | 03:54 AM
ధరణిలో ఎదురైన సమస్యలు పునరావృతం కాకుండా.. పకడ్బందీగా భూభారతి చట్టాన్ని అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

హైదరాబాద్, ఏప్రిల్ 11(ఆంధ్రజ్యోతి): ధరణిలో ఎదురైన సమస్యలు పునరావృతం కాకుండా.. పకడ్బందీగా భూభారతి చట్టాన్ని అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. భూ సమస్యలపై సివిల్ కోర్టుకు వెళ్లాల్సిన అవసరం లేకుండా జిల్లా స్థాయి ట్రైబ్యునల్ ద్వారా పరిష్కరించుకునే వెసులబాటు కల్పించడం, 33 మాడ్యుళ్లను ఆరుకు కుదించడం, కొత్త చట్టంలో కీలక అంశాలుగా నిలవనున్నాయి. తహసీల్దార్లు, ఆర్డీవోలు, కలెక్టర్లకు భూ సమస్యలు పరిష్కరించే అధికారాలు ఇవ్వడంతోపాటు పార్ట్-బీలో ఉన్న భూముల సమస్యకు పరిష్కారం చూపేలా, అసైన్డ్ భూములకు పాస్ పుస్తకాలు ఇచ్చేలా మార్పులు చేశారు. 2025 భూభారతి చట్టం ప్రకారం హక్కుల రికార్డు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంటుంది. ఎవరైనా సర్టిఫైడ్ కాపీలు పొందవచ్చు. 10,954 మంది గ్రామ పాలనాధికారుల(జీపీవో)తో మళ్లీ గ్రామ స్థాయులో రెవెన్యూ సేవలు అందించనున్నారు. ధరణిలో ఉన్న 33 మాడ్యూళ్లను భూభారతి చట్టంలో ఆరుకు కుదించారు.
కొత్తగా అనుభవదారు కాలానికి చోటు కల్పించారు. భూ సర్వే అనంతరం సమగ్ర రికార్డు తయారు, భూమికి-రికార్డుకు లింకు చేస్తారు. భూముల రిజిస్ర్టేషన్, వెంటనే మ్యుటేషన్, ఆ తరువాత ఎంత భూమి రిజిస్టర్ చేసుకున్నారో సర్వే చేసి రైతు చేతికి మ్యాప్ ఇస్తారు. విరాసత్ కోసం దరఖాస్తు చేసుకుంటే, వారసులందరికి నోటీసులు ఇచ్చి అభ్యంతరాల స్వీకరణ అనంతరమే రికార్డుల్లో వివరాలు నమోదు(మ్యుటేషన్) చేస్తారు. అసైన్డ్ భూములకు పట్టాదారు పాస్‌పుస్తకాలు, 13బీ( ఆర్వోఆర్ పాత చట్టంలో సాదాబైనామాల క్రమబద్ధీకరణకు జారీ చేసే ప్రొసీడింగ్స్), 38 ఈ( కౌలు రక్షిత చట్టం ద్వారా దక్కిన భూమిని కౌలుదారుడికి పంచే వాటా భూమి)కి ఆర్డీవో విచారణ అనంతరం పట్టాదార్ పాస్‌పుస్తకం ఇస్తారు. ప్రతి కమతానికి ఆధార్‌లాగా భూధార్ కార్డులు జారీ చేస్తారు. భూభారతి పోర్టల్‌తోపాటు తహసీల్దార్, ఆర్డీవో, కలెక్టర్, సీసీఎల్‌ఏ కార్యాలయంలో మ్యానువల్ రికార్డులు అందుబాటులోఉంచి భద్రపరుస్తారు.
Updated Date – Apr 12 , 2025 | 03:54 AM