ABN
, Publish Date – Apr 12 , 2025 | 12:05 AM
మండలంలోని ముషిడిపల్లి గ్రామంలో వైసీపీ నేతలు బరితెగించారు.

ఎర్రచెరువులో మట్టి తవ్వకాలు చేపడుతున్న దృశ్యం
– టీడీపీ కార్యకర్తపైకి ట్రాక్టర్ ఎక్కించేందుకు యత్నం
– త్రుటిలో తప్పించుకున్న వైనం
– వైసీపీ నేతల బరితెగింపు
శృంగవరపుకోట రూరల్, ఏప్రిల్ 11(ఆంధ్రజ్యోతి): మండలంలోని ముషిడిపల్లి గ్రామంలో వైసీపీ నేతలు బరితెగించారు. మట్టి తవ్వకాలను అడ్డుకున్న టీడీపీ కార్యకర్తపై ట్రాక్టర్‌ను ఎక్కించేందుకు యత్నించగా ఆయన త్రుటిలో తప్పించుకున్నాడు. శుక్రవారం ముషిడిపల్లిలోని ఎర్రచెరువులో స్థానిక వైసీపీ నాయకులు మట్టితవ్వకాలు చేపడుతుండగా గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్త తాటిబుజ్జుల గంగరాజు అడ్డుకున్నాడు. చెరువులో మట్టి తవ్వకాలు ఎందుకు చేపడుతున్నారని ప్రశ్నించాడు. పెద్దఎత్తున గ్రావెల్ దోచుకొని రియల్టర్లకు అమ్ముకోవడం తగదన్నాడు. ఈ ప్రభుత్వంలో అక్రమ తవ్వకాలు సాగవని చెప్పాడు. దీంతో వైసీపీ నాయకులు మట్టిలోడుతో ఉన్న ట్రాక్టర్‌ను గంగరాజుపైకి ఎక్కించేందుకు వేగంగా తీసుకొచ్చారు. ఇది గమనించిన గంగరాజు ఒక్కసారిగా పక్కకు తప్పుకోవడంతో ప్రాణాలతో బయటపడ్డాడు. దీనిపై అధికారులకు ఫిర్యాదు చేస్తానని, వైసీపీ నేతల నుంచి తనకు రక్షణ కల్పించడంతో పాటు ప్రభుత్వ ఆస్తులను కాపాడాలని కోరాడు. ఈ సందర్భంగా గ్రామానికి చెందిన పలువురు యువకులు మాట్లాడుతూ.. పంచాయతీలోని డీపట్టా భూములను గత వైసీపీ ప్రభుత్వం వారి పార్టీ నాయకులకు ధారాదత్తం చేసిందని ఆరోపించారు. చెరువుల్లో ఉపాధి పనులు జరగకుండా చేపల పేరిట వాటిని లీజుకు ఇచ్చి రూ.లక్షలు దండుకుంటున్నారని అన్నారు. దీనిపై గతంలో అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదన్నారు. ప్రభుత్వ భూములు, ఇరిగేషన్ భూములు పెద్దల చేతుల్లో ఉన్నాయని, వాటిపై ఫిర్యాదు చేస్తే అధికారులు వారికి నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకొన్నారే తప్ప ఆక్రమణలు తొలగించలేదని వాపోయారు. ఈ విషయంపై వీఆర్వో నాయుడును వివరణ కోరగా.. ‘మాకు సమాచారం అందిన వెంటనే మట్టి తవ్వకాలు ఆపించాం. మరోసారి తవ్వకాలు చేస్తే చర్యలు తీసుకుంటాం.’అని హెచ్చరించారు.
టీడీపీ కార్యకర్త గంగరాజు
Updated Date – Apr 12 , 2025 | 12:05 AM